దేవాలయాన్ని అపవిత్రం చేసినవారిలో ఒకరి మృతి, ఇద్దరి లొంగుబాటు

ABN , First Publish Date - 2021-04-02T19:39:25+05:30 IST

సుప్రసిద్ధ కొరగజ్జ దేవాలయం హుండీలో అభ్యంతరకమైన పదార్థాలను

దేవాలయాన్ని అపవిత్రం చేసినవారిలో ఒకరి మృతి, ఇద్దరి లొంగుబాటు

మంగళూరు : సుప్రసిద్ధ కొరగజ్జ దేవాలయం హుండీలో అభ్యంతరకమైన పదార్థాలను వేసినవారిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు లొంగిపోయారు. ఈ దేవాలయంలోని స్వామి కొరగజ్జ పరమశివుని అవతారమనే విశ్వాసం ఉంది. మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ ఈ వివరాలను తెలిపారు. 


స్వామి కొరగజ్జ దేవాలయంలోని హుండీలో నవాజ్, తౌఫీక్, అబ్దుల్ రహీం ఇటీవల అపవిత్రమైన పదార్థాలను వేశారని శశి కుమార్ చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన నవాజ్ తన అనారోగ్యానికి కారణం దేవుని మహిమేనని మిగిలిన ఇద్దరు నిందితులకు చెప్పాడని తెలిపారు. పూజారి వద్దకు వెళ్ళి తప్పు చేసినట్లు అంగీకరించాలని కోరాడని తెలిపారు. ఆ తర్వాత నవాజ్ మరణించగా, తౌఫీక్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, దీంతో తౌఫీక్, అబ్దుల్ రహీం భయకంపితులయ్యారని తెలిపారు. వెంటనే వీరిద్దరూ స్వామి కొరగజ్జ దేవాలయం అర్చకుని వద్దకు వెళ్ళి తాము తప్పు చేశామని అంగీకరించారని, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. 


నిందతులపై ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను, సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తామని చెప్పారు. వీరు మూడు దేవాలయాల్లో ఈ విధంగా అపవిత్రమైన పదార్థాలను పడేసినట్లు చెప్పారన్నారు. 


Updated Date - 2021-04-02T19:39:25+05:30 IST