అలాంటి వాడు ఒక్కడు చాలు!

ABN , First Publish Date - 2021-03-26T05:38:54+05:30 IST

ఒక్కోసారి జీవితంలో మనకు ఎవ్వరూ సహాయం చేయడం లేదని అనిపిస్తుంది. ఏదో మంచి పని చేద్దామంటే ఎవరూ సహకరించడం లేదని అనుకుంటాం.

అలాంటి వాడు ఒక్కడు చాలు!

ఒక్కోసారి జీవితంలో మనకు ఎవ్వరూ సహాయం చేయడం లేదని అనిపిస్తుంది. ఏదో మంచి పని చేద్దామంటే ఎవరూ సహకరించడం లేదని అనుకుంటాం. కానీ సమర్థునికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఆత్మవిశ్వాసం కలిగిన వాడు ఒక్కడే సమస్తం సాధించగలడు. అలాంటివాడు తోడు కోసం చూడడు. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.


ఒక్కడెచాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనదా

జక్కనొనర్ప గౌరవుల సంఖ్యులు పట్టిన ధేనుకోటులం

జిక్కగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్‌

మొక్క వడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా!


ఒక్కడు చాలు... ఇతరుల మీద నెపం నెట్టొద్దు. ‘వాడు సహకరించలేదు. వీడు తోడు రాలేదు. వాడు అడ్డు వచ్చాడు కాబట్టి నేను ఈ మేలు చేయలేకపోతున్నాను’ - ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. చేయాలని లేకపోతే ఊరుకోవాలి. అంతేకానీ చేయడానికి ‘ఎవడో అడ్డు’ అని చెప్పొద్దు.


 నువ్వు చేయదలచుకుంటే ఎవడూ అడ్డుకోలేడు. నిశ్చలంగా ఉండి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు  ఒక్కడు చాలు. ఎంతటి బృహత్కార్యమైనా చక్కబెట్టుకోగలడు. దానికి ఉదాహరణ లక్షల మంది సైన్యంతో వచ్చి గోవులను ఆక్రమించిన దుర్యోధనుణ్ణి అర్జునుడు ఒక్కడే ఎదిరించి నిలబడ్డాడు. తన బాణాలతో అర్జునుడు ఒక్కడే మొత్తం సైన్యాన్ని ఓడించాడు. అస్త్రసంపదతో పాటు ధైర్యం కూడా ఉంది కాబట్టే అర్జునుడికి విజయం సాధ్యమయింది. 


 గరికిపాటి నరసింహారావు


Updated Date - 2021-03-26T05:38:54+05:30 IST