5 వేల పాఠశాలల్లో.. ఒకే ఒక్కడు!

ABN , First Publish Date - 2021-10-24T14:44:10+05:30 IST

ఒకే ఒక్కడు..

5 వేల పాఠశాలల్లో.. ఒకే ఒక్కడు!

5 వేల పాఠశాలల్లో ఒక్కరే టీచర్‌ 

విలీనంతో ఏకోపాధ్యాయ బడులు

1, 2 తరగతులకు ఒక్కరితోనే బోధన 

టీచర్‌కు తరగతుల మధ్య కుర్చీలాట 

బడి మొత్తం బాధ్యతలతో అష్టావధానం

40 మంది లోపు విద్యార్థులుంటే వర్తింపు

కిలోమీటరు పరిధిలో స్కూళ్లూ విలీనం 

తల్లిదండ్రుల కమిటీ ఒప్పుకుంటే చాలు 

బడుల్లో నాణ్యమైన విద్య ప్రశ్నార్థకం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒక తరగతికి కనీసం ఒక టీచర్‌ అయినా ఉండాలన్నది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్‌. ఆ తరగతికి చెందిన అన్ని సబ్జెక్టులు అదే ఉపాధ్యాయుడు చెబుతారు. కానీ ఇప్పుడు పాఠశాలల విలీనం దెబ్బకు ఏకంగా ఒక బడి మొత్తానికి ఒకే టీచర్‌ ఉండాల్సిన పరిస్థితి రానుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు భారీగా ఏర్పడనున్నాయి. అంటే ఒక బడికి.. ఒక టీచరే ఉంటారు! రెండు తరగతులున్నా పాఠాలు చెప్పేది మాత్రం ఒక్కరే. ఇలా వంద, వెయ్యి కాదు... ఏకంగా సుమారు 5వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోనున్నాయని అంచనా. పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానికి సంబంధించిన విధి, విధానాలపై కొన్ని రోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఉండగా... అందులో 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.


ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ ఈ విధంగా కలిపేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 34 వేల ప్రాథమిక పాఠశాలలన్నాయి. అందులో తొలి విడత కింద 250మీటర్ల దూరంలో ఉండేవాటిని విలీనం చేయనున్నారు. ఈ జాబితాలో సుమారు 6వేల వరకు బడులు ఉండొచ్చని అంచనా. వీటిలోని విద్యార్థులతో పాటు ఆయా తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులను కూడా ఉన్నత పాఠశాలలకు పంపేస్తారు. ఇక ఆ ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతులకు ఉపాధ్యాయుడు, పిల్లల నిష్పత్తి 1:30గా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ రెండో ఉపాధ్యాయుడు కావాలంటే విద్యార్థుల సంఖ్య కనీసం 40దాటి ఉండాలి. లేకుంటే రెండు తరగతులకు అన్ని సబ్జెక్టులను ఆ ఉపాధ్యాయుడే బోధించాలి. తొలి విడతలో విలీనం కానున్న 6వేల పాఠశాలల్లో కనీసం 5వేల బడుల్లో విద్యార్థుల సంఖ్య 40 లోపే ఉంటుందని సమాచారం. అవన్నీ ఇకపై ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలనున్నాయి.  


ఇదే లెక్క? 

విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నిర్ణయించే విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. నూతన జాతీయ విద్యావిధానం కూడా ఇదే చెబుతోంది. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో దీన్ని అమలు చేయవచ్చు. కానీ పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే ఈ విధానం అమలు సరికాదు. ప్రధానంగా రెండు తరగతుల్లోని విద్యార్థులను కలిపి లెక్కించడం సమంజసం కాదు. ఒక తరగతిలో 20మంది, ఇంకో తరగతిలో 15మంది ఉంటే మొత్తం విద్యార్థులను కలిపి లెక్కించడం ఎంతవరకు సబబన్న ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో అసలు వర్తింపజేయకూడదు. ప్రాథమిక పాఠశాలల్ని గ్రామాల్లో ఆవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. దీనివల్ల పిల్లలు ఎక్కువగా చేరతారనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ కీలక ఉద్దేశాన్ని విస్మరించి ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల ఇళ్లకు పాఠశాలలు కొంత దూరమవుతాయి. ఇంకోవైపు రెండు తరగతుల్లోని విద్యార్థుల సంఖ్యను కలిపి లెక్కించి ఏకోపాధ్యాయగా మార్చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రాథమిక స్థాయిలో విద్య నాణ్యతపై తీవ్ర ప్రభావం చూసిస్తుందని అంటున్నారు. 


ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు బేఖాతరు 

పాఠశాలల విలీనాన్ని ఒక కిలోమీటరు పరిధి వరకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో తొలివిడతలో 250మీటర్ల దూరం నిబంధన విధించారు. ఆ తర్వాత ఏడాదిలోగా కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలనూ విలీనం చేస్తారన్నది అంతర్గత సమాచారం. మరోవైపు 250 మీటర్ల దూరంలోని పాఠశాలల విలీనం అని ఉత్తర్వులు ఇచ్చినా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు ఒప్పుకుంటే ఇంకా దూరంలో ఉన్న బడులను కూడా విలీనం చేయొచ్చని పేర్కొన్నారు. తొలివిడతలో 6వేల స్కూళ్లు, ఆ తర్వాత మరో 7వేల వరకు పాఠశాలల్ని ఇలా విలీనం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో చాలాచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. అక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు వాటికి అదనంగా భారీ సంఖ్యలో పాఠశాలల్ని చేరుస్తుండటం విద్యావేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 

Updated Date - 2021-10-24T14:44:10+05:30 IST