సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఓఎన్జీసీ రూ.వంద కోట్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-04T11:41:39+05:30 IST

చమురు సహజవాయువు సంస్థ కోనసీమలో నిర్వహిస్తున్న కార్యకలాపాల సమయంలో సంక్షోభ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఓఎన్జీసీ రూ.వంద కోట్లు ఇవ్వాలి

మంత్రులు సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌, ఎమ్మెల్యేల డిమాండ్‌


అమలాపురం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): చమురు సహజవాయువు సంస్థ కోనసీమలో నిర్వహిస్తున్న కార్యకలాపాల సమయంలో సంక్షోభ పరిస్థితుల్లో ప్రాంత ప్రజలను ఓఎన్జీసీ సంస్థ ఆదుకోవాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ కాకినాడ, రాజమహేంద్రవరం ఎసెట్‌ మేనేజర్లతో అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కీలక సమావేశం శుక్ర వారం జరిగింది.


ఎంపీ చింతా అనురాధ, కోనసీమ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకటసతీష్‌ కుమార్‌, కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, రాపాక వరప్రసాద రావు, కాకినాడ, రాజ మహేంద్రవరం ఓఎన్జీసీ ఎసెట్‌ మేనేజర్లు ఆర్‌పీ.పటేల్‌, మార్బులేలతో రెండు గంటల పాటు ఆర్డీవో కార్యాలయంలో కీలకచర్చలు జరిగాయి. అనంతరం ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో మంత్రులు విశ్వరూప్‌, బోస్‌లు మాట్లాడారు. కోనసీమలో చమురు, సహజవాయువు నిక్షేపాలను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ సంస్థ వంద కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


జిల్లాలో కార్యకలాపాల నిర్వహణకు రూ.5కోట్లను కలెక్టర్‌కు అందించడంతోపాటు కోనసీమలో ఉన్న 4.28లక్షల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 10కిలోల బియ్యం, రూ.వెయ్యి విలువైన నిత్యావసర వస్తువుల కిట్లను అందించాల్సిందిగా ఓఎన్జీసీ ఎసెట్‌ మేనేజర్లను కోనసీమ ప్రజాపత్రినిధులు డిమాండ్‌ చేశారు.


ఇందుకు సుమారు రూ.50కోట్లు అంచనా వ్యయం అవుతుందని మంత్రులు పేర్కొన్నారు. తాము ప్రతిపాదించిన డిమాండ్లను ఓఎన్జీసీ సీఎండీతో చర్చించి సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాల్సిందిగా  ఓఎన్జీసీ సంస్థ అధికారులను కోరినట్టు మంత్రులు వెల్లడించారు. అనంతరం సమావేశంలో చేసిన తీర్మానం కాపీపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతకాలుచేసి ఎంపీ చింతా అనురాధ ద్వారా ఓఎన్జీసీ ఎసెట్‌ మేనేజర్లకు ప్రతిపాదిత లేఖను అందించారు. 

Updated Date - 2020-04-04T11:41:39+05:30 IST