రాజన్న క్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-29T06:12:52+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో తొలుత రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

రాజన్న క్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

-కొవిడ్‌ నిబంధనలపై అవగాహన

వేములవాడ, జనవరి 28 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో తొలుత రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఫలితంగా వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట నిండిపోయింది. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం పంచిపెట్టారు. శుక్రవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి ఏర్పాట్లు పర్యవేక్షించడంతోపాటు పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కొవిడ్‌ నిబంధనలపై అవగాహన

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఆలయ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి మార్గం వద్ద థర్మల్‌గన్‌తో భక్తుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడంతోపాటు శానిటైజర్‌ అందజేస్తున్నారు. క్యూలైన్లలోనూ శానిటైజర్‌ అందుబాటులో ఉంచారు. అందరూ మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. మాస్కు లేని వారికి మాస్కు అందిస్తున్నారు.  భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చని వివరిస్తున్నారు. కానీ రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భౌతికదూరం పాటించడం సాధ్యం కావడం లేదు.  

బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు 

ఆలయ పరిసరాలలో బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ పరిసరాలు, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణం, క్యూలైన్లలో తనిఖీలు చేశారు.  

Updated Date - 2022-01-29T06:12:52+05:30 IST