కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-17T06:15:13+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఐదో రోజు యథావిధిగా కొనసాగింది. లాక్‌డౌన్‌తో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎస్పీ రాహుల్‌హెగ్డే లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌
జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

- పర్యవేక్షించిన ఎస్పీ రాహుల్‌హెగ్డే

- జిల్లా సరిహద్దుల్లో ఆకస్మిక తనిఖీలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఐదో రోజు యథావిధిగా కొనసాగింది. లాక్‌డౌన్‌తో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.  ఎస్పీ రాహుల్‌హెగ్డే లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.  జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్‌ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని, అనవసరంగా వస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘనపై  999 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

నిర్మానుష్యం

  లాక్‌డౌన్‌తో సిరిసిల్లలోని గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, చేనేత చౌక్‌, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, మార్కెట్‌ ఏరియా, పెద్ద బజార్‌ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్‌కంటే ముందు 6 గంటల నుంచి 10 వరకు రద్దీగా ఉన్న ప్రాంతాలు తర్వాత వెలవెలబోయాయి. పోలీసులు దుకాణాలను మూసి వేయించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు షాపులపై కేసులు నమోదు చేశారు. వేములవాడ, చందుర్తి, రుద్రంగి, బోయిన్‌పల్లి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. వర్షం కురవడంతో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. 

వీర్నపల్లి: కరోనా కట్టడికోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వీర్నపల్లి మండలంలో కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చి పది గంటలు కాగానే  ఇళ్లకు వెళ్లిపోతున్నారు.  మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఎస్సై రవీందర్‌ నేతృత్వంలోని పోలీసులు జీపీఎస్‌ ఆధారంగా లాక్‌డౌన్‌ను పరిశీలిస్తున్నారు.   అనవసరంగా రోడ్లమీదకు వచ్చేవారు, మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి జరిమానా విధిస్తున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామాల్లోని ప్రధాన రహదారులన్నీ 10గంటల తరువాత నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

 ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలో లాక్‌డౌన్‌ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. మండల కేంద్రంతోపాటు గొల్లపల్లి, బొప్పాపూర్‌, వెంకటాపూర్‌, తిమ్మాపూర్‌, నారాయణపూర్‌, బండలింగంపల్లి, రాగట్లపల్లి, హరిదాస్‌నగర్‌, పదిర గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 వరకు జన సంచారం కనిపించింది. పది గంటల అనంతరం దుకాణాలను మూసి వేయడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు సీఐ మొగిలి, ఏఎస్సై వెంకటేశ్వర్లు  కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

Updated Date - 2021-05-17T06:15:13+05:30 IST