ప్రవాసాంధ్రులు వచ్చారు...

ABN , First Publish Date - 2020-05-22T11:27:07+05:30 IST

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారిలో గురువారం 114 మంది జిల్లా జిల్లాకు వచ్చారు. వారిని రాజంపేటలోని క్వారంటైన్‌కు

ప్రవాసాంధ్రులు వచ్చారు...

జిల్లాకు 114 మంది రాక

రాజంపేటలో క్వారంటైన్‌కు తరలింపు

నెలాఖరులోగా 6 వేల మంది వచ్చే అవకాశం

కంటైన్మెంట్‌ జోన్‌లలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌


కడప, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారిలో గురువారం 114 మంది జిల్లా జిల్లాకు వచ్చారు. వారిని రాజంపేటలోని క్వారంటైన్‌కు తరలించారు. గల్ఫ్‌ దేశాల్లో లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. ఉపాధి కోసం కువైత్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు జిల్లా నుంచి వేలాది మంది వలస వెళ్లారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేందుకు ఇటీవల భారత ఎంబసీలో 30 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ కువైత్‌లో కరోనా టెస్టులు చేసి ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


అలా వస్తున్న ప్రవాసాంధ్రుల్లో జిల్లాకు చెందిన 6 వేల మంది ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. వారిలో 114 మంది గురువారం రాత్రి 11 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని రాజంపేటలోని అన్నమాచార్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. కరోనా టెస్టులు చేసి 14 రోజుల తరువాత ఇంటికి పంపుతామని.. మరో 14 రోజులు ఇంట్లోనే హౌస్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ కామన్‌ క్వారంటైన్‌లో ఉండడానికి ఇష్టపడని వారికి రెంటెడ్‌ క్వారంటైన్‌లు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు పేర్కొన్నారు.


కంటైన్మెంట్‌లో లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

కడప నగరంలోని పలు వార్డులు, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేలు, మైదుకూరులోని పలు వార్డులతో పాటు ఓబులవారిపల్లె, బద్వేలు మండలం, సంబేపల్లె మండలాల్లోని ఆయా గ్రామాల్లోని కంటైన్మెంటు ఏరియాల్లో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్కడ ఎవరినీ అనుమతించడం లేదు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తమిళనాడు కోయంబేడుకు వెళ్లిన డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలపై పక్కాగా నిఘా ఉంచుతున్నట్లు వివరించారు.

Updated Date - 2020-05-22T11:27:07+05:30 IST