సాగుతున్న మోదీ జైత్రయాత్ర

ABN , First Publish Date - 2021-09-07T06:03:19+05:30 IST

భారత దేశ రాజకీయాల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత 20 సంవత్సరాలు నిరాఘాటంగా తొలుత ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు నరేంద్రమోదీ తప్ప మరొకరు లేరు...

సాగుతున్న మోదీ జైత్రయాత్ర

భారత దేశ రాజకీయాల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత 20 సంవత్సరాలు నిరాఘాటంగా తొలుత ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు నరేంద్రమోదీ తప్ప మరొకరు లేరు. ప్రపంచంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న నాయకుడు కూడా మోదీయే. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 13 సంవత్సరాలు గుజరాత్ ప్రజలు ఆయనను తమ ప్రియతమ ముఖ్యమంత్రిగా ఆదరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏడేళ్లుగా దేశ ప్రజల అభిమాన ప్రధానమంత్రిగా ఆయన ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఇవాళ ప్రపంచ నేతల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన నేత నరేంద్రమోదీ. తాజాగా అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో 70 శాతం రేటింగ్స్ సాధించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మనీ ఛాన్సిలర్ ఏంజిలా మెర్కిల్ కన్నా ప్రజల్లో ఎక్కువ ఆమోదయోగ్యత పొందిన నాయకుడు మోదీ.


నిజానికి భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ కూడా అధికారంలో మోదీ రికార్డును అధిగమించలేకపోయారు. వారెవరికీ ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన అనుభవం లేదు. ప్రాంతీయ పార్టీ నేతల్లో రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన ఘనత పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు, సిక్కింలో పవన్ చామ్లింగ్, ఇప్పుడు ఒడిషాలో నవీన్ పట్నాయక్‌కు దక్కితే, వారి తర్వాత 9 సంవత్సరాలు వరుసగా ముఖ్యమంత్రి పదవి నిర్వహించే అవకాశం చంద్రబాబుకే దక్కింది. కరుణానిధి 1969–2011 మధ్య దాదాపు 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వరుసగాఎప్పుడూ అధికారంలో లేరు. జయలలిత, ఎన్టీఆర్ లాంటి సంచలన రాజకీయనాయకులు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన చరిత్ర ఉన్నది. వీరెవ్వరికీ ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం రాకపోగా జాతీయ రాజకీయాల్లోకి కూడా రాలేకపోయారు. ఒక్క మోదీకే ప్రతి ఎన్నికల్లో పోటీచేసి గెలిచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి పదవి వరకుచేరుకున్న అపూర్వ చరిత్ర ఉన్నదని చెప్పుకోవచ్చు. మూడు దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అస్థిరతకు స్వస్తి చెప్పి పూర్తి మెజారిటీతో ఆయన ఢిల్లీలో అడుగుపెట్టారంటేనే ప్రజాబలమే ఆయనకు శ్రీరామరక్షగా మారిందని చెప్పవచ్చు. 


అధికారంలో రెండు దశాబ్దాలుగా ఉండడమే కాదు, అటు ముఖ్యమంత్రి పదవిలోనూ, ఇటు ప్రధానమంత్రి పదవిలోనూ తనదైన శైలిలో పరిపాలన చేసి అత్యంత నిర్మాణాత్మకమైన పాలన చేసినందువల్లే నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ జైత్ర యాత్ర సాగించగలుగుతోంది. పదవిని దేశసేవ చేసే అవకాశంగా భావించి ఒక అంకితభావంతో అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భావించినందువల్లే ఆయన ఓటమి ఎరుగని నేతగా నీరాజనాలు అందుకోగలుగుతున్నారు. అందుకే మోదీ రెండు దశాబ్దాల జైత్రయాత్రను సెప్టెంబర్ 17న ఆయన జన్మదినంనాడు ప్రారంభించి, అక్టోబర్ 7న ఆయన ముఖ్యమంత్రి పదవిలో తొలుత ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు ‘సేవా అవుర్ సమర్పణ్ అభియాన్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. 


గుజరాత్‌లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13వేల మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మోదీ ఈ పరిణామాలను చూసి ఖిన్నుడు కాలేదు. కొందరు ముఖ్యమంత్రుల్లాగా ప్రజలు ప్రకృతి వైపరీత్యాలకు గురై ఆక్రోశిస్తుంటే గడీలకు పరిమితమయి కూర్చోలేదు. ప్రజల మధ్యకు వెళ్లారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆ ఏడాది దీపావళిపండుగ నాడు భూకంప బాధితుల నివాసాల్లో గడపాలని మోదీ కోరారు. 2001 నవంబర్ 14న మోదీ, ఆయన కేబినెట్ సహచరులు భూకంపబాధితుల నివాస ప్రాంతాలకు వెళ్లారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోదీ ఒక అవకాశంగా మలుచుకుని పెద్ద ఎత్తున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చటం కోసం వాటికి ఐదేళ్ల పాటు ఎక్సయిజ్‌ సుంకంలోను, అమ్మకపు పన్నులోను రాయితీలు కల్పించారు. ఎస్సార్, అదానీ గ్రూప్, సెజ్లాన్, సాంఘీ గ్రూప్, టాటా పవర్, సూర్య గ్రూప్, జేపీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు క్యూలు కట్టాయి. ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో సుసంపన్న వాతావరణం ఏర్పడింది. విశాలమైన రహదారులు, భూ కంపాన్ని తట్టుకునే ఇళ్లు, పార్కులను నిర్మించారు. చాలా పెద్ద కార్పొరేట్, ప్రభుత్వరంగ కంపెనీలు గ్రామ సముదాయాలను దత్తత తీసుకుని సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాయి. రికార్డుస్థాయిలో కచ్‌తో సహా అనేక గ్రామాలు, పట్టణాలు పునర్నిర్మాణమయ్యాయి. ఒకప్పుడు భూకంపం జరిగిన ప్రాంతాలన్నీ ఇప్పుడు అత్యంత ఆధునిక అభివృద్ధికి నిలయాలుగా కనిపిస్తాయి. ఒక్క కచ్ ప్రాంతమే కాదు నరేంద్రమోదీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికా భివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోదీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవరూ ఊహించలేదు. అదే విధంగా తొలిసారి ప్రధానమంత్రిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా ఆయన రోజురోజుకూ ఒకబలమైన నేతగా ఎదుగుతారని ఎవరూ భావించలేదు. 


మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీ రాజ్‌ను, బుజ్జగింపు రాజకీయాలను భరిస్తూ వస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కలిగించే దిశగా మోదీ చర్యలు తీసుకున్నారు. ఇవాళ ప్రజలు సైద్ధాంతిక అంశాలపై సానుకూలంగానో, వ్యతిరేకంగా చర్చిస్తున్నారంటే అందుకు కారణం మోదీ అనుసరిస్తున్న పద్ధతులే ననడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల పట్ల విముఖతను తొలగించి రాజకీయ అంశాలపై ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేస్తున్నారంటే అది మోదీ కల్పించిన ధైర్యమే. ఒక ప్రధాని వారణాసిలో గంగాహారతిలో పాల్గొన్నా, కేదార్ నాథ్ గుహలో తపోముద్రలో ఉన్నా, రామమందిర నిర్మాణానికి వీలు కల్పించినా, 370 అధికరణ రద్దు చేసినా దేశంలో ఒక సగటు భారతీయుడు ఉప్పొంగిపోయే పరిస్థితి ఆయన కల్పించారు. ధైర్యంగా తన భావాలను ప్రకటించగలిగిన స్థితికి తీసుకువచ్చారు. సైద్ధాంతికత విషయంలో ఎలాంటి బూటకపు ఆలోచనా విధానాన్ని ఆయన అనుసరించలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై తిరుగులేని వైఖరిని ప్రదర్శించారు. ఒక నిస్వార్థుడైన, దేశభక్తుడైన, దేశశ్రేయస్సు కోసమే నిరంతరం ఆలోచించే ఒక ప్రధానిని ప్రజలు ఎందుకు వదులుకుంటారు?


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-09-07T06:03:19+05:30 IST