పాడి రైతులకు పంగనామం

ABN , First Publish Date - 2021-02-25T06:51:15+05:30 IST

పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీని..

పాడి రైతులకు పంగనామం

పాల బిల్లుల చెల్లింపులో 30శాతం కోత

వెన్నశాతంలో తేడా అంటూ మెలిక 

అమూల్‌ చర్యలపై మండిపడుతున్న ఉత్పత్తిదారులు

సరఫరా నిలిపేస్తున్న కొందరు రైతులు

తాజా పరిణామంపై తలపట్టుకుంటున్న యంత్రాంగం

నేడు వివిధ స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): అమూల్‌ వస్తోంది.. పాడిరైతులకు ఇక మంచిరోజులొచేస్తాయ్‌! అంటూ చేసిన ఆర్భాటం మూణ్నాళ్ల ముచ్చటైంది. భారీ ప్రోత్సాహకం ఇస్తామంటూ పాడి రైతులకు ఆశచూపిన సంస్థ మొదట్లోనే చుక్కలు చూపెడుతోంది. పాలకు గతం కన్నా మెరుగైన ధరలు, గ్రామీణ మహిళల ఆర్థిక పరిపుష్టి, పాడిపరిశ్రమ అభివృద్ధి కోసమే అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని రాష్ట్రప్రభుత్వం ఊదరగొడుతుండగా ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అదనపు రాబడి సంగతి దేవుడికి ఎరుక తమకు రావాల్సిన మొత్తాల్లోనే కోతపెట్టి పంగనామాలు పెడుతున్నారని పాడిరైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో గడిచిన వారం రోజులుగా పాడిరైతుల్లో అమూల్‌ చర్యలు అలజడి కలిగిస్తుండగా, ఆ సంస్థ వైఖరిపై పాల ఉత్పత్తిదారులు మండిపడుతున్నారు. తాజాగా రైతులకు అమూల్‌ చెల్లించాల్సిన బిల్లుల్లో దాదాపు 30శాతం వరకు కోత విధించడం అందుకు కారణం కాగా కొన్ని గ్రామాల వారు ఏకంగా ఆమూల్‌కు పాలుపోసేందుకు నిరాకరించి ప్రైవేటు డెయిరీలవైపు వెళ్తున్నారు. ఈ తాజా పరిణామాలపై యంత్రాంగం తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. 


‘పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఒంగోలు డెయిరీని తిరిగి గాడిన పెడతాం. నష్టాలకు కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజాప్రతినిధులు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. తద్వారా డెయిరీ గాడినపడి తమకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుందని పాడిరైతులు ఆశపడ్డారు. అయితే ఒంగోలు డెయిరీని అభివృద్ధి చేయకపోగా మిణుకుమిణుకుమంటున్న రైతుల ఆశలపై నీళ్లు జల్లుతూ ఏకంగా కార్యకలాపాలను ప్రభుత్వం నిలిపేసింది. పైగా పాడిరైతులకు ప్రయోజనం పేరుతో రెడ్‌కార్పెట్‌తో అమూల్‌ సంస్థకు స్వాగతం పలికింది. అలా జిల్లాలో గతేడాది నవంబరు 21 నుంచి అధికారికంగా అమూల్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు ఉన్న డెయిరీల నిర్వహణ, పాల సేకరణ, చెల్లింపులు ఇతరత్రా వ్యవహారాలకు భిన్నంగా అధికార యంత్రాంగాన్ని నేరుగా ప్రభుత్వం రంగంలోకి  దించింది. గ్రామాల్లో వెలుగు ద్వారా మహిళా పాడి రైతుల గ్రూపుల ఏర్పాటు, సహకారశాఖ ద్వారా ఆ సంఘాల రిజిస్ట్రేషన్‌, పశుసంవర్థకశాఖ వైద్యులను ఆయా రూట్లకు మెంటర్లుగా ఏర్పాటు చేసి గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభించారు. అవసరమైన మిషనరీని తాజా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాటిని ప్రభుత్వమే సరఫరా చేయగా ఒంగోలు చేరిన పాలను ఇక్కడి డెయిరీలోని మిషనరీ ద్వారా అమూల్‌ సిబ్బంది ప్రాసెస్‌ చేస్తున్నారు.


రోజుకు 23వేల లీటర్లు

జిల్లాలో మొత్తం 200 గ్రామాల నుంచి పాలు సేకరించాలని నిర్ణయించగా ప్రస్తుతం 160 గ్రామాల నుంచి రోజుకు సుమారు 23వేల లీటర్లు వస్తున్నట్లు సమాచారం. ఆ గ్రామాలను 20రూట్లుగా విభజించారు. మొత్తం ప్రక్రియను అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నిజానికి అంతస్థాయిలో ప్రభుత్వం దృష్టిపెట్టి నప్పుడు ప్రస్తుత సమయంలో అమూల్‌కు రోజుకు కనీసం 60వేల లీటర్లు రావాలి. అలాంటిది అందులో సగం కూడా వస్తున్న పరిస్థితి లేదు. ఆ విషయం అలా ఉంచితే అమూల్‌ పాలసేకరణ ప్రారంభం నుంచి రైతుల్లో ఆ సంస్థకు పాలు పోసేందుకు విముఖత వ్యక్తమవుతోంది. గరిష్ట ధర 10శాతం వెన్న, 9శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఉన్న పాలకు లీటరుకు రూ.64.90గా అమూల్‌ నిర్ణయించగా ఇప్పటి వరకూ ఆయా డెయిరీలు ఇస్తున్న ధరల కన్నా అది ఎక్కువగా ఉంది. అయితే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఎస్‌ఎన్‌ఎఫ్‌ 7.5 నుంచి 8.5శాతం వరకు ఉంటుండగా అమూల్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ 8.7శాతం కన్నా తక్కువ ఉంటే డబ్బులు ఇవ్వబోమనడంతో చాలాప్రాంతాల పాడి రైతులు పాలుపోసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో యంత్రాంగమంతా అమూల్‌ సేవలో తరిస్తున్నప్పటికీ గత మూడు నెలలు  పాల ఉత్పత్తి అత్యంత ఎక్కువగా ఉండే సీజన్‌ అయినా రోజువారీ 23వేల లీటర్లు మించి రావడం లేదు. 


బిల్లుల చెల్లింపులో తకరారు

తాజాగా బిల్లులు చెల్లింపు విషయంలో అమూల్‌ సంస్థ వ్యవహరించిన తీరు ప్రస్తుతం పాడి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం గ్రామస్థాయిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంఘం ద్వారా సేకరణ జరుగుతోంది. అందుకోసం గ్రామంలో సంఘం తరఫున ఒక వ్యక్తి ఆ బాధ్యత వహిస్తూ రైతులు తెచ్చిన పాలను ఎస్‌ఎన్‌ఎఫ్‌ వెన్నశాతంను కొలిచి క్యాన్లలో పోయించి ఒంగోలుకు పంపుతారు. ఆధునిక మిషన్లు కావడంతో స్ర్కీన్‌పైన రైతువారీ పోసే పాలలో ఎన్‌ఎస్‌ఎఫ్‌ వెన్నశాతం బహిరంగంగానే అప్పటికప్పుడు కనిపిస్తుంది. అవే వివరాలను అక్కడి సిబ్బంది ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీఎఫ్‌)పోల్డర్‌లో నమోదు చేస్తారు. వాటిని రైతు వారీగా అమూల్‌ సంస్థకు ఏపీడీడీఎఫ్‌ నుంచి పంపిస్తారు. తదనుగుణంగా ప్రతి పది రోజులకు ఒకసారి అమూల్‌ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుంది. తొలుత రెండు మాసాలు ఇలా సజావుగానే సాగినప్పటికి ఇటీవల గ్రామస్థాయిలో రైతు వారీ నమోదవుతున్న వెన్నశాతం సగటుకు, ఆ గ్రామం నుంచి ఒంగోలుకు పాలు చేరిన తర్వాత అమూల్‌ సిబ్బంది పరిశీలించినప్పుడు వస్తున్న  వెన్నశాతాలకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి దాని వల్ల సంస్థకు భారీగా నష్టం వస్తుందని కోత పెట్టారు. 


30శాతం కోతతో బిల్లులు

ఈనెల 1 నుంచి 10వతేదీ వరకు పోసిన పాలకు పదిరోజుల క్రితం రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తాల్లో వాస్తవంగా సదరు సమయంలో తమకు రావాల్సిన దాని కన్నా 30శాతం వరకూ  తగ్గడాన్ని పలువురు రైతులు గుర్తించారు. దానిపై గ్రామాల్లో పెద్ద అలజడి రేగుతుండగా పలుచోట్ల రైతులు స్థానిక పాలసేకరణ సిబ్బంది, అందుబాటులో ఉంటున్న వెటర్నరీ అధికారులను నిలదీస్తున్నారు. చివరకు వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతంలో వ్యత్యాసంతో ఇలా చేశారన్న విషయం బహిర్గతం కాగా ఏ గ్రామంలో తేడా ఉంటే అక్కడ చర్యలు తీసుకోకుండా అందరికీ ఇలా కోతపెట్టడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయమై జె.పంగులూరు మండలం ముప్పవరంలో మంగళవారం సాయంత్రం పెద్ద రగడే జరిగింది. గ్రామానికి వచ్చిన అమూల్‌ ప్రతినిధిని అక్కడి రైతులు నిర్బంధించినంత పనిచేశారు. చివరకు అధికారుల సాయంతో అతను బయటికి రాగా కోత విధించిన నగదు ఇచ్చేంత వరకు తాము పాలు పోసేది లేదని ఆ గ్రామస్థులు తేల్చి చెప్పారు. అలాగే అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని పలుగ్రామాల వారు కూడా అమూల్‌కు పాలుపోసేందుకు విముఖత చూపుతూ ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. 


అధికార యంత్రాంగంలో అమూల్‌ అలజడి

ముప్పవరం ఘటనతో అధికార యంత్రాంగం కూడా అలజడికి గురైంది. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఏపీడీడీఎఫ్‌కు ప్రస్తుత ఎండీగా ఉండి అమూల్‌ వ్యవహారాలకు ప్రభుత్వం తరఫున పర్యవేక్షిస్తున్న ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబు ఈ విషయమై కలెక్టర్‌ ఇతర జిల్లా అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. అనంతరం పొద్దుపోయే వరకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. రైతుల్లో అలజడి మరింతగా పెరిగితే సేకరణకు తీవ్ర ప్రతిబంధకం అవుతుందని గుర్తించి తక్షణం లోపాలు సరిదిద్దాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తదనుగుణంగా గురువారం పశుసంవర్థక, వెలుగు, సహకారశాఖల అధికారులతో దీనిపై కలెక్టర్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కాగా జిల్లాలో అమూల్‌ పాలసేకరణ వ్యవహారాలను ప్రభుత్వపరంగా పరిశీలించే నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ హనుమంతరావు ఈ విషయమై మాట్లాడుతూ తాజాగా రైతులకు చెల్లింపు చేసిన బిల్లుల్లో తగ్గింపు వాస్తవమేనని చెప్పారు. ఆయా గ్రామాల్లో రైతువారీ నమోదవుతున్న వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాలకు, అమూల్‌కు పాలు చేరిన తర్వాత పరిశీలించిన శాతాలకు తేడాలు వస్తున్నాయన్నారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి రైతుల్లో నెలకొన్న అసంతృప్తి వెళ్లిందని తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుతం తగ్గించిన మొత్తాలను తిరిగి వచ్చేనెల తొలివారంలో ఇస్తారని చెప్పారు. 

Updated Date - 2021-02-25T06:51:15+05:30 IST