రిమ్స్‌లో వృద్ధుడి మృతిపై ప్రభుత్వం సీరియస్

ABN , First Publish Date - 2020-08-13T14:48:24+05:30 IST

ఒంగోలు రిమ్స్‌లో వృద్ధుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనను..

రిమ్స్‌లో వృద్ధుడి మృతిపై ప్రభుత్వం సీరియస్

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఒంగోలు రిమ్స్‌లో వృద్ధుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. సింగరాయకొండ మండలం కె. బిట్రగుంటకు చెందిన కాంతా రావు అనే వృద్ధుడు రిమ్స్‌కు వచ్చి ఆసుపత్రి ఆవరణలో మరణించగా రెండు రోజులపాటు పట్టించుకోకపోవడంతో ఆయన చెవులు, ముక్కు కుక్కలు పీక్కుతిన్న విషయమై మంగళ వారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రభు త్వం ద్విసభ్య కమిటీని నియమించింది.


ఆ కమిటీ సభ్యులైన విజయవాడ, గుంటూరుకు చెందిన డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ కిరణ్‌లు బుధవారం ఒంగోలు వచ్చారు. కాంతారావు మృతికి గల కారణాలపై రిమ్స్‌ అధికారులను విచారించారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, కొమ్ము సుజన్‌, దారా అంజయ్య తదితరులు విచారణ కమిటీ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంతారావు కుటుంబాన్ని ఆదుకోవాలని,  రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. 


మరోవైపు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కూడా ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించా రు. జరుగుమల్లి మండలం బిట్రగుంటకు చెందిన కాంతారావు కరోనాతో రిమ్స్‌కు వచ్చిన తర్వాత ఓపీ తీసుకోలేదన్నారు. అందువల్లే అతని అచూకీ లేక కుటుంబసభ్యులకు సమా చారాన్ని అందించలేకపోయామన్నారు. వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో వైద్యులు వారి శక్తి సామర్థ్యాలను మించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయా న్ని అందరూ గుర్తించాలన్నారు.


జీజీహెచ్‌ నుంచి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి దిద్దుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. కరోనా మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోవడంతో వాటిని ఖననం చేయడం సవాల్‌గా మారింద న్నారు. గ్రామాల్లో అడ్డుకుంటున్న పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఏదో ఒకవిధంగా  వాటిని ఖననం చేస్తున్నామన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కరోనాతో మృతిచెందిన వారి వివరాలను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతామని ఆయన చెప్పారు. 


Updated Date - 2020-08-13T14:48:24+05:30 IST