Abn logo
Sep 20 2021 @ 23:57PM

ఉల్లి రైతు కన్నీరు

సాగులో ఉన్న ఉల్లి

పతనమైన ధర 

క్వింటాల్‌ రూ.600 

సాగు పెట్టుబడి కూడా దక్కదని రైతుల ఆవేదన 


పెండ్లిమర్రి, సెప్టెంబరు 20: ఉల్లి రైతు కంట కన్నీరు కారుతోంది. పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. సాగు పెట్టుబడి కూడా దక్కడం లేదు. అప్పులు చేసి లక్షలాది రూపాయలు సాగు పెట్టుబడి పెట్టినా ధరలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పొలం మీదనే ఉల్లిని రైతులు వదిలేస్తున్నారు. మండలంలోని నాగాయపల్లె, గొందిపల్లె, నల్లయ్యగారిపల్లె, బాలయ్యగారిపల్లె, తిప్పరాజుపల్లె, చీమలపెంట, గుర్రాలచింతలపల్లె, మీనయ్యగారిపల్లె, కారపరెడ్డిపల్లె, మరికొన్ని గ్రామాల్లో 500 ఎకరాలకు పైగా ఉల్లి పంటను సాగు చేశారు. రైతుల శ్రమను మినహాయిస్తే సాగు పెట్టుబడులే రూ.5 కోట్లకు పైగా పెట్టారు. 


కంట కన్నీరు

ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీసం సాగు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఉల్లి విత్తనాలను కర్నూలు జిల్లా నుంచి సేరు రూ.1100 నుంచి రూ.1300లతో కొనుగోలు చేశారు. ఎకరాకు 15 సేర్లు విత్తనాలు అవసరమవుతాయి. సేద్యం, పురుగు మందులు, ఎరువులు,  కూలీ ఇలా మొత్తం ఖర్చులన్నీ కలుపుకుంటే లక్ష వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చిన తరువాత అమ్ముకుని అప్పు తీర్చుకోవచ్చని ఆశించారు. ఉల్లిగడ్డలను చెన్నై, విజయనగరం, సేలం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో విక్రయించేవారు. ధర ఆశాజనకంగా ఉంటే ఖర్చులు, సాగు పెట్టుబడులు పోను రైతుకు కాసింత మిగులుతుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ధర భారీగా పతనమైంది. క్వింటాల్‌ రూ.600 పలుకుతోంది. ఈ ధరతో కనీసం సాగు పెట్టుబడికి వడ్డీలు కూడా రావని రైతులు వాపోతున్నారు. పొలంలో ఉన్న గడ్డలను పీకాలంటే ఎకరాకు రూ.20 నుంచి 25 వేలు ఖర్చు వస్తుంది. ధర దారుణంగా పడిపోవడంతో కొందరు రైతులు గడ్డలను పీకకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. కొందరైతే కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లిగడ్డలు పీకి వాటిని పల్లెలకు తీసుకెళ్లి అక్కడక్కడా అమ్ముకుంటున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి

ఎకరాకు లక్ష రూపాయల దాకా సాగు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశాం. ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ.600లతో అమ్మితే రూ.60 వేలు వస్తుంది. ఇలాగైతే రైతు శ్రమం అటుంచి, కనీసం పెట్టుబడి రాదు. కనుక ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


ఇలాగైతే వ్యవసాయం చేయలేం.. 

ఉల్లి దిగుబడి బాగా వచ్చింది. ఈ సారైనా అప్పులు తీరుతాయని ఆశపడ్డాను. అయితే ధర చూస్తే మా ఆశ అడియాశలైంది. ఇలాగే తరచూ రైతులు నష్టపోతుంటే వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ప్రభుత్వమే ఉల్లి రైతును ఆదుకోవాలి. 

- తిరుపాల్‌రెడ్డి, నాగాయపల్లె