ఉల్లి లొల్లి

ABN , First Publish Date - 2020-10-21T11:46:13+05:30 IST

నగర మార్కెట్‌లో ఉల్లి ధర రూ.84కి చేరింది. ఎక్కడ కొన్నా అంతకు తక్కువ ఇవ్వడం లేదు. రైతుబజార్లలో కిలో రూ.77 రేటు పెట్టారు.

ఉల్లి లొల్లి

రైతుబజార్లలోనే రూ.77

బయట మార్కెట్‌లో రూ.84-89 మధ్య విక్రయం

ఇంకా పెరిగే అవకాశం

జ్ఞానాపురం మార్కెట్‌లో మతలబులు

దృష్టిసారించని విజిలెన్స్‌, పౌర సరఫరాల శాఖలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర మార్కెట్‌లో ఉల్లి ధర రూ.84కి చేరింది. ఎక్కడ కొన్నా అంతకు తక్కువ ఇవ్వడం లేదు. రైతుబజార్లలో కిలో రూ.77 రేటు పెట్టారు. జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో రూ.75 నుంచి రూ.80 మధ్య అమ్ముతున్నారు. అక్కడ వారు నిర్ణయించే ధర ఆధారంగానే నగరంలో ఉల్లి ధరలు మారుతున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి కొని ఇక్కడికి తేవడానికి మూడు రోజులు పడుతుంది. అక్కడ కిలో రూ.60కి కొన్నారంటే...రవాణా చార్జీలు, లాభం కలుపుకొని ఇక్కడ విక్రయించాలి. కానీ వారు కొన్న ధర కాకుండా...ఇక్కడికి సరకు చేరిన రోజు మహారాష్ట్ర ధర ఎంత వుందో చూసుకొని దాని ప్రకారం రేటు నిర్ణయిస్తున్నారు. దాంతో వారికి భారీగా గిట్టుబాటు అవుతోంది. మహారాష్ట్ల్రలోనే రోజుకు కిలోకు రూ.10 నుంచి రూ.15 పెరుగుతోంది. ఆ పెంపును ఇక్కడి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులైతే...ఉల్లితో లారీలు విశాఖపట్నం వచ్చినా...మార్కెట్‌కు తేకుండా రెండు, మూడు రోజులు శివార్లలోని మైదానాల్లో నిలిపేస్తున్నారు. రేటు బాగా పెరిగిన తరువాత వాటిని మార్కెట్‌కు రప్పించి...అమ్ముతున్నారు. నేరుగా మహారాష్ట్ర నుంచి కొని సరకు తెచ్చుకునేవారు ఇలాంటి దందా చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై విజిలెన్స్‌, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌ శాఖాధికారులు దృష్టిసారించాలి. కానీ ఆ విభాగాలేవీ పట్టించుకోవడం లేదు. దాంతో ఉల్లి రేటు రోజు రోజుకు పెరిగిపోతోంది. 


తుని, చోడవరాల్లో రేటు తక్కువ

తుని, చోడవరాల్లో ఉల్లి టోకు వ్యాపారులు నేరుగా మహారాష్ట్ర నుంచి లారీలు తెప్పించుకుంటున్నారు. వారు విశాఖ వ్యాపారుల కంటే కిలో రూ.2 తక్కువకే సరకు ఇస్తున్నారు. దాంతో రైతుబజార్లలో డ్వాక్రా సంఘాలు తుని, చోడవరం వెళ్లి సరకు తెచ్చుకుంటున్నాయి. అధికారులు ఈ చిన్న విషయాలను కూడా గుర్తించడం లేదు. వ్యాపారులను ఇలాంటి సమయాల్లో అదుపు చేయకపోవడం వల్ల భారీగా దోచుకుంటున్నారు. కిలో దగ్గర రూ.10 లాభం తీసుకుంటున్నారు. 


రెండు రోజుల్లో కిలోకు రూ.20 పెంపు

రైతుబజార్లలో ఉల్లి ధర రెండు రోజుల్లో కిలోకు రూ.20 పెరిగింది. ఆదివారం ధర రూ.57 కాగా సోమవారం రూ.65 పెట్టారు. మంగళవారం రూ.77 చేశారు. ఇలా ఎంత వరకు వెళుతుందో తెలియడం లేదు.


రాయితీ ఉల్లి రాకకు మూడు రోజులు

ఉల్లి రేటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కొని రాయితీపై రైతుబజార్లలో విక్రయించాలని నిర్ణయించింది. అమరావతి అధికారులు మహారాష్ట్ర వెళ్లి, అక్కడ కొని, ఇక్కడకు పంపేసరికి మూడు రోజుల సమయం పడుతుంది. శనివారం నాటికి రాయితీ ఉల్లి రావచ్చునని అంచనా వేస్తున్నారు. ఆ ఉల్లి కిలో రూ.35 నుంచి రూ.40కి విక్రయించే అవకాశం ఉందంటున్నారు.


ఉల్లి ధర పెరిగిందలా 

తేదీ మహారాష్ట్ర కర్నూలు

ఉల్లి ఉల్లి

11న 40 28

12న 41 28

13న 44 28 

14న 50  40

15న 50  40

16న 50 40

16న 55  40

17న 55 40

18న 57  40

19న 65  40

20న 77  40


...అయితే కర్నూలు ఉల్లి పచ్చిగా వుండి, తడిసిపోయి కుళ్లిపోతుండడంతో రైతుబజార్‌లోని డ్వాక్రా గ్రూపులు హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి తేవడం లేదు. రైతుబజార్లలో మహారాష్ట్ర ఉల్లి మాత్రమే విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-10-21T11:46:13+05:30 IST