Advertisement
Advertisement
Abn logo
Advertisement

కళ్లు మండకుండా ఉండాలంటే 15 నిమిషాలకోసారి..

ఆంధ్రజ్యోతి(29-06-2020)

ప్రశ్న: ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్‌ ముందు ఉంటున్నారు. వారి కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?


- ఆద్య, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: కళ్ళ ఆరోగ్యానికి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. వారి ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆవశ్యక ఫాటీ యాసిడ్స్‌ ఉండేలా చూడండి. వేపుళ్ళు, బేకరీ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ మంచివి కాదు. వీటిలోని సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ కంటికి రక్తం చేరవేసే సూక్ష్మ రక్తనాళాల పని తీరుపై చెడు ప్రభావం చూపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ల కోసం అన్ని రకాల తాజా పండ్లు, కాయగూరలు రోజులో రెండుసార్లైనా తీసుకోవాలి. ముఖ్యంగా ఎరుపు, బచ్చలి పండు రంగుల్లో ఉండే పండ్లు; కూరలైన టమాటా, పుచ్చ, నేరేడు, బీట్‌ రూట్‌, పర్పుల్‌ క్యాబేజీ లాంటి వాటిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆవశ్యక ఫాటీ యాసిడ్స్‌ కోసం సాల్మన్‌ చేపలు, ఒమేగా-3 ఉన్న గుడ్లు, చేప నూనె సప్లిమెంట్లు, ఆక్రోట్‌ గింజలు, అవిసె గింజలు, బాదం గింజలు, గుమ్మడి పప్పు, పుచ్చ గింజలు, నువ్వులు మొదలైనవన్నీ వీలున్నంతగా తీసుకోవాలి. కేవలం రోజూ అరగంట వ్యాయామం చేస్తే రక్తప్రసరణ బాగుంటుంది. కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అదేపనిగా చదవడం లేదా కంప్యూటర్‌ చూడడం వల్ల కళ్ళు మండకుండా ఉండాలంటే కనీసం పదిహేను ఇరవై నిమిషాలకోసారి ముప్ఫయి సెకండ్ల పాటు కళ్ళు మూసుకోవడం లేదా దూరంగా ఉన్న వస్తువులను చూడడం చేయాలి. నీళ్లు తాగక పోయినా కళ్ళ ఆరోగ్యం దెబ్బ తింటుంది. సరిపడా నిద్రపోతేనే కళ్ళకు అవసరమైన విశ్రాంతి లభిస్తుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement