నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2022-01-24T04:44:41+05:30 IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో మరోమారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

- విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు పొడిగింపు

- 8,9,10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు

- 50శాతం సిబ్బంది హాజరు కావాలని ఆదేశించిన ప్రభుత్వం

- జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనేక ఆటంకాలు

- మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రధాన సమస్య


కామారెడ్డి టౌన్‌, జనవరి 23: కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో మరోమారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి నుంచి మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఈ నెల 16తో ముగియాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈనెల 31 వరకు సెలవులను పొడిగించింది. గత వారం రోజుల కిందట ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం కేసుల సంఖ్య వందల్లోనే నమోదు కావడంతో ఆన్‌లైన్‌ తరగతులవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  8,9,10 తరగతులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు అందుకు అనుగుణంగా నిత్యం 50 శాతం మంది సిబ్బంది హాజరుకావాలని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలో చాలా వరకు మారుమూల ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు చేరే అవకాశాలు అంతంత మాత్రంగానే అందుతాయని ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం నిర్వహించే పాఠాలు చేరడంతో పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

నేటి నుంచి 8,9,10 తరగతులకు ఆన్‌లైన్‌ పాఠాలు

8,9,10 తరగతులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఉపాధ్యాయులు, సిబ్బంది 50 శాతం హాజరయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాలు కోల్పోవాల్సి వచ్చింది. పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసింది. ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేసి గత నవంబరులో పరీక్షలు నిర్వహించారు. గత రెండేళ్లుగా విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించిన జిల్లాలో అంతగా ప్రభావం చూపలేదు. పర్యవేక్షణ లేక పాఠాలు విన్న వారి సంఖ్య చాలా తక్కువే. మొదట్లో ఉన్నంత శ్రద్ధ రానురానూ లేకుండా పోయింది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పట్టించుకోలేదు. దీంతో పాటు జిల్లాలోని పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో కనీస ప్రమాణాలు కూడా కానరాలేదు. సెకండ్‌వేవ్‌ అనంతరం పరిస్థితులు కుదుటపడడంతో 2021-22 విద్యాసంవత్సరంలో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో మళ్లీ కరోనా వైరస్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌తో ఽథర్డ్‌వేవ్‌కు దారి తీసింది.

జిల్లాలో అనేక అవాంతరాలు

జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతులకు అనేక అవాంతరాలు  కలుగుతున్నాయి. చాలా వరకు జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలే ఉన్నాయి. కొన్ని గ్రామాలకు నేటికి సరిగా విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. చాలా వరకు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, కూలీ పనులు చేస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్న వారు పెద్దఎత్తునే ఉండగా అందులో స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు తక్కువే. అంతేకాకుండా చాలా గ్రామాలకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేవు. నెట్‌వర్క్‌ సదుపాయం లేక విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరం కావాల్సి వస్తోంది. కొంత మంది తల్లిదండ్రులు తమ వెంటే పనులకు తీసుకెళ్లడం గతంలో చాలా చోట్ల చూశాం.

గేమ్‌లకు పరిమితం

ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో గతంలో కొంత మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. అయితే చాలా మంది విద్యార్థులు పర్యవేక్షణ లేక ఆటల మీద పడ్డారు. కరోనా పుణ్యమా అని గతంలో ఇంటికే పరిమితమైన విద్యార్థులు పాఠాలను మరిచి స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ కనిపించడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆన్‌లైన్‌ ఆటలతో పిల్లలు చదువులను పూర్తిగా మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు పెడితే మరోమారు ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారు కానుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులకు అవకాశం కల్పించాలని ప్రైవేట్‌ ఉపాధ్యాయులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-24T04:44:41+05:30 IST