గాడితప్పుతున్న ‘ఆట’విడుపు

ABN , First Publish Date - 2020-07-01T10:38:55+05:30 IST

ఆటలన్నీ ‘ఆన్‌లైన్‌’ అయిన ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అంతా కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌ గేమింగ్‌కు

గాడితప్పుతున్న ‘ఆట’విడుపు

యవతకు వ్యసనంగా మారుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ 

సరదాగా మొదలై బెట్టింగ్‌ల వరకు వెళుతున్న వైనం

జూదరులకు అవకాశంగా మారిన కొన్ని గేమ్స్‌ 

మత్తులో తప్పుదారి పడుతున్న యువత


ఖమ్మం/ఇల్లెందు, జూన్‌30 (ఆంధ్రజ్యోతి): ఆటలన్నీ ‘ఆన్‌లైన్‌’ అయిన ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అంతా కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటుపడిపోయారు. ఒకపుడు సెలవు దొరికితే వీధుల్లో ఆటలాడుకునే పిల్లలు నేడు సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లలో తలమునకలైపోతున్నారు. కళాశాల విద్యార్థులు, యువత ఒకప్పుడు క్రికెట్‌ లాంటి ఆటలతో టైంపాస్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ గేమ్‌ల మత్తులో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో ఈ ‘ఆట’విడుపు గాడితప్పుతుంది. పిల్లులు ఈ ఆటల్లో మునిగిపోయిన తీవ్రమైన మానసికఒత్తిడి గురవుతుండగా యువత బెట్టింగ్‌, మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల పంతాలకు పోయి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా మంగళవారం బోనకల్లు మండలంలో లూడోకింగ్‌ అనే మొబైల్‌ గేమ్‌ బెట్టింగ్‌ విషయంలో జరిగిన గొడవలో ఓ యువకుడు మరో యువకుడిని మద్యం బాటిల్‌తో పొడవం ఆన్‌లైన్‌ గేమింగ్‌ దారితప్పుతుందనడానికి ఉదాహరణ నిలుస్తోంది.


పేకాటకు ప్రత్యామ్నాయంగా లూడోకింగ్‌

 పాత కాలంలో ఆడుకునే వైకుంఠపాళి అలియాస్‌ పచ్చీస్‌ ఆటకు కొన్ని మార్పులు చేసిందే లూడో కింగ్‌ మొబైల్‌ గేమ్‌. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దలవరకు ఈ గేమింగ్‌కు అలవాటుపడిపోయారు. అయితే కాలక్షేపం కోసం ఉద్దేశించిన ఈ ఆట వ్యసనంగా మారి బెట్టింగ్‌ల స్థాయికి వెళ్లింది. ఈ బెట్టింగ్‌ల  వ్యవహారంలో స్నేహితులు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా విబేధాలు తెచ్చిపెడుతోంది. పోలీసుల దాడులకు భయపడుతున్న పేకాట రాయుళ్లు ప్రత్యామ్నాయంగా టూడో గేమ్‌ను బెట్టింగ్‌లకు వాడుకుంటున్నారు. మొబైల్‌లో ఆడే గేమ్‌ కావడంతో పేకాటరాయుళ్లు దీనిపైనే బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ సైబర్‌ నేరాలకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి.  


పబ్జీ, గంజాయి గుప్పిట్లో యువత

ఇరు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో యువత పబ్జీ, గంజాయికి బానిసలుగా మారి జీవితాలను దెబ్బతీసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇల్లెందు లాంటి పట్టణాల్లో ఆన్‌లైన్‌ ఆటలు, పేకాట, గంజాయి, మద్య మత్తులో యువత దారితప్పుతోంది. ఇల్లెందులోని పలు కాలనీలు, బస్తీల్లో యువకులు బ్యాచ్‌లుగా తయారై అనేక మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కుటుంబాలను పోషించేందుకు కూలీనాలికి వెళుతూ తమ బిడ్డల వ్యాపకాలపై దృష్టిసారించకపోవడంతో అనేక మంది యువకులు దారితప్పి వ్యసనాల భారిన పడుతున్నారు.


ఇటీవల పట్టణంలో ఓ యువకుడు పబ్జీ ఆటలకు బానిసై తల్లిదండ్రులు ఖరీదైన సెల్‌ఫోన్‌ కొనివ్వలేదన్న ఆగ్రహంతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో గత రెండు నెలల వ్యవధిలో పట్టణంలో ముగ్గురు యువకులు బలయ్యారు. ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించని అనేక మంది యువకులు ఇల్లెందు పట్టణంలో వ్యవసనాల భారినపడి డబ్బు కోసం తల్లిదండ్రులతో ఘర్షణకు దిగడం, మరికొందరు యువకులు చోటా మోటా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు అనుచరులుగా చెప్పుకుంటూ గ్యాంగ్‌లుగా చలామణి అవుతూ వారి జీవితాలతో వారే చెలగాటం అడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా తమ అవసరాలకోసం ఇలాంటివారిని పెంచిపోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పోలీసు అధికారులు కూడా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్న యువతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-01T10:38:55+05:30 IST