హైస్కూల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

ABN , First Publish Date - 2022-01-24T07:09:32+05:30 IST

కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండడంతో మరో మారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ప్రత్యక్ష విద్యాబోధనకు తాత్కాలిక బ్రేకులు వేసింది.

హైస్కూల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

నేటి నుంచి 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన

50శాతం సిబ్బంది హాజరుకు ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రత్యక్ష తరగతులపై స్పష్టత కరువు

జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతులకు అనేక సమస్యలు

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 23: కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండడంతో మరో మారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేటి నుంచి  ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ప్రత్యక్ష విద్యాబోధనకు తాత్కాలిక బ్రేకులు వేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం గత సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభమైన ప్రత్యక్ష తరగతులను ఈ నెల 7వ తేదీన నిలిపివేసింది. జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జనవరి 30 వరకు సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి హైస్కూల్‌ విద్యార్థులతోపాటు ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది.

      ఆన్‌లైన్‌వైపే ప్రభుత్వం మొగ్గు..

కరోనా మొదటి, రెండో వేవ్‌ల కారణంగా గత ఏడాది మార్చి నుంచి విద్యాసంస్థలలో పూర్తిగా ఆన్‌లైన్‌ విద్యాబోధన జరగా గత సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. సెప్టెంబరు, అక్టొబరు, నవంబరు, డిసెంబరులో సెలవులు పోను సుమారు మూడు నెలల పాటు విద్యాబోధన జరగగా కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులవైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఈ నెల 31 తర్వాత ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభమవుతుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఇదివరకే ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లు తరగతులు కొనసాగుతుండగా సోమవారం నుంచి హైస్కూల్‌ విద్యార్థులకూ ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది 50శాతం హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ చానళ్ల ద్వారా, ప్రైవేట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన జరగనుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆన్‌లైన్‌ బోధనను పర్యవేక్షిచేందుకు 50శాతం సిబ్బంది నేటి నుంచి హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వగా 16 రోజుల సెలవుల అనంతరం ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. జిల్లాలో 132 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, 200లకు పైగా ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానుండగా మిగతా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల నిర్వహణపై ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. 

     ప్రత్యక్ష తరగతులపై స్పష్టత కరువు..

ఇటీవల చేపట్టిన ఫీవర్‌ సర్వేలో వేలాది మందిలో కరోనా లక్షణాలు బయటపడడం అందులో చిన్న పిల్లలు, విద్యార్థులు ఉండడంతో ఆన్‌లైన్‌ విద్యాబోధన వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఈ నెల 8 నుంచి 16 వరకు ఉన్న సంక్రాంతి సెలవులను ప్రభుత్వం కరోనా తీవ్రతతో ఈ నెల30 వరకు సెలవులు పొడిగించగా మళ్లీ ప్రత్యక్ష విద్యాబోధన జరుగుతుందో జరగదో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా దాదాపు లక్షా 15వేలకు పైగా విద్యార్థులు చదువుతుండగా ప్రైవేట్‌ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్సరం సగానికిపైగా కోల్పోయిన విద్యార్థులు ప్రత్యక్ష విద్యాబోధనతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా మళ్లీ ఆన్‌లైన్‌ పాఠాల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతుండడంతో ఈ నెల 31 తర్వాత ప్రత్యక్ష తరగతుల ప్రారంభం విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

     ఆన్‌లైన్‌ తరగతులకు ఆటంకాలెన్నో..

గతంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ పాఠాలతో ఇంటర్‌ విద్యార్థులు ఏవిధంగా నష్టపోయారో ఇటీవల వచ్చిన ఫలితాలు స్పష్టం చేయగా మళ్లీ ఆన్‌లైన్‌ పాఠాలు విద్యార్థుల సామర్థ్యాన్ని ఏవిధంగా పెంపొందిస్తాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండగా అక్కడ ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు విద్యార్థులకు అంతగా సౌకర్యాలు లేవు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు విద్యుత్‌ సమస్యలు, టెక్నికల్‌ సమస్యలు ఇలా ఇన్ని సమస్యల మధ్య ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ ఏవిధంగా సాగుతుందోనన్న అనుమానాలు ఉన్నాయి.

Updated Date - 2022-01-24T07:09:32+05:30 IST