ఆన్‌లైన్‌లో ‘నైటీ’ ఆర్డరు చేసింది.. రాలేదని క్యాన్సిల్ చేస్తే..

ABN , First Publish Date - 2020-07-04T15:08:58+05:30 IST

ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసిన నైటీ రాకపోవడంతో చెల్లించిన సొమ్మును పొందే యత్నంలో ఓ మహిళ రూ.60 వేలను మోసపోయిన ఘటన పెరంబూర్‌ నగరంలో

ఆన్‌లైన్‌లో ‘నైటీ’ ఆర్డరు చేసింది.. రాలేదని క్యాన్సిల్ చేస్తే..

చెన్నై: ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసిన నైటీ రాకపోవడంతో చెల్లించిన సొమ్మును పొందే యత్నంలో ఓ మహిళ రూ.60 వేలను మోసపోయిన ఘటన  పెరంబూర్‌ నగరంలో  చోటు చేసుకుంది. స్థానిక కొరట్టూరుకు చెందిన 32 ఏళ్ల మహిళ కొద్ది రోజుల క్రితం ‘క్లబ్‌ ఫ్యాక్టరీ’ అనే సంస్థకు ఆన్‌లైన్‌లో నైటీకి ఆర్డరిచ్చింది. తన భర్త ఏటీఎం కార్డు దారా రూ.550ను ఆమె ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించింది. పార్శిల్‌ రావడం ఆలస్యం కావడంతో ఆర్డర్‌ను కాన్సిల్‌ చేసి నగదును తిరిగి అందించాలని కస్టమ్‌ కేర్‌ అధికారి సదరు మహిళ కోరింది. నగదు చెల్లించాలంటే బ్యాంక్‌ ఖాతా నెంబరును తెలియజేయాలని పేర్కొన్న అధికారి, తొలుత సెల్‌ఫోన్‌లో ‘టీమ్‌ వ్యూవర్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అనంతరం ఏటీఎం కార్డు రెండు వైపులా ఫొటోలు, టీమ్‌ వ్యూవర్‌ ద్వారా కార్డు సమాచారాన్ని పొందిన సదరు అధికారి, మీ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరు చెప్పాలని కోరగా, ఆ మహిళ చెప్పింది. ఆ కొద్దిసేపటికే భర్త ఖాతా నుంచి రూ.60 వేలు డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె మళ్లీ కస్టమర్‌ కేర్‌కు సంప్రదించగా, వేరే అధికారి కూడా అవే వివరాలను కోరడంతో ఆమె ఫోన్‌ కట్‌ చేసింది. ఈ వ్యవహారంపై కొరట్టూర్‌ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయగా, ఆన్‌లైన్‌ మోసం కావడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని సైబర్‌ క్రైం కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డరు చేసే వారు తమ ఖాతా, ఏటీఎం, రహస్య నెంబర్లను తెలుపరాదని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-07-04T15:08:58+05:30 IST