ఆన్‌‘లైన్లో పడలేదు’

ABN , First Publish Date - 2021-01-10T08:19:51+05:30 IST

ఆన్‌లైన్లో ఇంటర్‌ క్లాస్‌ జరుగుతోంది. అక్కడి మాస్టారు ఫిజిక్స్‌ లెక్కను బోధిస్తున్నారు. సెల్‌ఫోన్లో చూసుకుంటూ విద్యార్థులు దానిని రాసుకుంటున్నారు...

ఆన్‌‘లైన్లో పడలేదు’

  • కార్పొరేట్‌ కాలేజీల్లోనే డిజిటల్‌ పాఠాలు.. 
  • బడ్జెట్‌ కాలేజీలు ఆన్‌లైన్‌కూ దూరమే
  • బోధిస్తున్నా క్లాసులకు విద్యార్థులు దూరం
  • హాజరైనా వారికి పట్టని పాఠాలు
  •  సమస్యల వలయంగా ఆన్‌లైన్‌ బోధన
  •  జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలపై ప్రభావం


(సెంట్రల్‌ డెస్క్‌): ఆన్‌లైన్లో ఇంటర్‌ క్లాస్‌ జరుగుతోంది. అక్కడి మాస్టారు ఫిజిక్స్‌ లెక్కను బోధిస్తున్నారు. సెల్‌ఫోన్లో చూసుకుంటూ విద్యార్థులు దానిని రాసుకుంటున్నారు! బోర్డు మీద చిన్నగా రాస్తుండడంతో విద్యార్థికి సెల్‌ఫోన్లో సరిగా కనిపించకపోవడం ఒకరి సమస్య! మాస్టారి వేగాన్ని అందుకోలేకపోవడం మరొకరి సమస్య! మాస్టారు చెప్పిన పాఠం సరిగా అర్థం కాకపోవడం ఇంకొందరి సమస్య! వెరసి, పాఠాలు అయిపోతున్నాయి! సిలబస్‌ పూర్తవుతోంది! కానీ, పాఠాలు అర్థమవుతున్నది మాత్రం కొద్దిమందికే! ఈ పరిణామం విద్యార్థుల చదువుపైనే కాదు.. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. అయినా, కార్పొరేట్‌ కాలేజీలు ముందు నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వరంగంలో మాత్రం కరోనా మహమ్మారి కాస్త ఉపశమించిన తర్వాత సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టారు. చిన్న చిన్న బడ్జెట్‌ కాలేజీల్లో సెకండియర్‌ తప్ప ఇప్పటికీ ఇంటర్‌ మొదటి సంవత్సరం బోధన మొదలు కాలేదు.


పర్యవేక్షణ ఏదీ!?

తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు లెక్చరర్‌ చూస్తారన్న భయం ఉంటుంది. కానీ, ఇప్పుడా భయం లేదు. ఇక, ఇళ్లల్లోనే ఆన్‌లైన్‌ పాఠాలు జరుగుతున్నా విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అంతంతే. అటు లెక్చరర్‌ భయమూ లేదు. ఇటు తల్లిదండ్రుల పర్యవేక్షణా లేదు. దాంతో 60-80 శాతం మంది విద్యార్థులు పాఠాలు వినడం లేదు. కొంతమంది ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటున్నా.. సినిమాలు చూస్తున్నా తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇటువంటి అపసవ్య ధోరణులకు అడ్డుకట్ట వేయడానికి వీడియో ఆన్‌ చేసి ఉంచాలని కొంతమంది లెక్చరర్లు కోరుతున్నారు. కానీ, కొంతమంది విద్యార్థులు ఆన్‌ చేయడం లేదు. ఇందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి. ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకుంటే రెండు గదులను ప్రత్యేకంగా వారికే కేటాయించాల్సి వస్తోంది. క్లాసులు జరిగినంతసేపూ ఇంట్లో వాళ్లు ఎటూ తిరగలేని పరిస్థితి. ఇక, చిన్న చిన్న ఇళ్లల్లో ఈ సమస్య మరింత తీవ్రం.


చదువుకోవడమే సమస్య

ఆన్‌లైన్లోకి వచ్చేసరికి బాగా చదివే విద్యార్థులకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. శ్రద్ధగా పాఠాలు వినే విద్యార్థులకు కూడా సమస్యలు తప్పడం లేదు. బోర్డు మీద రాసేటప్పుడు కొందరు చిన్న చిన్న అక్షరాలు రాస్తూ ఉంటారు. సెల్‌ఫోన్లో చూస్తున్న విద్యార్థులకు అది కనిపించడం లేదు. సదరు పాఠం అర్థం కావడం లేదు. సాధారణంగా కొంతమంది తరగతి గదిలోనే డౌట్లు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక, ఆన్‌లైన్లో సందేహాలు అడగడం సంగతి సరేసరి. సందేహం వస్తే అడగడానికి ఆన్‌లైన్లో ‘హ్యాండ్‌’ ఆప్షన్‌ ఉన్నా దానిని ఉపయోగించేది అతి కొద్ది మంది మాత్రమే. ఇక్కడ విద్యా సంస్థ మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు రావడం ఎంత ముఖ్యమో.. సదరు లెక్చరర్‌ దానిని నైపుణ్యంగా ఉపయోగించడమే అంతే కీలకం అవుతోంది. ఉదాహరణకు, ‘డిజిటైజర్‌’ వంటి టెక్నాలజీని కొన్ని విద్యా సంస్థలు అమల్లోకి తెచ్చాయి. దాంతో, క్లాస్‌రూంలో బోధించినట్లు ఉంటున్నా.. టెక్నాలజీ తెలిసిన లెక్చరర్లు బోధిస్తే విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే, ఇబ్బందులు తప్పడం లేదు. ఇక, తరగతి గదిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను లేదా తోటి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం ద్వారా (పీర్‌ గ్రూప్‌ లెర్నింగ్‌) 20 శాతం వరకూ పాఠాలను నేర్చుకుంటారని ఓ అంచనా. ఆన్‌లైన్లో అటువంటి అవకాశాన్ని విద్యార్థులు మిస్సవుతున్నారు.


నెట్‌వర్క్‌తో విద్యార్థులకు తిప్పలు

పాఠాలు వినడానికి విద్యార్థులకు నెట్‌వర్క్‌ శాపంగా మారింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులు నెట్‌వర్క్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లెక్చరర్‌ పాఠం చెప్పేస్తున్నారు. కానీ, సెల్‌ఫోన్లో చక్రం గిరగిరా తిరుగుతూనే ఉంటోంది. విద్యార్థికి తెలియని టెన్షన్‌ పెరిగిపోతూనే ఉంటోంది. పాఠం అయిపోతోంది కానీ చక్రం తిరగడం ఆగడం లేదు. దాంతో, పాఠం చెప్పేశామని లెక్చరర్‌ అనుకుంటున్నారు. కానీ, అది విద్యార్థిని చేరడం లేదు. ఒక్కోసారి పాఠం మధ్యలో నెట్‌వర్క్‌ సమస్య వస్తోంది. క్రమం తప్పడంతో మిగిలిన పాఠం వారికి అర్థం కావడం లేదు. మరోవైపు, కొన్ని కార్పొరేట్‌ కాలేజీలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆన్‌లైన్‌ క్లాసులు బోధిస్తూనే ఉన్నాయి. ఇంత సుదీర్ఘంగా బోధిస్తున్నా విద్యార్థికి ఎంత అర్థమైందనే విషయాన్ని మాత్రం ఆయా కాలేజీలు పట్టించుకోవడంలేదు.


హోం వర్కులు ఏవీ!?

పునశ్చరణలో విద్యార్థికి అత్యంత కీలకం హోం వర్కులు. ఆన్‌లైన్‌ బోధన కారణంగా ఇప్పుడు హోం వర్కులు లేవు. ఒకవేళ, లెక్చరర్లు హోం వర్కులు ఇచ్చినా విద్యార్థులు దానిని చేయడం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో 50 మంది ఉండాల్సిన విద్యార్థులు ఒక్కో ఆన్‌లైన్‌ తరగతిలో 200 నుంచి 300 మంది వరకూ ఉంటున్నారు. ఇటువంటి క్లాసుల్లో హోం వర్కు అనే మాటను విద్యార్థులు మర్చిపోయారు కూడా. తరగతి గదిలో లెక్చరర్‌ హోం వర్కును అడుగుతారనే భయం ఉండేది. దాంతో, ఎలాగోలా చేసుకుని వచ్చేవారు. అటు లెక్చరర్‌, ఇటు తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడడంతో ఇప్పుడు హోం వర్కులు కొండెక్కాయి. కాగా, కొంతమంది వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, దాని ద్వారా హోం వర్కు పంపిస్తున్నారు. తర్వాత రోజు దానిని చేశారా లేదా అని చూస్తున్నారు. ఒకవేళ, ఏదైనా పాఠం అర్థం కాకపోతే, రాకపోతే క్లాసులో మళ్లీ వివరిస్తున్నారు. మరికొందరు లెక్చరర్లు మాత్రం.. నామ్‌కే వాస్తేగా వాట్సా్‌పలో పోస్టులు పెట్టడం వరకే పరిమితమవుతున్నారు. దానిని చేశారో లేదో చూడడం లేదు. తరగతి గదిలో దానిలోని అంశాలను వివరించడమూ ఉండడం లేదు.


ప్రభుత్వ కాలేజీల్లోనూ...

కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించారు. టీ శాట్‌, దూరదర్శన్‌ యాదగిరి చానల్‌ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 శాతం క్లాసులకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. కరోనా కారణంగా కొంతమంది ఏప్రిల్‌లోనే సొంత ఊళ్లకు వెళ్లారు. వీరిలో కొందరి ఇళ్లలో టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడంతో క్లాసులకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. విచిత్రంగా, కొందరు సెకండియర్‌ విద్యార్థులు కూడా తరగతులకు దూరంగా ఉంటున్నారు. వారి సెల్‌ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నా స్పందన ఉండడం లేదు. చక్కగా వింటున్న వారిపై మాత్రం ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరుస్తున్నారు. సబ్జెక్టులవారీగా సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. వర్క్‌ షీట్లను డౌన్‌ లోడ్‌ చేసుకుని.. వాటిని పూర్తి చేసి మళ్లీ అప్‌లోడ్‌ చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - 2021-01-10T08:19:51+05:30 IST