సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-04-04T09:40:26+05:30 IST

ఆన్‌లైన్‌లో ప్రజలు ఆర్డర్‌ చేసిన నిత్యావసర సరుకులు సకాలంలో సరఫరా చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని సూపర్‌ మార్కెట్ల యజమానులను నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష హెచ్చరించారు.

సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

సూపర్‌ మార్కెట్ల యజమానులకు కమిషనర్‌   హెచ్చరిక


తిరుపతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో ప్రజలు ఆర్డర్‌ చేసిన నిత్యావసర సరుకులు సకాలంలో  సరఫరా చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని సూపర్‌ మార్కెట్ల యజమానులను  నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష హెచ్చరించారు.  కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేపట్టిన  నిత్యావసరాల డోర్‌ డెలివరీ విధానంలో ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో పసుపర్తి సూపర్‌ మార్కెట్‌, రిలయన్స్‌ మార్ట్‌, డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్లను కమిషనర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఎన్ని కాల్స్‌ వస్తున్నాయి, సరుకుల  ప్యాకింగ్‌, డెలివరీ వంటి విషయాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమి తమైన  ప్రజలకు కావాల్సిన వాటిని అందించడం మన బాధ్యత అని వ్యాపారులకు సూచించారు. ప్రజల నుంచి వస్తున్న ఫోన్‌కాల్‌స రిసీవ్‌ చేసుకోకపోవడం,  సకాలంలో సరుకులు సరఫరా చేయకపోవడం తగదన్నారు. ప్యాకింగ్‌కు, డెలివరీకి మరికొంత మందిని ఏర్పాటు చేసుకుని సరుకులు సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. సిబ్బంది డోర్‌ డెలివరీ చేసేందుకు, స్టాక్‌ తెచ్చుకునేందుకు ఇబ్బంది లేకుండా పాసులిస్తున్నా ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇకపై ఇలా చేస్తే వేరొకరికి అవకాశం ఇస్తామని హెచ్చరించారు. గ్లౌవ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడి సరుకులు సరఫరా చేయాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ల ప్రజలకు ఇబ్బందులు తొలగాయన్నారు.   ఎటు వంటి సమస్య ఎదురైనా నగరపాలక సంస్థ హెల్ప్‌లైన్‌ 0877-2256766 నెంబరును తెలియజేయాలని ప్రజలకు కమిషనర్‌ సూచించారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ ఇంజనీరు-1 చంద్రశేఖర్‌, డీఈ దేవిక తదితరులున్నారు. 


Updated Date - 2020-04-04T09:40:26+05:30 IST