ఫోన్‌ చేసిన పెళ్లి!

ABN , First Publish Date - 2020-04-09T05:30:00+05:30 IST

పెళ్లిళ్లు ఇన్నాళ్లూ కల్యాణ మండపాల్లో, దేవాలయాల్లో జరగడం తెలిసిందే. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ జంట పెళ్లి మాత్రం ఫోన్‌లో...

ఫోన్‌ చేసిన పెళ్లి!

పెళ్లిళ్లు ఇన్నాళ్లూ కల్యాణ మండపాల్లో, దేవాలయాల్లో జరగడం తెలిసిందే. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ జంట పెళ్లి మాత్రం ఫోన్‌లో అయింది. కొన్ని నెలల క్రితమే పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అప్పటికి కరోనా ప్రభావం లేదు. కరోనా వల్ల తమ పెళ్లి మాత్రం ఆగకూడదు, అనుకున్న విధంగా ఆ రోజే కొత్త జీవితం రంభించాలనుకున్నారు ఆ ప్రేమజంట. అనుకుంటే కానిది ఏముంది టెక్నాలజీ యుగంలో...!ఆగమేఘాల మీద వీడియో యాప్‌ ద్వారా పెళ్లి చేసుకున్నారు ముంబయ్‌కి చెందిన ప్రీత్‌ సింగ్‌ నౌకాదళ అధికారి, ఢిల్లీ అమ్మాయి నీత్‌ కౌర్‌.


ఇద్దరూ ఏడాది డేటింగ్‌ తరువాత పెళ్లిపీటలెక్కాలనుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఏప్రిల్‌ 4న వీరి వివాహం జరిగేది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి  చేసుకోలేని పరిస్థితి. మరోవైపు స్నేహితులు, బంధువులు కూడా పెళ్లికి హాజరుకాలేని పరిస్థితి. అదీకాక లాక్‌డౌన్‌ ఎత్తేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వల్ల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడం మంచిది కాదని ప్రీత్‌సింగ్‌, నీత్‌ కౌర్‌లు భావించారు. 


దాంతో ప్రీత్‌ గోవాలో ఇవ్వాల్సిన బ్యాచిలర్స్‌ పార్టీ, శ్రీలంకలో చేసుకోవాల్సిన హనీమూన్‌ కూడా వాయిదాపడ్డాయి. కానీ పెళ్లి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగితీరాలన్న పట్టుదలతో ప్రీత్‌ కొత్త మార్గం కనిపెట్టాడు. రెండు వైపులా పెద్దలను ఒప్పించి వీడియో కాలింగ్‌ యాప్‌ ద్వారా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్న బంధువులు అంతా పెళ్లి వేడుకను చూడడానికి వీలుగా ఉదయం 11:30 గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించారు. అతిథుల సంఖ్య 150 ఉండగా 50కి కుదించారు. ఫోన్‌లోనే ప్రీత్‌, కౌర్‌లు ఇద్దరూ ఒకరినొకరు తమ జీవిత భాగస్వామిగా అంగీకరించారు. ఒక్కసారి ఫోన్‌లో పెళ్లి తంతు ముగియగానే అతిథులు తమతో ముందే తెచ్చిపెట్టుకున్న చాక్లెట్లు తిని నోరు తీపి చేసుకున్నారు. వధూవరులు ఫోన్‌లోనే బంధువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆఖరులో డ్యాన్స్‌ కార్యక్రమం కూడా జరిగింది. పెళ్లయితే అయిపోయింది.. కానీ ఇద్దరూ కలిసి ఏడడుగులు వేయాలంటే మాత్రం లాక్‌డౌన్‌ తొలగించేదాకా ఆగాల్సిందే!


Updated Date - 2020-04-09T05:30:00+05:30 IST