ఇద్దరు శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలనేం లేదు.. ముంబై కోర్టు కామెంట్స్

ABN , First Publish Date - 2021-08-25T03:10:45+05:30 IST

పెళ్లికి ముందే శృంగారం.. అత్యాచారం కేసులో ముంబై కోర్టు కీలక వ్యాఖ్య

ఇద్దరు శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలనేం లేదు.. ముంబై కోర్టు కామెంట్స్

ముంబై: ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఉన్నంత మాత్రాన వారు పెళ్లి చేసుకోవడం తప్పనిసరేమీ కాదంటూ ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక వ్యాఖ్య చేసింది. ఓ అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం శుక్రవారం నాడు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది ఎవరికి వారు నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో ఎవరినీ బలవంతం చేయకూడదు. ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన వారు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనేం లేదు. కాబట్టి.. వారిని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని అదనపు సెషన్స్ జడ్జి పీఎం గుప్తా తేల్చి చెప్పారు. 


కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

భర్త తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లైనట్టు కూడా పేర్కొంది. పెళ్లి తరువాత తాను అత్తారింట్లో రెండు నెలల పాటు ఉన్నానని, ఆ సమయంలో తనకు వేధింపులు ఎదురయ్యాయని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సెక్షన్ 498ఏ, 323, 504, 506తో పాటూ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. భర్త ప్రధాన ముద్దాయిగా.. అతడి తండ్రిని రెండో ముద్దాయిగా, స్నేహితుడిని మూడో ముద్దాయిగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.


ఈ క్రమంలో.. నెల తరువాత సదరు మహిళ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. తనను అతడు పెళ్లి చేసుకోలేదని, పెళ్లి పేరుతో తనను మోసపూరితంగా లోబరుచుకుని తనకు దగ్గరయ్యాండంటూ ఫిర్యాదు చేసింది.  ఈ క్రమంలో పోలీసులు 376, 377, 313  సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్‌కు జోడించారు. ఆ తరువాత.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిలు కోసం ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 


అయితే.. ఏప్రిల్ 2019 నుంచి తొలి ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకూ ఆమె సదరు వ్యక్తితో కలిసి పలు పర్యటనలకు వెళ్లిందని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. అంతేకాకుండా.. ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత కూడా.. థానేలోని ఓ హోటల్‌లో వారు కలిసున్నట్టు చెప్పింది. ఈ వివరాలను బట్టి వారిద్దరికీ ఎఫైర్ ఉన్నదని, ఏదో కారణంతో వారి బంధం తెగిపోయినట్టు భావించవచ్చని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఫిర్యాదు చేసిన మహిళ మేజరే కాకుండా.. విద్యావంతురాలు కూడా. కాబట్టి.. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటే కలిగే పర్యవసానాల గురించి ఆమెకు తెలుసునని భావించవచ్చు. అయితే..పెళ్లి పేరుతో ప్రలోభ పెట్టి మోసపూరితంగా తనకు దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదు చేసింది. మరోవైపు..చాలా కాలం పాటు ముద్దాయితో తనకు సంబంధం ఉన్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి.. అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేవలం పెళ్లి పేరుతో ప్రలోభపెట్టాడని, ఆమెను లోబరుచుకున్నాడని భావించలేం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేస్తే వారి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. 


మహిళ చేసిన ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే నిందితులకు పడే శిక్ష, ముద్దాయిలకు సమాజంలో ఉన్న స్థానం వంటి అంశాలన్నీటినీ పరిగణలోకి తీసుకుంటే.. తదుపరి దర్యాప్తు కోసం నిందితులు పోలీసు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదనేది తమ అభిప్రాయమని కోర్టు పేర్కొంది. కాబట్టి.. ముందస్తు బెయిలు పొందే హక్కు ముద్దాయిలకు ఉందని చెప్పింది. అయితే..ఈ తీర్పులో పేర్కొన్న విషయాలేవీ కేసు మంచిచెడులపై వ్యాఖ్యానాలుగా భావించరాదని, ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చిన బెయిల్‌ దరఖాస్తుకు మాత్రమే ఇవి పరిమితమని న్యాయస్థానం స్పష్టం చేశారు. 

Updated Date - 2021-08-25T03:10:45+05:30 IST