అధికారం కోసమే నాడు హామీలిచ్చారా

ABN , First Publish Date - 2021-08-25T07:02:36+05:30 IST

‘బడిలో ఉంటే విద్యార్థులకు పాఠాలు చెబుతాం. రోడ్లపైకి వస్తే పాలకులకు బుద్ధి చెపుతాం’ అని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యోప్టో కో-చైర్మన్‌, జిల్లా పరిశీలకుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

అధికారం కోసమే   నాడు హామీలిచ్చారా
కలెక్టరేట్‌ ముందు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

 సీఎం జగన్‌కు ఫ్యాప్టో నేతల ప్రశ్న 

తీరు మారకుంటే పోరు తప్పదని హెచ్చరిక 


చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 24: ‘బడిలో ఉంటే విద్యార్థులకు పాఠాలు చెబుతాం. రోడ్లపైకి వస్తే పాలకులకు బుద్ధి చెపుతాం’ అని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యోప్టో కో-చైర్మన్‌, జిల్లా పరిశీలకుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపుతో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాష్‌, నాదముని అధ్యక్షతన మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ముందు టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అధికారంలోకి రావడానికే సీఎం జగన్‌ హామీలు ఇచ్చినట్లు ఉన్నాయంటూ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ఆయన రెండేళ్లు గడుస్తున్నా, ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యోగులు, టీచర్ల సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యపు ధోరణి తగదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే.. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పీఆర్సీని తక్షణం అమలు చేయాలని, పెండింగ్‌లోని ఐదు డీఏలు వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని, అందుకు సీఎం సిద్ధం కావాలని చెప్పారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గంటా మోహన్‌, జగన్మోహన్‌రెడ్డి, గోపీనాథం, రమణ, సమీర్‌, తదితరులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదన్నారు. నూతన విధానంతో పాఠశాలలను విడదీయం ద్వారా విద్యావ్యవస్థలో అస్తవ్యస్థత కొనసాగనుందన్నారు. ఎయిడెడ్‌ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాల విద్య డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్‌ చానల్‌ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను డీఎస్సీల ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు.




నియంతృత్వ ధోరణి సరికాదు

నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. సమస్యలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా పరిష్కరించే వాతావరణం ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు.   

- నక్కా వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు




ప్రాథమిక హక్కులకు భంగం

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్‌ రావడం లేదు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం.

- ప్రకాష్‌, ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు 




పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి 

సెంట్రల్‌ స్కేల్‌తో సమానంగా పీఆర్సీని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు పీఆర్సీని కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయడంలో విఫలమైంది. ఇకనైనా పెండింగ్‌లోని ఐదు డీఏలను తక్షణం విడుదల చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదు 

- నాదముని, ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి




నేనున్నాను అంటే ఓట్లు వేశాం 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నేనున్నాను అంటే జగన్‌పై నమ్మకంతో ఓట్లు వేశాం. అధికారంలోకి రాగానే సీపీఎస్‌, పీఆర్సీ సమస్యలు పరిష్కరిస్తామని ఆశించాం. రెండేళ్లు కావస్తున్నా మా సమస్యలు పట్టించుకోవడం లేదు. 2018 నుంచి పీఆర్సీ రావాలి, 5 డీఏలు ఇవ్వాలని, కరోనా చనిపోయిన టీచర్ల కుటుంబాలకు న్యాయం చేయాలి. 

- సుష్మ, టీచర్‌, మున్సిపల్‌ కేజీబీవీ, చిత్తూరు 




Updated Date - 2021-08-25T07:02:36+05:30 IST