సైన్సే దిక్కు! డాక్టర్లకే మొక్కు!

ABN , First Publish Date - 2020-03-26T09:00:04+05:30 IST

చైనాలో కరోనా దెబ్బకి తొమ్మిదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 19 రోజుల్లో 57 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అయితే మనం మాత్రం యోగానే సర్వరోగనివారిణి అనే స్థితిలోనే ఉన్నాం.

సైన్సే దిక్కు! డాక్టర్లకే మొక్కు!

చైనాలో కరోనా దెబ్బకి తొమ్మిదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 19 రోజుల్లో 57 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అయితే మనం మాత్రం యోగానే సర్వరోగనివారిణి అనే స్థితిలోనే ఉన్నాం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వారు యోగా వలన పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంది అని చెబుతున్నారు. సీసీఎంబీ మాజీ డైరెక్టరు మోహనరావుగారిని యోగా వల్ల పిల్లలు పుడతారని మీవాళ్ళు చెప్పారట నిజమేనా అని అడుగగా, యోగా వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందేమోగాని పిల్లలు పుడతారనడానికి ఆధారం లేదని చెప్పారు. మరి అంతకుముందురోజే యోగా వలన పిల్లలు పుట్టే అవకాశముందని, ఢిల్లీలోని ఎయిమ్సులో ప్రయోగం జరిపామని సీసీఎంబీ శాస్త్రవేత్త చెప్పినట్టు ఒక పత్రికలో వచ్చింది. మామూలు సందర్భాల్లోకంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రమాదకర సందర్భంలో ఇలాంటి అసత్య ప్రచారాలు మరింత నష్టాన్ని కలగజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వికటాట్టహాసం చేస్తుంది. ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య ఇరవై వేలను చేరుతోంది. మనదేశంలోనూ తీవ్రరూపం దాలుస్తోంది. అన్నీ మూసి వేస్తున్నారు.


చివరికి గుళ్ళు, చర్చిలు, మసీదులు కూడా మూతబడ్డాయి. ఆపదమొక్కులవాడైన వెంకటేశ్వరస్వామి గుడి కూడా మూసేశారు. సైన్సు మాత్రమే కరోనా మహమ్మారిని అదుపు చేయగలదనేది ఇప్పుడు విశదమవుతున్న సత్యం. డాక్టర్లు మాత్రమే మనపాలిట దేవుళ్ళనేది నిర్వివాదాంశం. బాబాలు, మాతలు, మంత్రాలు, యాగాలు, అష్టలక్ష్మి యంత్రాలు, రంగురాళ్ళు, రుద్రాక్షలు... ఇవేమీ మనల్ని గట్టెక్కించలేవు. అయితే ఇప్పుడు కూడా కొందరు మూఢ నమ్మకాలను నమ్మి, అబద్ధ ప్రచారాలకు మోసపోతున్నారు. ఆవు మూత్రం తాగితే, ఆవు పేడ తింటే కరోనా రాదని నమ్మి, ఆ ప్రయత్నంలో కొందరు మూర్ఖులు ఆస్పత్రిపాలైనారు. ఇప్పటికైనా ఇలాంటి మూర్ఖత్వాల్ని విడనాడి, కరోనా బారినుండి రక్షణకోసం సైన్సు చెబుతున్న సూత్రాలను పాటిద్దాం. మన జీవితాన్నే కాదు, మానవజాతి మనుగడనీ కాపాడుకుందాం. 


నార్నెవెంకటసుబ్బయ్య,  అధ్యక్షుడు, ఏపీ హేతువాదసంఘం

Updated Date - 2020-03-26T09:00:04+05:30 IST