అయ్యో..!

ABN , First Publish Date - 2021-05-12T05:53:58+05:30 IST

కరోనా విలయతాండవంతో గంటలు, రోజుల వ్యవధిలో ఎందరో కనుమరుగు అవుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడుతున్నారు.

అయ్యో..!
కరోనాతో చికిత్స పొందుతూ రుయాలో మరణించిన పెద్దకొడుకు ఆవుల వెంకటసుబ్బయ్య

ఆక్సిజన్‌ అందక తండ్రీకొడుకు మృతి

తిరుపతి రుయాలో ఘటన


రాజంపేట, మే11 : కరోనా విలయతాండవంతో గంటలు, రోజుల వ్యవధిలో ఎందరో కనుమరుగు అవుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. సోమవారం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక మృతిచెందిన వారిలో రాజంపేట మండలం హెచ్‌.చెర్లోపల్లెకు చెందిన తండ్రీకొడుకు ఉన్నారు. తండ్రి, పెద్దకొడుకు చనిపోగా, తల్లి కరోనాతో ఆసుపత్రిలో ఉండగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు అనాథగా మారాడు. వివరాలు ఇలా..

రాజంపేట మండలం హెచ్‌.చెర్లోపల్లెకు చెందిన ఆవుల సుబ్బయ్య(56), సుబ్బమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఎ.వెంకటసుబ్బయ్య(27) హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా చిన్నకొడుకు ఎ.హరికృష్ణ 9వతరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య ఇటీవల హైదరాబాదు నుంచి ఇంటికి వచ్చాడు. అతను కరోనా బారిన పడ్డంతో వెంటనే 4వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరాడు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేశారు. ఇదే క్రమంలో అతని తండ్రి సుబ్బయ్య కూడా కరోనా బారినపడ్డంతో 8వ తేదిన అదే ఆసుపత్రిలో చేరాడు. ఇద్దరూ అక్కడే చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తండ్రి, ఆక్సిజన్‌ అందక రాత్రి కుమారుడు చనిపోయారు. సుబ్బమ్మకు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో ఆమెను మంగళవారం తిరుపతి ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆసుపత్రిలో మంగళవారం తండ్రి కొడుకు సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాకు గురైన సుబ్బమ్మను తిరుపతి ఆసుపత్రిలో ఉంచి వారి కుమారుడు హరికృష్ణను బంధువులు ఇంటికి తీసుకువచ్చారు. ఈ సంఘటన చూసి హెచ్‌.చెర్లోపల్లె వాసులు ఆవేదనకు గురయ్యారు. 



Updated Date - 2021-05-12T05:53:58+05:30 IST