అయ్యో.. ముంబై

ABN , First Publish Date - 2022-04-11T09:58:16+05:30 IST

అయ్యో.. ముంబై

అయ్యో.. ముంబై

వరుసగా నాలుగో ఓటమి  జూ బెంగళూరు ఘనవిజయం 

అనూజ్‌ హాఫ్‌ సెంచరీ


పుణె: ఐపీఎల్‌లో ఘనచరిత్ర కలిగిన ముంబై ఇండియన్స్‌ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఏ విభాగంలోనూ పెద్దగా రాణించని ఈ జట్టు శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అటు ఆర్‌సీబీకిది హ్యాట్రిక్‌ విజయం. అనూజ్‌ రావత్‌ (66), కోహ్లీ (48) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (68 నాటౌట్‌) ఒక్కడే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అనూజ్‌ రావత్‌ నిలిచాడు. ముంబై తొలిసారిగా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది.


రావత్‌-కోహ్లీ భాగస్వామ్యం

స్వల్ప ఛేదనలో బెంగళూరుకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. యువ ఓపెనర్‌ అనూజ్‌ రావత్‌ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఆరంభం మాత్రం నిదానంగానే సాగింది. కెప్టెన్‌ డుప్లెసీ (16) పరుగులు తీసేందుకు కష్టపడినా.. రావత్‌ మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ రెండో ఓవర్‌లోనే రెండు సిక్సర్లు బాదాడు. ఏడో ఓవర్‌లో రావత్‌  సిక్సర్‌ సాధించగా.. 50 పరుగుల స్కోరు వద్ద జట్టు డుప్లెసీ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ జత కలవడంతో మరో ఎండ్‌లో రావత్‌ చెలరేగాడు. 12వ ఓవర్‌లో 6,4 సాధించిన అతను 38 బంతుల్లో తొలి ఐపీఎల్‌ ఫిఫ్టీ సాధించాడు. కానీ కోహ్లీ పిలుపు మేరకు రెండో రన్‌ కోసం వెళ్లిన రావత్‌ 17వ ఓవర్‌లో రనౌటయ్యాడు. కాసేపటికే కోహ్లీని బ్రేవిస్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అప్పటికే ముంబై ఓటమి ఖరారైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ (8 నాటౌట్‌) రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.


 11 బంతులు.. 4 వికెట్లు

 టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన ముంబైకి ఓ దశలో పరుగులతో పాటు వికెట్లు కాపాడుకోవడం కూడా కష్టమైంది. అయితే సూర్యకుమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చివరి ఆరు ఓవర్లలో 71 పరుగులు సాధించి పరువు కాపాడుకుంది. కాగా ఏడో ఓవర్‌లో రోహిత్‌ అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే ముంబై ఇన్నింగ్స్‌లో వికెట్ల పతనం కూడా వేగంగా సాగింది. కేవలం 11 బంతుల వ్యవధిలోనే బ్రెవిస్‌ (8), ఇషాన్‌, తిలక్‌ వర్మ (0), పొలార్డ్‌ (0) పెవిలియన్‌కు చేరడంతో 62/5 స్కోరుతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. తిలక్‌ వర్మ లేని పరుగు కోసం ప్రయత్నించి మ్యాక్స్‌వెల్‌ సూపర్‌ త్రోతో రనౌట్‌ కావడం దెబ్బతీసింది. రమణ్‌దీప్‌ (6)కూడా నిష్క్రమించగా.. ఇక సూర్య ఎదురుదాడికి దిగాడు. 19వ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. అటు సూర్యకుమార్‌ అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. ఆఖరి ఓవర్‌లో హర్షల్‌ స్లో బంతులతో ఏడు పరుగులే ఇచ్చి కట్టడి చేయగలిగాడు. 


స్కోరుబోర్డు

ముంబై: ఇషాన్‌ కిషన్‌ (సి) సిరాజ్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 26, రోహిత్‌ శర్మ (సి అండ్‌ బి) హర్షల్‌ 26, డెవాల్డ్‌ బ్రేవిస్‌ (ఎల్బీ) హసరంగ 8, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 68, తిలక్‌ వర్మ (రనౌట్‌/మ్యాక్స్‌వెల్‌) 0, పొలార్డ్‌ (ఎల్బీ) హసరంగ 0, రమణ్‌దీప్‌ సింగ్‌ (సి) కార్తీక్‌ (బి) హర్షల్‌ 6, ఉనాద్కట్‌ (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 151/6; వికెట్ల పతనం: 1-50, 2-60, 3-62, 4-62, 5-62, 6-79; బౌలింగ్‌: డేవిడ్‌ విల్లే 2-0-8-0, సిరాజ్‌ 4-0-51-0, హసరంగ డిసిల్వా 4-0-28-2, ఆకాశ్‌ దీప్‌ 4-1-20-1, హర్షల్‌ పటేల్‌ 4-0-23-2, షాబాజ్‌ అహ్మద్‌ 2-0-19-0.

బెంగళూరు: డుప్లెసీ (సి) సూర్యకుమార్‌ (బి) ఉనాద్కట్‌ 16, అనూజ్‌ రావత్‌ (రనౌట్‌/రమణ్‌దీప్‌) 66, విరాట్‌ కోహ్లీ (ఎల్బీ) బ్రేవిస్‌ 48, దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 7, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.3 ఓవర్లలో 152/3; వికెట్ల పతనం: 1-50, 2-130, 3-144; బౌలింగ్‌: బాసిల్‌ థంపీ 4-1-29-0, జైదేవ్‌ ఉనాద్కట్‌ 4-0-30-1, బుమ్రా 4-0-31-0, మురుగన్‌ అశ్విన్‌ 3-0-26-0, పొలార్డ్‌ 3-0-24-0, బ్రేవిస్‌ 0.3-0-8-1.

Updated Date - 2022-04-11T09:58:16+05:30 IST