తెరచిన పుస్తకం

ABN , First Publish Date - 2021-05-19T05:40:10+05:30 IST

సినీమా రంగంలో మంచి పాటలు రాసినా నిలదొక్కుకోడానికి ప్రయత్నించలేదు అదృష్ట దీపక్‌. ఏది రాసినా తను నమ్మిందే రాశాడు. కొన్ని సినిమాలకు దర్శకులు వివరించిన సన్నివేశాలలోని....

తెరచిన పుస్తకం

సినీమా రంగంలో మంచి పాటలు రాసినా నిలదొక్కుకోడానికి ప్రయత్నించలేదు అదృష్ట దీపక్‌. ఏది రాసినా తను నమ్మిందే రాశాడు. కొన్ని సినిమాలకు దర్శకులు వివరించిన సన్నివేశాలలోని అనౌచిత్యాన్ని భరించలేక పాట రాయకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలున్నాయి. 


స్నేహం హృదయ సంబంధి కాదు. అమూర్త భావన అసలే కాదు. వట్టి కరచాలనాల చేతన కాదు. మిత్రులకు కల్మషం లేని స్నేహ మాధుర్యాన్ని అందించినవాడు అదృష్టదీపక్‌. గలగల మాట్లాడేవాడు. తను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఉండేవాడు. ముఖం ముందు ఒకలా ముఖం వెనక మరోలా ఉండే వారిని ఈసడించేవాడు. అభిప్రాయ ప్రకటనలో నసుగుడుతనం ఉండేది కాదు. నిత్యం నిర్మొహమాటాన్ని ఆభరణంగా ధరించేవాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భావప్రకటనా స్వేచ్ఛను నిస్సందేహంగా వాడుకునేవాడు. అవతలివాడు ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే చీల్చి చెండాడేవాడు. చెప్పొచ్చేదేమంటే అదృష్టదీపక్‌ యధార్థవాది. అందుకే లోకవిరోధి. 


అదృష్టదీపక్‌ 1950 జనవరి 18వ తేదీన జన్మించాడు. కాశీమజలీ కథలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కథ ఉంది. దేవుళ్ల పేరు కాకుండా వైవిధ్యంగా ఉంటుందని కమ్యూనిస్టు భావజాలం ఉన్న మేనమామ పెట్టిన పేరు అదృష్టదీపక్‌. చాలామంది ఇది కలం పేరు అనుకుంటారు గానీ నిజం పేరే.


సినీమా రంగంలో మంచి పాటలు రాసినా నిలదొక్కుకోడానికి ప్రయత్నించలేదు. ఏది రాసినా నమ్మిందే రాశాడు. కొన్ని సినిమాలకు దర్శకులు వివరించిన సన్నివేశాలలోని అనౌచిత్యాన్ని భరించలేక పాట రాయకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలున్నాయి. ఒకనాడు ఉన్నత విలువలతో కూడిన సాహిత్యంతోనూ సంగీతంతోనూ పరిఢవిల్లిన తెలుగు సినీమా పాట శబ్దకాలుష్యంలో చిక్కుకోవడాన్ని భరించలేక రాయడం విరమించుకున్నాడు. 


తెలుగు భాష పట్ల అమితమైన ప్రేమాభిమానాలు గల అదృష్టదీపక్‌ పదాలు తప్పుగా రాసినా ఉచ్చరించినా బాధపడేవాడు. పిల్లలకు అక్షర దోషాలు లేకుండా తెలుగు నేర్పాలని, రాయడాన్ని అలవాటు చేయాలని వాంఛించేవాడు. నిత్యం పదాలతో ఆడుకోవడం ఇష్టం. అందుకే ఒక పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రారంభ సంచిక నుండీ ఎంతో ఇష్టంగా భాషాభిమానుల్ని అలరించే విధంగా ‘పదశోధన’ నిర్వహిస్తున్నాడు.


మానవత్వం పరిమళించే మంచి మనసున్నవాడిగా ప్రగతిశీలవాదిగా అభ్యుదయవాదిగా నిబద్ధత గల సాహిత్యకారుడిగా సినీగీత రచయితగా వాగ్గేయకారుడిగా నటుడిగా నాటక పరిషత్‌ గుణనిర్ణేతగా కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా బహుముఖీన సాహిత్య వ్యక్తిత్వం గలవాడుగా పేరొందిన అదృష్టదీపక్‌ కరోనా బారినపడి మరణించడం విషాదకరం. ఏభై ఏళ్ల అనుబంధం మాది. మిత్రుని కుటుంబ సభ్యలు సహచరి స్వరాజ్యం, పిల్లలు కిరణ్మయి, చక్రవర్తిలకు సంతాపం తెలియజేస్తున్నాను.


దాట్ల దేవదానం రాజు

Updated Date - 2021-05-19T05:40:10+05:30 IST