ఆగస్టులో బొమ్మ

ABN , First Publish Date - 2020-07-27T09:22:57+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షల దశలవారీ సడలింపులో భాగంగా కేంద్రం చేపట్టిన ‘అన్‌లాక్‌’ ప్రక్రియ.. మరో నాలుగురోజుల్లో మూడో దశలోకి అడుగుపెట్టనుంది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0

ఆగస్టులో  బొమ్మ

  • సినిమా హాళ్లు, జిమ్‌లు తెరిచే అవకాశం
  • 50 శాతం సీటింగ్‌తో నడిపేందుకు థియేటర్ల యాజమాన్యాలు సిద్ధం
  • 25 శాతంతో నడపాలంటున్న కేంద్రం!
  • నెలాఖరుకు ముగుస్తున్న అన్‌లాక్‌ 2.0
  • 3.0 మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్రం
  • మెట్రో రైళ్లు, పాఠశాలలకు మాత్రం నో!

న్యూఢిల్లీ, జూలై 26: కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షల దశలవారీ సడలింపులో భాగంగా కేంద్రం చేపట్టిన ‘అన్‌లాక్‌’ ప్రక్రియ.. మరో నాలుగురోజుల్లో మూడో దశలోకి అడుగుపెట్టనుంది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 ముగిసి.. ఆగస్టు ఒకటి నుంచి అన్‌లాక్‌ 3.0 ప్రారంభం కానుంది. ఆ దశలో పాటించాల్సిన నియమనిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్ర హోం శాఖ నిమగ్నమై ఉంది. మొదటి రెండు దశల్లో జనజీవనం సాధారణ స్థితికి రావడానికి అవసరమైన చాలావాటికి అనుమతిచ్చిన కేంద్రం.. నాలుగు నెలలుగా (మార్చి 24 నుంచి) మూతపడిన సినిమా హాళ్లు, జిమ్‌లు తెరవడానికి ఈసారి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, మెట్రో రైళ్లు, బడులకు మాత్రం ఈసారి కూడా అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.


రిటైల్‌, ఆతిథ్య, పర్యాటక రంగాలకు దశలవారీగా కొన్ని ఆంక్షలతో అనుమతిచ్చిన ప్రభుత్వం ఈసారి తమపై కరుణ చూపుతుందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఏఐ) ఆశిస్తోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు ఇప్పటికే హోం శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే, థియేటర్లలో ఏసీ వల్ల గాలి లోపల్లోపలే తిరుగుతుందని.. లోపల ఒక్క కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఉన్నా అందరికీ ముప్పు అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతోనైనా సరే నడపడానికి సిద్ధంగా ఉండగా.. ప్రభుత్వం 25 శాతం సీటింగ్‌తో మొదలుపెట్టాలని సూచిస్తోంది. అంతేకాదు, ఒకవేళ సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తే.. భౌతిక దూరం సహా అన్ని నిబంధనలూ పాటించాల్సిందే. అందుకు ఎంఏఐ సిద్ధంగా ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కాగిత రహిత టికెటింగ్‌ విధానం, హాల్‌లో సీట్లను దూరంగా జరపడం, శానిటైజింగ్‌ వంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సినిమా హాల్స్‌తో పాటు ఇలాగే పలు నిబంధనలతో వ్యాయామశాలలకు కూడా అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కేంద్ర హోం శాఖ మాత్రం అన్‌లాక్‌ 3.0 పై పెదవి విప్పట్లేదు.

Updated Date - 2020-07-27T09:22:57+05:30 IST