నా ఆర్తనాదాలు విని ఆనందించాడు!

ABN , First Publish Date - 2021-12-20T09:13:29+05:30 IST

నా ఆర్తనాదాలు విని ఆనందించాడు!

నా ఆర్తనాదాలు విని ఆనందించాడు!

చిత్ర హింసలు పెడుతూ..‘పై వాడికి’ ఫోన్‌లో చూపించారు

సినిమాల్లో కొట్టినా చూడలేను.. పోలీసు దెబ్బలు తిన్నా

తెలుగుపై మాట్లాడటంతో జగన్‌కు కోపమొచ్చింది

పార్లమెంటరీ కమిటీకి ఎంపిక కావడం నచ్చలేదు

అపాయింట్‌మెంట్‌ ఇచ్చి రావొద్దు వెళ్లిపొమ్మన్నారు

జగన్‌ కోసం తెచ్చిన బొకే.. గవర్నర్‌కు ఇచ్చేశాను

పార్టీ అధ్యక్షుడిగా చెప్పిన మాటలు వేరు

జగన్‌ నిర్ణయాలతో మా పార్టీ నాశనమవుతోంది

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు



రాజకీయాల్లో... ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌! వైసీపీ రెబల్‌ ఎంపీ! మీ పార్టీ ఏది? అంటే... ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ!’ అంటూ అసలు పేరు చెబుతారు. అందరిలాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అనరు! ఢిల్లీలో కూర్చుని నిత్యం ‘రచ్చబండ’ పేరిట సర్కారును ఉతికి ఆరేస్తుంటారు. కానీ... ‘మా పార్టీకి నేను వీర విధేయుడిని. మా ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను మాత్రమే నేను బయటపెడుతున్నాను’ అని కొత్త లాజిక్‌లు తీస్తారు. ఆయన దృష్టిలో... పార్టీ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ వేరు, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ వేరు! చురకలు, వ్యంగ్యం, తనదైన హావభావాలను కలగలిపి విషయాన్ని సూటిగా జనంలోకి పంపే సమర్థుడు! ఆయనే... నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు! ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆయన పాల్గొన్నారు. ఎప్పటిలాగానే... తనదైన శైలిలో వివిధ అంశాలపై స్పందించారు. ‘నాకు ఒక ఆశయం ఉంది’ అంటూ నర్మగర్భంగా అన్నారు. అదేమిటంటే... ‘ప్రజలు సుఖంగా ఉండాలని’ అని అసలు సమాధానం దాటవేశారు.



అది మామూలు కొట్టుడు కాదు!

నా జీవితంలో ఎప్పుడూ దెబ్బలు తినలేదు. మంచి విద్యార్థిని కాబట్టి... బడిలో టీచర్లతో కూడా తన్నులు తినాల్సిన అవసరం రాలేదు. కానీ... ఫస్ట్‌ దెబ్బే పోలీసు దెబ్బ. ఎంపీ అయి ఉండి కొట్టించుకోవడం ఒక రికార్డుగా మిగిలిపోయింది. సినిమాల్లో ఎవరినైనా కొడితేనే నేను బాధపడతాను. అలాంటిది నేనే తన్నులు తినాల్సి వస్తుందని ఊహించలేదు. ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు.



జగన్‌కు తెచ్చిన బొకే గవర్నర్‌కు

నన్ను పార్లమెంటు లెజిస్లేషన్‌ సబార్డినేట్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పాలని, అపాయింట్‌మెంట్‌ తీసుకుని నా ఎత్తులో సగం ఎత్తున్న ఒక పెద్ద బొకే చేయించుకుని ప్రత్యేక విమానంలో వచ్చాను. తీరా వచ్చిన తర్వాత... అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయినట్లు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడేందుకూ ఇష్టపడలేదు. చాలా అవమానంగా ఫీలయ్యాను. ఇంత పెద్ద బొకే తెచ్చాను కదా! దీనిని ఇతని కంటే పెద్దవ్యక్తికి ఇవ్వాలని అనుకున్నా. వెంటనే గవర్నర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి సమయం అడిగాను. అప్పటికప్పుడు గవర్నర్‌ సమయం ఇచ్చారు. ఆ బొకేను తీసుకెళ్లి గవర్నర్‌ గారికి ఇచ్చాను. ఈ బొకే తంతు జరిగిన తర్వాతే సభలో నేను తెలుగుపై మాట్లాడాను. 


పరదాలు.. సరదాల పర్యటనలు

వరద ప్రాంతాల్లో పరదాలు... విమానంలో సెల్ఫీలు, సరదాలు!  ‘‘మీ వాళ్లు చెప్పినా మేమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదు సార్‌. అన్నీ వచ్చాయి.. ఉప్పు వచ్చింది... పప్పు వచ్చింది’’ అంటూ నటులకు ప్రాంప్టింగ్‌ చెప్పినట్లుగా వరద బాధితులు చెబుతుంటే ఈయన ప్రశాంత వదనంతో చక్కగా చిరునవ్వు నవ్వుతూ వినడం! కొంతమంది కళాకారులు నటన అయిపోయాక ‘సెల్ఫీ సెల్ఫీ’ అంటే వారితో సెల్ఫీలు దిగడం! ఇలా సరదాగా పరదాల మాటున సెల్ఫీ టూర్‌ పూర్తి చేసుకుని, బాధితుల పొగడ్తలు వింటూ... ఆనందంగా మళ్లీ హెలికాప్టర్‌లో వెనక్కి వచ్చేశారు. గతంలో హెలికాప్టర్‌లో తిరిగితే ఏం తెలుస్తుందని ఈయనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.




వైఎస్‌తో అనుబంధం ఇలా...

ఆయన తండ్రి వైఎస్‌, నేనూ చాలా క్లోజ్‌. ఆయన సీఎం కాకమునుపు... పులివెందుల వాళ్లకు ఏదైనా పని కావాల్సి వస్తే వెంటపడేవారు. ‘‘మీరు నాకు మళ్లీ ఫోన్‌ చేయకండి. నేను పని పూర్తి చేసి కాల్‌ చేస్తాను’’ అని చెప్పగలిగే చనువు వైఎస్‌తో ఉండేది. అలాంటిది, నేను అంత ఖర్చు పెట్టుకుని కృతజ్ఞతలు చెబుదామని వస్తే నా ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అది నాకు మంట కలిగించదా! ఎంపీలతో నిర్వహించిన ఒక సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ... ‘‘కొంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారట. ఎవరూ ఎవరినీ కలవడానికి వీల్లేదు. సాయిరెడ్డి అన్న, మిథునన్న తప్పించి ఎవరూ కలవడానికి లేదు’’ అంటూ నావైపు చూడకుండానే ఈ మాటలు చెప్పారు. దాంతో నా గురించే చెబుతున్నారని అర్థమైంది. చెప్పేదేదో డైరెక్టుగా నాతో చెప్పొచ్చుకదా!


ప్రధానితో మిమ్మల్ని పోలీసులు కొట్టిన విషయం చెప్పారా?

చెప్పాను. నన్ను చితక్కొట్టిన తర్వాత ఒకసారి నాకు అప్పాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయ్యింది. ఈ విషయం తెలిసి మా వాళ్లు వాళ్లకు తెలిసిన మార్గంలో కాళ్లావేళ్లా పడి ఈ టైంలో సమయం ఇస్తే సర్వనాశనం అవుతామని చెప్పుకొని రద్దు చేయించారని తెలిసింది. ఆ తర్వాత పీఎంవో అధికారులే అమిత్‌ షాతో సమయం ఫిక్స్‌ చేశారు. 15 రోజుల్లో మూడుసార్లు అమిత్‌ షాను కలిశాను. 


సాయిరెడ్డి, సజ్జలను తిడతారెందుకు?

వీళ్లే ఆయన్ని పాడు చేస్తున్నారా అని గతంలో ఒక చిన్న భావన ఉండేది కానీ, అదేం లేదని తేలింది. వీళ్లిద్దరూ చేయడానికి ఏమీ లేదని, నిమిత్త మాత్రులని జ్ఞానోదయమైంది. వాళ్ల జోలికి వెళ్లడం లేదు.


జగన్‌లో అపరిచితుడి లక్షణాలు ఉన్నాయని, బయటకు వచ్చేస్తున్నా అని ఎనిమిదేళ్ల క్రితం ఇదే షోలో చెప్పారు. అలాంటిది ఆయనకు వ్యతిరేకంగా వెళితే... అపరిచితుడు బయటకు వస్తాడని తెలియదా?

ఇది ఒక రకంగా స్వయంకృతమే. మాయవాడి వలలో పడినట్లు నేనూ పడ్డాను. జగన్‌ పాదయాత్ర తర్వాత పూర్తిగా మారిపోయారని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. మాయచేసి వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు నన్ను తీసుకెళ్లి ఇక్కడ పడేశాడు. పాదయాత్రలో ఆయన పిల్లల ముక్కులు తుడవడం లాంటివి చూసి నిజంగానే మారిపోయారని నమ్మాను. నాకు పోలీసు దెబ్బలు తినాలని రాసుంటే ఏం చేస్తాం.. రాష్ట్రంలో మాట్లాడితే చాలు కేసులు పెట్టేస్తున్నారు. ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు కదా! రాజ్యాంగంలోని అధికరణలను అనుసరించాలని సీఎంకు లేఖ రాశాను. ఆయన పట్టించుకోకపోవడంతో ప్రధానికి కూడా లేఖ రాశాను. ప్రధాని సమయం ఇస్తే వెళ్లి ఇదే విషయాలు చెప్పాను.


ఎంపీలంటే ఆ నలుగురే...

జగన్‌కు ఎంపీలు అంటే మిథున్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అంతే. ఈ నలుగురే ఆయనకు కళ్లు, ముక్కు, చెవులు. శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి... వీళ్లంతా రెడ్డి అయినా వారిని పెద్దగా పట్టించుకోరు! 


ఇదీ క్రైస్తవుల లెక్క

ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు ఆన్‌ రికార్డు రెండు శాతమే. కానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే అది 22 శాతంగా ఉంటుంది అని చెప్పాను. రాష్ట్రంలో హిందువుల ఆలయాలు అధికారికంగా 33 వేలు ఉన్నాయి. చర్చిలు 29,800 ఉన్నాయి. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం ప్రకారమే ఈ లెక్క. గౌరవ వేతనం తీసుకోని పాస్టర్లున్న చర్చిలు ఇంకా చాలా ఉన్నాయి. 


పార్టీ నాశనం...

సీఎంగా ఆయన తీసుకునే చర్యలతో పార్టీ నాశనమైపోతుంది. అందుకే... మా పార్టీ అధ్యక్షుడు పాదయాత్రలో ఏమన్నారో ప్రతి రోజూ చెబుతుంటా. అప్పట్లో మద్యపానం వల్ల కలిగే విషాదాల గురించే ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు  ‘మీరు తాగకపోతే నేను చేస్తానన్న మంచి పనులు చేయలేను’ అని సిగ్గు లేకుండా జీవోలు కూడా ఇచ్చారు.  - రఘురామ కృష్ణరాజు



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ రెబల్‌ ఎంపీ... నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు... ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇచ్చిన సమాధానాలు... 


ఈ మధ్య ఢిల్లీకి పరిమితమై అక్కడనుంచే చక్రం తిప్పుతున్నారు కదా?

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా జరుగుతోంది. ఇటీవల  లక్ష్మీనారాయణ గారి ఇంటి వద్ద చేసినట్లుగానే... పోలీసులు అర్ధరాత్రి నా ఇంటిపై దాడి చేసి, నన్ను ఎత్తి జీపులో పడేశారు.  ఆ తర్వాత నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా ఒక ఎంపీ మీద పోలీసులు ఇలా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఒక అధికారి నన్ను హింసించాడు. ఆ అధికారి ఎవరో నాకు బాగా తెలుసు.


ఆ అధికారి ఎవరు?

ఆ పేరు విచారణలోనే చెబుతాను. అప్పటి వరకూ సస్పెన్స్‌. ఆ అధికారి ఫోన్‌లో (చిత్రహింసలు చేయడన్ని) తనపై వ్యక్తికి చూపించాడు. 


ఆ పై వ్యక్తి ఎవరు?  అందరికంటే పైవాడా?

పై వాడంటే పైవాడే. ఆర్తనాదాలను చూసి ఆ పైవాడు ఆనందించాడు. స్పైడర్‌ సినిమాలో ఒక శాడిస్టిక్‌ విలన్‌ ఉంటాడు కదా! అలాగే ఆ పైవాడు కూడా విపరీతంగా ఆనందించాడట. ‘ఆర్తనాదములు శ్రవణానందకరంగా ఉన్నవి’ అని మాయాబజార్‌లో ఎస్వీ రంగారావు అన్నట్లు ఆ పైవాడు కూడా ఆనందించి, ఇంకా వాయించుకోండి అన్నాడట. 


ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టు చేయవద్దని సుప్రీం చెప్పింది కదా?

ఆ ధైర్యంతోనే హైదరాబాద్‌ వచ్చాను. అదీకాక నాకు అప్పటికే బెయిల్‌ కూడా వచ్చింది. నియోజకవర్గానికి వెళ్తానంటే ఏడు పోలీసు స్టేషన్లలో ఒకే సమయానికి ఒకే నేరంపై కేసులు పెట్టారు. ఇందులో ఆరు కేసులు ఒకే టైపు. మరొకటి వేరే. అదేమిటో చెబుతా వినండి! ఎన్నికలలో నాకు డబ్బులు అవసరం అని నా మనిషి ఒకరు అడిగితే.. ఒక వ్యవసాయ కూలీ పెద్ద మనసుతో ఐదు లక్షలు అప్పు ఇచ్చాడట. అది కూడా నేనెవరో తెలియకుండా నా మనిషికి ఇచ్చారట. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా మనిషిని ఆ కూలి అడిగితే... నా మనిషి నాకు ఫోన్‌ చేసినప్పుడు నేను బూతులు మాట్లాడానట! అది ఆ కూలీ ఫోన్‌ స్పీకర్‌లో విన్నాడట! అది పక్కన వాళ్లు విన్నారట! అందుకని నాపై అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు పెట్టారు. ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన చట్టాన్ని కూడా ఇలా దుర్వినియోగం చేస్తున్నారు.


ఎన్నికైన ఆరు నెలలకే మీ మధ్య గ్యాప్‌ వచ్చింది. గొడవ ఎక్కడ మొదలైంది?

గ్యాప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. తిరుపతి వెంకన్న స్వామి భూములు అమ్మేయాలన్నప్పు డు దానం చేసిన వారిని సంప్రదించి, వారు సమ్మతిస్తే అమ్మేయండి అని సూచించాను. ఒక భక్తుడిగా కొంచెం గట్టిగానే చెప్పాను. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూ లో మోహన్‌ దాస్‌ పాయ్‌తో మాట్లాడే సందర్భంలో ఈ టాపిక్‌ వచ్చింది. దానికి అనుబంధంగా క్రైస్తవం మీద చర్చ సాగింది..


అప్పటికే ఏదో తేడా మొదలైందనుకుంటా?

వెంకటేశ్వర స్వామి అంశానికి ముందు పార్లమెంట్‌లో ఒక సంఘటన జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350ఏ ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలి. అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా ఈ అధికరణను అనుసరించేలా చూడాలని విద్యా శాఖ మంత్రిని కోరాను. అప్పుడు ‘అన్నా అదరగొట్టావ్‌’ అని మిథున్‌ రెడ్డి కూడా ప్రశంసించారు. వాళ్లకి అప్పుడు అర్థం కాలేదు. ఆ రాత్రికే సీన్‌ మారిపోయింది. నా మీద సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బ్రేకింగ్‌ వచ్చింది. సుబ్బారెడ్డిని పిలిచి రఘురామరాజును సస్పెండ్‌ చేయాలని సీఎం ఆదేశించారని వార్తల్లో వచ్చింది. ‘సరే ఏం చేస్తాం’ అనుకున్నా. తెలుగు గురించి మాట్లాడినందున నన్ను తక్షణం తన ముందు ప్రవేశపెట్టమని సీఎం ఆజ్ఞాపించడం జరిగింది. ఆ తర్వాత ఒక గురువారం మిథున్‌ రెడ్డి వచ్చి, ‘నీకు తాఖీదు వచ్చింది సీఎం రమ్మన్నారు. వెళదాం’ రమ్మన్నారు.  ఎందుకు ఇలా మాట్లాడావని అడిగారు. నేను రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్‌ గురించి చెప్పానని తెలిపాను. నిజానికి భాష మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న వచ్చింది. అప్పటికప్పుడు నేను అనుబంధ ప్రశ్న అడిగా ను. నాకు అవకాశం రావడంతో మాట్లాడానని చెప్పాను. రాష్ట్రం లో ఇలా తెలుగు తీసేస్తున్నారని చెప్పలేదని కూడా వివరించాను. దాంతో ఇలాంటివి రిపీట్‌ కాకూడదని జగన్‌ అన్నారు. 


గెలిచిన నెల రోజుల నుంచే మొదలైందా?

నెల కాదు కానీ... 3 నెలల్లో మొదలైంది. ఆయనకు సబ్‌ సర్వెంట్‌గా ఉండాలి. అది నాతో కుదరదు. సీఎంను కలవడానికి నేను విజయవాడ వెళ్లడానికి ఒకరోజు ముందు, పార్లమెంట్‌లో ప్రధాని సెంట్రల్‌ హాలు నుంచి వెళ్లే సమయంలో అనుకోకుండా ఆ పక్కనే ఉన్న నేను తలదించుకుని నమస్కారం పెట్టాను. ఆయన ఆగిపోయారు. దగ్గరకు వెళ్లాను. ‘రాజు గారూ’ అని భుజం మీద చరిచారు. నేను కొంచెం ఎక్కువ వంగి నమస్కారం చేశాను. అది సంచలనం అయ్యింది. 


అదేనా మీ మీద కడుపు మంట?

అయ్యుండొచ్చు. మరునాడు మా సీఎంను కలిసినప్పుడు ఆయన టేబుల్‌ మీదున్న పత్రికలో నా ఫొటోనే ఉంది. ఆ రోజే సస్పెండ్‌ చేస్తారనుకున్నా. కానీ అప్పుడంతా స్మూత్‌గానే అయిపోయింది. 


జగన్‌ను గెలవలేకపోయిన మీరు... మోదీకి ఎలా దగ్గరయ్యారు?

మా జగన్‌, ప్రధాని మోదీ ఇద్దరి గురించీ చెబుతా. దేశంలో ప్రధాని నంబర్‌ వన్‌. ఎంపీలందరికీ అశోకా హోటల్‌లో మోదీ డిన్నర్‌ ఇచ్చారు. అక్కడ ప్రధాని, వెంకయ్యనాయుడు ఒక టేబుల్‌పై ఉన్నారు. అప్పుడు నేను వెళ్లి ఆయన్ని కలిసి చాలా ఫ్రీగా మాట్లాడాను. 2014లో గుజరాత్‌ అసెంబ్లీలో నేను మిమ్మల్ని కలిశానని గుర్తు చేశాను. ఆయన బాగా మాట్లాడారు. ‘సర్‌ నేను మిమ్మల్ని నా కుటుంబంతో కలవాలి. సమయం ఇవ్వగలరా’ అని అడిగాను. మూడో రోజు నాకు పీఎంవో నుంచి ఒక ఫోన్‌ వచ్చింది. ‘మీరు ప్రధాని సమయం కోరారా? రేపు ఉదయం 11-15 గంటలకు మీ కుటుంబంతో రండి’ అన్నారు. నోటి మాటతో అడిగిన విషయాన్ని గుర్తు పెట్టుకుని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తలుపు తీయగానే... గుమ్మంలోనే ప్రధాని నిలబడి ఉన్నారు. ప్రధాని తలుపు దగ్గర నిలబడి స్వాగతం చెప్పడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. దాంతో నేను కాళ్లపై పడబోయాను. కానీ ఆయన రెండు భుజాలను పట్టుకుని వారించి, ‘మనం కొలీగ్స్‌! ఇవేమీ వద్దు’ అన్నారు అన్ని విషయాలూ మాట్లాడి, తలుపు వరకూ వచ్చి సాగనంపారు. ఇలాంటి వారొకరు! రమ్మని పిలిచి కూడా అప్పాయింట్‌మెంట్‌ లేదనే వారొకరు!  


అమిత్‌ షా అడిగిన వెంటనే సమయమిస్తారు కదా?

కోరిన వెంటనే కాదు కానీ... మా సీఎం అడిగినన్నిసార్లు నేను అడగనక్కర్లేదు.


మిమ్మల్ని బహిష్కరించాలని వాళ్ల మీడియాలో వేశారు కదా?

ఈ విజయసాయిరెడ్డి వాళ్లే చెడగొట్టారు. వాళ్లు ఎంతసేపూ నా సభ్యత్వం క్యాన్సిల్‌ చేయాలంటారు. ఎలా అవుతుంది? నేను నా పార్టీని అమితంగా ప్రేమిస్తాను.




ఏ పార్టీని?

యుశ్రారైకాపా! (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ). నేను ఎప్పుడూ పార్టీని ప్రేమిస్తున్నా. వ్యతిరేకించను. నా రచ్చబండ కార్యక్రమాలన్నీ చూడండి. మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడిని నేను ఏమీ అనను. సీఎంను, ప్రభుత్వాన్ని విమర్శిస్తాను. తప్పులన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. సీఎంగా ఆయనవన్నీ తప్పులే. ఒప్పు పట్టడానికి ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వాన్ని సరిదిద్దాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 


మద్యం ఆదాయంపై జీవో ఇచ్చేశారు కదా?

అది తెలివి తక్కువగా ఇచ్చిన జీవో కాదు. స్కీముల్లో స్కాం అది. దానిపేర భవిష్యత్తులో రాబోయే ఆదాయానికి కూడా ఇప్పుడే రుణం తీసుకుని వచ్చే ఎన్నికల్లోపు ఈయన ఉదార స్వభావాన్ని చాటుకోవాలని చేసే ప్రయత్నం. మొన్న పార్లమెంట్‌లో కూడా ఇదే మాట్లాడాను. ఆ సందర్భంలోనే, కొంతమంది విద్యాధికులు ‘నన్ను కూర్చోరా లం...కొడకా’ అని తిట్టారు. దాంతో శభాష్‌ సురేష్‌ అని సీఎం మొచ్చుకున్నారట. అసెంబ్లీలో నన్ను లుచ్చా అని జోగి రమేశ్‌ తిడితే... ఈయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందం ఆపుకోలేక, ‘మనసు దోచావ్‌ రమేశ్‌’ అని అన్నారంటే అంతకంటే ఇంకేముంటుంది. 

(రెండో భాగం వచ్చేవారం)

Updated Date - 2021-12-20T09:13:29+05:30 IST