వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదు

ABN , First Publish Date - 2022-04-04T05:58:40+05:30 IST

తెలుగు సినిమాల్లో ఆమెదో ప్రత్యేక స్థానం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. రాజకీయాలకు నేను సరిపోను అని అంటారు నటి రాధికా శరత్‌కుమార్‌. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆమె ముచ్చటించారు.

వెనక్కి తిరిగి చూసే   అలవాటు లేదు

తెలుగు సినిమాల్లో ఆమెదో ప్రత్యేక స్థానం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. రాజకీయాలకు నేను సరిపోను అని అంటారు నటి రాధికా శరత్‌కుమార్‌. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆమె ముచ్చటించారు. 


ఆ సంభాషణలు ఇవి...


 ఆర్కే: తెలుగు సినిమాల్లో నటించడానికి 20 ఏళ్ల గ్యాప్‌ రావడానికి కారణం?

రాధిక: తమిళ సినిమాలపై దృష్టి పెట్టడం ఒక  కారణం. పాప పుట్టడం పూర్తిగా నా జీవితాన్ని మార్చింది. తెలుగులో గ్యాప్‌ వచ్చినా నా మనసంతా ఇక్కడే ఉంది. ఇక్కడ దాదాపు 150 సినిమాలు చేశాను. 

ఆర్కే: సెట్‌లో హీరోలను మీరు డామినేట్‌ చేసేవారట కదా?

రాధిక:  నాక్కొంచెం సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. అందరితో సరదాగా ఉంటాను తప్ప నొప్పించేలా నా ప్రవర్తన ఉండదు.  కొంతమంది మాత్రం సెట్స్‌లో ఖాళీ టైమ్‌లో ఇంగ్లీష్‌ పుస్తకం చదువుతూ కూర్చుంటే ‘ఏంటి జయలలిత అనుకుంటుందా?’ అని కామెంట్‌ చేశారు. నేను సీరియ్‌సగా తీసుకోలేదు. 

ఆర్కే: ‘అమ్మో రాధికతోనా జాగ్రత్తగా ఉండాల’ని చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ సందర ్భంలో అన్నారు కదా!

రాధిక: చిరంజీవి అలా అనరు. నేను ఎక్కువ సినిమాలు ఆయనతోనే చేయడం వల్ల రోజూ కలుసుకునేవాళ్లం. ఇద్దరం టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటాం. తను నాకు చాలా మంచి మిత్రుడు. సురేఖ కూడా నాకు మంచి మిత్రురాలు. అయితే ఎంత చనువుగా ఉన్నా నాకంటూ ఓ లక్ష్మణరేఖ ఉంటుంది. అది దాటాలని చూస్తే మాత్రం ఎవరైనా సహించను. ఎవరైనా వెకిలి కామెంట్లు చేస్తే నవ్వుతూనే చురకలు అంటించేదాన్ని. అయితే నేను చేసిన పాత్రల వల్ల, బయట దూకుడుగా వ్యవహరించిన సందర్బాల వల్ల జనంలో నాపైన అలాంటి ఇంప్రెషన్‌ ఏర్పడి ఉంటుంది. 

ఆర్కే: పుస్తకాలు ఎక్కువగా చదువుతారని విన్నాం...

రాధిక:  అవును. ఆ అలవాటు స్కూల్లో వచ్చింది. శ్రీలంకలో చదువుకున్నాను.  అక్కడ స్కూల్లో లైబ్రరీ ఉండేది. ఎక్కువ పుస్తకాలు చదివిన విద్యార్థుల్లో నాదే అగ్రస్థానం. ఇప్పుడు బుక్స్‌ కన్నా స్ర్కిప్ట్స్‌ ఎక్కువగా చదువుతున్నాను. 

ఆర్కే: మీది తెలుగు మూలాలున్న కుటుంబమా?

రాధిక: నాన్న ఎం. ఆర్‌ రాధ తెలుగువారు. అందుకే ఇప్పటికీ తమిళనాట నన్ను తెలుగు అమ్మాయిగా చూస్తున్నారు. నాన్నగారి జీవితం ఆధారంగా ఒక స్ర్కిప్ట్‌ చేస్తున్నాను. అందులో ఏంజీఆర్‌, నాన్న గారి మధ్య జరిగిన కాల్పుల ఘటన ప్రస్తావన కూడా ఉంటుంది. అ సంఘటన జరిగినప్పుడే మా అమ్మ పిల్లలు అందరినీ శ్రీలంకలో ఉంచి చదివించారు. తర్వాత పై చదువుకు లండన్‌ వెళ్లాను. సెలవుల్లో నాన్నని కలవడానికి వచ్చినప్పుడు భారతీరాజా గారు ఫొటోలో నన్ను చూసి హీరోయిన్‌గా చేయమని అడిగారు. మా అమ్మ ఓ ప్రయత్నం చేసి చూడమనడంతో 15 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. 


ఆర్కే: వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటనలో మీతో పోటీ పడుతున్నట్టుంది?

రాధిక:  అవును. తను చాలా ప్రతిభగల నటి. వరలక్ష్మి సినిమాల్లోకి రావడం శరత్‌కి ఇష్టం లేదు. నేనే నచ్చజెప్పాను. తెలుగు సినిమాలు చేయమని చెప్పాను. అందుకే తను ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయింది. తను చాలా బోల్డ్‌గా ఉంటుంది. 

ఆర్కే: రాడాన్‌ సంస్థను పెట్టే ధైర్యం ఎవరిచ్చారు?

రాధిక:  నా కూతురు నెలల బిడ్డగా ఉన్నప్పుడు తనను వదిలి షూటింగ్స్‌కు వెళ్లడం ఇష్టంలేక నా కంటూ సొంత కెరీర్‌ ఉండాలని రాడాన్‌ ప్రారంభించాను. రుణం కోసం బ్యాంకుకి వెళితే ఇవ్వలేదు. బయట అప్పు దొరకలేదు. చాలా కష్టపడి నా దారి నేను నిర్మించుకున్నాను. నా కూతురు రేయాన్‌ సంస్థ పనులు చూసుకుంటోంది. కొడుకు చదువుతున్నాడు. రామానాయుడు గారు, అల్లు అరవింద్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవం నిర్మాణ సంస్థను నడపడంలో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రొడక్షన్‌తో పాటు తెలుగు సినిమాల్లో నటించడంపైనే దృష్టి పెట్టాను. తెలుగులో సినిమాలు కూడా నిర్మిస్తాను.

ఆర్కే: ఈ తరం హీరోయిన్లలో రాధికతో పోల్చదగినవారు ఉన్నారా?

రాధిక:  ఇప్పటి హీరోయిన్లకు అలాంటి అవకాశం లేదు. అలాంటి పాత్రలు వారికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. 

ఆర్కే: ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో మీ అనుభవం గురించి చెప్పండి?

రాధిక:  పెద్ద ఎన్టీఆర్‌తో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ సినిమా చేశాను. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు గారిని చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాను. పాట చిత్రీకరణ జరిగేటప్పుడు డ్యాన్స్‌ మూమెంట్స్‌ కంఫర్ట్‌గా ఉండాలని నాగేశ్వరరావు గారు టీ, జ్యూస్‌ మాత్రమే తాగేవారు. ఎన్టీఆర్‌ ఆరు గంటలకు షూటింగ్‌ అంటే ఒక పావుగంట ముందే మేక్‌పతో రెడీ అయి కూర్చునేవారు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసేవారు. అంతే తప్ప మార్పులు చెప్పేవారు కాదు. ఈ తరం వాళ్లు అలా వద్దనుకుంటున్నారు. చిరంజీవి సెల్ఫ్‌మేడ్‌ మాన్‌. తన కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో వర్క్‌ చేస్తున్నారు. 

ఆర్కే: 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంత సాధించానని అనుకుంటున్నారు?

రాధిక:  వెనక్కి తిరిగి చూసే అలవాటు నాకు లేదు. నా ప్రయాణంపై నాకు పూర్తి సంతృప్తి ఉంది. కొంతమంది వల్ల జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం చాలా డిస్ట్రబ్‌ అయ్యాను. అయినా నిరుత్సాహపడలేదు. వాటన్నింటితో రాటు తేలాను. ‘తర్వాత ఏమిటి’ అనేది ఒక్కటి మాత్రమే ఆలోచించాను. 


ఆర్కే: తెలుగు సినిమాల్లోకి మీ అరంగేట్రం ఎలా జరిగింది

రాధిక:  తెలుగులో క్రాంతికుమార్‌ గారు ‘న్యాయం కావాలి’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అప్పట్లో నాకు తెలుగు రాదు. దాంతో ఎక్కువ హార్డ్‌ వర్క్‌ చేశాను. తరువాత తెలుగులో మంచి పాత్రలు దక్కాయి. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఇక్కడ నాకు పేరొచ్చాక మళ్లీ తమిళ్‌ వాళ్లు వచ్చి వెనక్కి తీసుకెళ్లారు. 


ఆర్కే: మళ్లీ చిరంజీవి లాంటి పాత తరం హీరోలతో నటిస్తారా?

రాధిక: ఆయనకు తల్లిగా అయితే చేయను. విలన్‌గా అయినా చేస్తాను. నేను నటిని ఎలాంటి పాత్రలయినా చేస్తాను. తెలుగు హీరోలందరూ చాలా ఇష్టం. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఫెంటాస్టిక్‌ ఎనర్జీ. మహే్‌షబాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 


 జీవితం నేర్పిన పాఠం

కొవిడ్‌తో నాకు తెలిసినవాళ్లు చాలా మంది చనిపోయారు. అప్పుడే నన్ను బాధపెట్టే సంఘటలను పూర్తిగా మర్చిపోవాలని అనుకున్నాను. సంతోషం కలిగించే విషయాలే గుర్తుంచుకున్నాను. ఏం జరిగినా సంతోషంగా ఉండాలనేది నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం. 


ఆర్కే: జయలలితకు ఎదురెళ్లినప్పుడు భయం అనిపించలేదా?

రాధిక:  ఆ ఎన్నికల ప్రచారం సమయంలోనే జయలలిత గారితో విభేదాలు పొడసూపాయి. డీఎంకే తరపున  జయలలితకు నేను పోటీ అన్నట్టుగా ప్రొజెక్ట్‌ చే శారు. ఆమె అపార్థం చేసుకున్నారు. అయితే శరత్‌తో జయలలిత చాలా బాగా మాట్లాడేవారు. నేను ప్రస్తుతం రాజకీయాల్లో నా భర్తకు సపోర్ట్‌ చేస్తున్నాను. ఆయనలా కష్టపడే వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదు. తను ప్రజల మనిషి. నేను రాజకీయాలకి సరిపోను. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. ఆయన చాలా సిన్సియర్‌గా రాజకీయాలు చేస్తారు. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. 

ఆర్కే: భార్యగా శరత్‌కుమార్‌కి ఏవైనా సలహాలిచ్చారా?

రాధిక:  కళైంగర్‌ గారికి సినిమావాళ్లంటే ఇష్టం ఉండదు, ఆ పార్టీలో చేరవద్దు అని శరత్‌కు చెప్పాను. వాళ ్లకి పెద్ద లెసన్‌ ఎంజీఆర్‌. ఎప్పుడూ సినిమా వాళ్లని ఎంకరేజ్‌ చేయకూడదు అని అనుకోవడం నేను చాలా సార్లు విన్నాను. రాజకీయాల్లో ఉండేవాళ్లకు భయం ఎక్కువ. జయలలితకు కూడా అలాంటి భయం ఉంది. శరత్‌ను చూసి కూడా అలాగే భయపడేవాళ్లు. తను ఎక్కడా ఇమడలేకపోయాడు. 

ఆర్కే: శరత్‌కుమార్‌పై ఏ విషయంలో ఎక్కువగా కోప్పడతారు?

రాధిక: అడిగినవాళ్లకు లేదనకుండా సాయం చేస్తుంటారు. కొంతమంది శరత్‌ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని అవసరం లేకున్నా మాయమాటలు చెప్పి డబ్బు పట్టుకుపోయారు. అలాంటివాళ్లను గురించి ఆయన్ను హెచ్చరించినా పట్టించుకోలేదు. పోయిన సారి శరత్‌ పుట్టిన రోజుకు చాలా మంది యువకులు మా ఇంటికి వచ్చారు. తమను శరత్‌ చదివించినట్టు చెప్పారు. వాళ్లంతట వాళ్లు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అప్పుడు తనను చూసి చాలా గర్వంగా అనిపించింది. ఇప్పటికీ చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తరచూ శరత్‌ గొప్పదనం గురించి చెబుతుంటే సంతోషంగా అనిపిస్తుంది. 

ఆర్కే: మీ ఇద్దరికి ముందే  పరిచయం ఉన్నా పెళ్లి ఆలోచన ఎందుకు రాలేదు. 

రాధిక:  మా అమ్మ నా జాతకం ఒక జ్యోతిష్యుడుకి చూపించారు. ఆయన నా పెళ్లి విషయంలో దోషం ఉందన్నారు. అయితే శరత్‌కుమార్‌ అనే యాక్టర్‌ జాతకం మీ అమ్మాయి జాతకం చక్కగా సరిపోతుంది. కాబట్టి వాళ్లిద్దరికీ పెళ్లి చేయమని  చెప్పారట. నాకు సినిమావాళ్లంటే ఇష్టం లేదు. మా అమ్మ నా దగ్గర ఆ ప్రస్తావన తెస్తే నేను ఒప్పుకోలేదు. నా జీవితంలో అలా జరగాలని రాసిపెట్టి ఉంది.  


ఆర్కే: రాధిక అనగానే టాలెంట్‌ గుర్తుకొస్తుంది. ఎదిగేందుకు ఎలాంటి కృషి చేశారు?

రాధిక: ‘ఈ అమ్మాయి రెండు మూడేళ్లకు మించి ఇండస్ట్రీలో ఉండదు’, ‘తెల్లగా లేదు’ అని చాలా మంది అన్నారు. అప్పుడే అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించాలని కసితో నిర్ణయం తీసుకున్నాను. మేకప్‌ లేకుండా కూడా నటించాను. పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా హీరోయిన్‌గా కెరీర్‌లో మరింత ఎదిగాను. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ్‌సతో గొప్ప హిట్లు అందుకున్నాను. కానీ ఒక దశ దాటాక చిరంజీవి, రజనీకాంత్‌లాంటి హీరోలకి తల్లి పాత్రలు చేయమని పిలుస్తారని అర్థమైంది. నా కెరీర్‌ నా చేతుల్లోనే ఉండాలని సొంతంగా రాడాన్‌ నిర్మాణ సంస్థను స్థాపించాను. 

ఆర్కే: సినిమాల్లో మీ మాట నెగ్గాలనే పట్టుదలను ప్రదర్శించిన సందర్భం ఏదైనా ఉందా?

రాధిక: శరత్‌కుమార్‌, నేను కలసి చేసిన మొదటి చిత్రంలో ఆయన డబుల్‌ రోల్‌ చేశారు. శరత్‌కు భార్యగా, తల్లిగా నటించాను.  ఓ సన్నివేశంలో ‘జీవితంలో ఒక్కసారైనా మీతో దెబ్బలు తినాలనే నా కోరిక ఈ రోజు తీరింది’ అని ఒక డైలాగ్‌ ఉంది. నాకు నచ్చలేదు. మహిళలను అవమానించేలా ఉందని ఆ డైలాగ్‌ నేను చెప్పను అన్నాను. డైరెక్టర్‌కు నాకూ పెద్ద గొడవ అయింది. చివరకు దర్శకుడే తగ్గారు. ఆ సీన్‌ చేయలేదు. 

ఆర్కే: హీరోయిన్‌గా ఎదిగే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

రాధిక:  మహిళలు ప్రతిదీ తమ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అందుకే ఎవరినైనా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నేను విదేశాల్లో చదువుకొని ఇక్కడకు వచ్చాను. సెట్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మా డైరెక్టర్‌ చాలా అప్‌సెట్‌ అయ్యారు. నేను నమస్తే చెప్పకుండా షేక్‌హ్యాండ్‌ ఇచ్చేదాన్ని. దాంతో ‘అమ్మో ఇది చాలా ఫాస్ట్‌గా ఉంది. నా గురించి ఏం అనుకుంటుందో!’ అనే డైలాగ్‌లు విన్నాను. 

ఆర్కే: అప్పటికీ ఇప్పటికీ ఇండీస్ట్రీలో వచ్చిన మార్పులు...

రాధిక:  చిరంజీవితో చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉండేది. నటన విషయంలో ఒకరికొకరం సలహాలు ఇచ్చుకునేవాళ్లం.  ఇప్పుడు పరిశ్రమ చాలా సిస్టమాటిక్‌ అయింది. యాక్టర్స్‌ ఎక్కువగా మాట్లాడుకోరు. క్యారవాన్‌లో వెళ్లి కూర్చుంటారు. ఈ తరం యాక్టర్స్‌ వాళ్లని వాళ్లు చాలా సీరియ్‌సగా తీసుకుంటున్నారు. తమ గురించి గొప్పగా ఊహించుకుంటున్నారు. 

ఆర్కే: జీవితం గురించి ఇంత అవగాహన ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

రాధిక:  కళైంగర్‌ గారి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఆయనకు కళైంగర్‌ అని బిరుదు ఇచ్చిందే మా నాన్న. అందుకే నేనంటే చాలా ఇష్టం. కళైంగర్‌ వచ్చి అడగడంతో డీఎంకే కోసం 1989లో ప్రచారం చేశాను. నాకు పదవులు ఆఫర్‌ ఇచ్చారు. కానీ వద్దన్నాను. రాజకీయాలు సరిపడవని తొలి రోజే నాకర్థమైంది. కానీ ఇచ్చిన మాట కోసం ప్రచారం చేశాను. అప్పుడే నాపైన తెలుగు అమ్మాయి అనే ముద్ర వేసి ‘గుల్టీ’ అని పిలిచేవారు. మాది తెలుగు మూలాలు ఉన్న కుటుంబం అని అప్పుడే నాకు తెలిసింది. తర్వాత ఇక్కడికొచ్చాక తెలుగు వాళ్లు నన్ను అరవ అమ్మాయి అన్నారు. కొంచెం పేరు వచ్చాక అందరూ ‘మా అమ్మాయి’ అని ప్రశంసించారు. 

Updated Date - 2022-04-04T05:58:40+05:30 IST