Abn logo
Feb 1 2020 @ 20:07PM

‘అందరూ తిడుతున్నారు.. వేరే వేషం వెయ్యాల్సింది.. అని అమ్మ అంది..’

రెమ్యూనరేషన్ ఇస్తా... మాతో మాట్లాడండని నా భార్య కోరింది

సినిమాలు తగ్గించలేదు.. అవకాశాలే తగ్గాయి..

కెరీర్ పిచ్చిలో ఫ్యామిలీని మిస్ చేశా

ప్రజల సొమ్ము దోచి దొరలా తిరుగుతున్నారు

హిట్లర్‌లా తెగించే రోజు వస్తుందేమో

పోస్టర్‌ పెట్టుకునే దౌర్భాగ్యపు దశకు వచ్చావని నాన్న అనుకునేవారు

నాలోని రచయితను... నటుడు డామినేట్‌ చేశాడు

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో గొల్లపూడి మారుతీ రావు

సీనియర్ నటుడు, రచయిత.. గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం(12-12-2019) తుదిశ్వాస విడిచారు. రేడియో వ్యాఖ్యాతగా కెరీర్‌ను మొదలుపెట్టిన గొల్లపూడి.. అంచెలంచెలుగా ఎదిగారు. సాహితీరంగంలో కూడా ఆయన విశేష కృషి చేశారు. తనయుడు శ్రీనివాస్ పేరుతో కొత్త దర్శకులకు ప్రోత్సాహకాలు, అవార్డులు అందిస్తూ వచ్చారు. రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. తన జీవితంలోని ఎత్తుపల్లాలను 30-12-2013న జరిగిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో.. ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఆయన పంచుకున్నారు.. ఆ కార్యక్రమ పూర్తి వివరాలు..


ఆర్కే : నమస్కారం గొల్లపూడి మారుతీరావుగారు. ఎలా ఉన్నారు? చాలా ఏళ్ల తర్వాత కలిశారు.

గొల్లపూడి: బావున్నాను. ఆంధ్రజ్యోతిని కలిస్తే సంప్రదాయాన్ని కలిసినట్లు ఉంటుంది. ఈ పత్రికతో నాకు చాలా బంధం ఉంది. ‘జీవనకాలమ్‌’ కొన్నేళ్ల పాటు రాశాను.


ఆర్కే : ఇక్కడ తెలుగువాళ్లు కొట్టుకుంటుంటే మీరు మద్రాసులో కూర్చుంటే ఎలాగండీ (నవ్వుతూ)?

గొల్లపూడి: నేను మద్రాసులో ఉండేందుకు కారణం - ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండటం. ఒరిస్సాలో ఆలిండియా రేడియో నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని మద్రాసుకు వచ్చాను. సినిమా ఇండసీ్ట్ర హైదరాబాద్‌కు వెళ్లిపోయేనాటికి కెరీర్‌లో నిలబడ్డాను. పిల్లలు స్థిరపడటం మొదలుపెట్టారు. ఏ లక్నోలోనో రాయపూర్‌లోనో ఉంటే తెలుగువాళ్లకు దూరమయ్యామనిపిస్తుంది. కాని మద్రాసులో అలా అనిపించదు. అందువల్ల 43 ఏళ్లు మద్రాసులోనే ఉండిపోవాల్సి వచ్చింది.


ఆర్కే : అక్కడి నుంచి చూసినపుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు మీకేమనిపిస్తున్నాయి?

గొల్లపూడి: దూరంగా చూసేంత దూరంలో లేనండి. తెల్లవారిలేస్తే తెలుగువాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాను. మా తరం చిన్న తెలుగు సమాజం ఇప్పటికీ మద్రాసులో ఉంది. నాకెందుకో ఈ విభజన ఎప్పుడో జరిగుండాల్సింది అనిపిస్తుంది. చరిత్ర చూస్తే ఉద్యమాలు జరుగుతూనే వస్తున్నాయి. చిన్న అసంతృప్తి ఉంటూనే ఉంది. అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు. ఇక్కడ ఆగుతాను నేను. ఎందుకు ఆగుతానో చెబుతాను (నవ్వుతూ).


విచిత్రంగా మా ఆవిడ తెలంగాణలో పెరిగింది. భువనగిరిలోని ఎలిమెంటరీస్కూల్‌లో చదువుకుంది. కరీంనగర్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి, వరంగల్‌లో బీఏ చదువుకుంది. నా పెళ్లి హన్మకొండలో జరిగింది. వరవరరావుకు మా ఆవిడ క్లాస్‌మేట్‌. మా ముగ్గురు పిల్లలు హన్మకొండలోనే పుట్టారు. నేనేమో కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాను. కాబట్టి ఎటూ మాట్లాడలేని పరిస్థితి.

మీరు వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తానన్నాడు


ఆర్కే : మీ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. రంగస్థలం, నాటకాలు, సినిమాలు, రచనలు.. మీరెంతో బహుముఖప్రజ్ఞాశాలి. ఇది ఎలా సాధ్యమైంది?

గొల్లపూడి: నాలో విపరీతమైన ఫైర్‌ ఉండేది. 14 వ ఏటనే కథ రాశాను. ఈ వయసులో ఇప్పటికీ ఇంత చురుగ్గా ఉన్నానంటే 54 ఏళ్ల కిందట ఇంకెంత ఉత్సాహంగా ఉండేవాణ్ణోఊహించుకోండి. అప్పట్లో ఇన్నేసి తెలుగు పత్రికలు లేవు. ఇన్నేసి టీవీ ఛానళ్లు లేవు. ప్రతి పనినీ ఉపాధి కోణం నుంచే చూసేవారు. స్టామినా ఎక్కువ ఉండటం వల్ల పని చేయాలన్న తాపత్రయం ఎక్కువగా ఉండేది. దాన్ని వెంటిలేట్‌ చేయగలిగే వాతావరణం ఉండేది. నేను సినిమా రచయితను, నటుడ్ని అవుదామనుకోలేదు ఏ నాడూ. నటనకు ముందు రెండు దశాబ్దాలపాటు రచనలు చేశాను నేను.


గొట్టిపాటి మధుసూదనరావుగారు ‘మీరొక వేషం వేయాలండీ మారుతీరావుగారు’ అనేవారు. ఆలిండియా రేడియోలో వేషం వేయడం, రచనలు చేయడం నిషిద్ధం. అయినా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్లం. నా రేడియో సహచరుల గురించి చెప్పాల్సివస్తే అదొక భువనవిజయాన్ని తలపించేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, దాశరథి, జీవీ సత్యానంద్‌, స్థానం నరసింహారావు, జీవీ కృష్ణారావు, మునిమాణిక్యం నరసింహారావు, నాయిని సుబ్బారావు వంటి వాళ్లతో కలిసి పదిహేనేళ్ల కుర్రాడు (గొల్లపూడి) పనిచేస్తే అతని ఉత్సాహం ఎలా స్కై రాకెట్‌ అవుతుందో ఊహించండి.


ఒకరోజు దాశరథిగారు నన్ను పిలిచి ‘మారుతీరావు.. ఎక్కడుంటున్నావయ్యా? దుక్కిపాటి మధుసూదనరావుగారు నిన్ను కలుద్దామనుకుంటున్నారు’ అన్నారు. ‘అంత పెద్దాయన నన్నెందుకు కలుద్దామనుకుంటున్నారండీ’ అన్నాను. నేను గగన్‌మహల్‌ రోడ్డులో ఒక చిన్న షెడ్‌లో ఉండేవాణ్ణి. అక్కడికి దుక్కిపాటి, దాశరథిగార్లు వచ్చారు. ఒక చిన్న బల్లమీద కూర్చున్నారు. ఒక సినిమాకు కథ రాయమన్నారు. తాజ్‌మహల్‌ హోటల్‌ రూంనెంబర్‌ 18లో అప్పటి దాకా నేను రాసిన పుస్తకాలు దుక్కిపాటి మధుసూదనరావుగారి బెడ్‌ మీద ఉండడం చూశాను. ఆయనలో ఉన్న గొప్పదనం ఏమిటంటే - ఆంధ్ర నాటక కళా పరిషత్‌ నుంచి వచ్చినవారు కాబట్టి.. రచయితను కూర్చోబెట్టుకుని కొత్తదనాన్ని రాబట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. అలా వారి ప్రోత్సాహంతో రాసిన మొదటి సినిమా (కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం) ‘డాక్టర్‌ చక్రవర్తి’. ఆ సినిమా ఫెయిర్‌కాపీ రాసిన మహానుభావుడు ఒకరున్నారు. ఆయనే కె.విశ్వనాథ్‌. ఆ సినిమాకు ఆయన కో- డైరెక్టర్‌.


ఆర్కే : మీరు తొలి రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నారు?

గొల్లపూడి: అప్పట్లో రెమ్యునరేషన్‌ గురించిన ఆలోచనే లేదు. ఇప్పుడు రూపాయి విలువ మారిపోయింది. నా పెళ్లయ్యేనాటికి రేడియోలో నా జీతం వంద రూపాయలు. వంద అంటే ఆ రోజుల్లో ఒక తులం బంగారం. నేను చాలా బాగా రాశానని.. వెయ్యినూట పదహార్లు ఇచ్చారు దుక్కిపాటిగారు. అప్పట్లో దాని విలువ ఎక్కువ. ఇప్పటి ప్రేక్షకులకు ఆ డబ్బు విలువ తెలియాలంటే ఒకటి చెబుతాను. తొంభై అయిదు రూపాయలు పెడితే.. గ్యాస్‌ సిలిండర్‌, స్టవ్‌ వచ్చేవి.


ఆ తర్వాత - నేను ఒక కుర్రాడికి సినిమా కథ రాసిచ్చాను. అప్పుడే హైస్కూల్‌లో క్లాసుఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలా ఉండేవాడతను. ఆ కుర్రాడి పేరు కోడిరామకృష్ణ. ‘మారుతీరావుగారు మీరు వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తాను’ అన్నాడు నిర్మాత కె.రాఘవ. నేనప్పటికి రచయితను మాత్రమే. ఎంతోమంది నటులు ఉండగా నన్నే ఎందుకు నటించమంటున్నారు అని సరదాగా అడిగాను. లేదు.. లేదు.. మీరు వేషం వేయాల్సిందే అన్నారాయన. అలా మొదటివేషం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో వేశాను.


ఆ తర్వాత కూడా నటించారు....? ఇష్టం లేకుండానే నటించారా?

అప్పటికి నా వయసు 42 ఏళ్లు. నా పిల్లలకు అప్పుడొక మాట చెప్పాను ‘‘ఈ సినిమాకు సంబంధించిన ఒక మంచి ఫోటో తీసి జాగ్రత్తగా దాచిపెట్టండ్రా. ఈ దిక్కుమాలిన పని చేశానన్న జ్ఞాపకమైనా మిగులుతుంది.

 మళ్లీ నటించమని ఇంకెవ్వరూ పిలవరు. ఈ వయసులో నటనలోకి వెళ్లి ఏమి ఉద్ధరిస్తాను’ అని చెప్పాను. అయితే ఆ సినిమానే నాకు లైఫ్‌ ఇచ్చింది. ఒక రోజు మధ్యాహ్నం నేను నిద్రపోతుంటే.. చిరంజీవిగారు ఫోన్‌ చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా రిలీజ్‌ కాకముందే అందులోని ఒక సన్నివేశాన్ని క్రాంతికుమార్‌కు చూపించారాయన.


వెంటనే క్రాంతికుమార్‌ తీయబోయే సినిమాలో నన్ను బుక్‌ చేసుకుని అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఈ ఫేసును ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకున్నాను. కాని ఆ తర్వాత 30 ఏళ్లు ఏకధాటిగా నటించాను. అయితే నాలోని రచయితను నటుడు డామినేట్‌ చేయడం బాధ అనిపిస్తుంది. మొన్న ఒకసారి స్వీడన్‌కు వెళితే - అక్కడొకాయన ‘మీరు రచనలు కూడా చేశారా?’ అన్నాడు. అప్పుడప్పుడు మన వాళ్లు కూడా ఇలా అడుగుతుంటారు. అప్పుడు నవ్వొస్తుంది.


ఆర్కే : మీకు సాహిత్యం మీద జిజ్ఞాస ఎలా కలిగింది.. మీ కుటుంబ సభ్యుల వల్ల అలవడిందా?

గొల్లపూడి: నాటకాలు, సినిమాలు, కథలు రాసి చెడిపోతున్నానని.. మా అమ్మగారు అనేవారు. మా నాన్నగారైతే నాతో మాట్లాడేవారే కాదు. ఒక హోటల్‌లో ‘గొల్లపూడి మారుతీరావు నటించు..’ అని ఒక చిన్న పోస్టరు అతికించారు. దాన్ని చూసిన నాన్న- ‘బీఎస్సీ ఆనర్స్‌ చదువుకున్న నువ్వు కోమలవిలాస్‌లో పోస్టర్‌ పెట్టుకునే దౌర్భాగ్యపు దశకు వచ్చావు’ అనుకున్నాడట. ఇవాళ ఇన్నేసి థియేటర్లు, టీవీచానళ్లు... ఇంత ఎక్స్‌పోజర్‌ వస్తుందని ఆయన ఊహించలేదు. ఇవన్నీ డబ్బులు ఇవ్వగల ప్రొఫెషన్స్‌ అవుతాయన్న సంగతీ తెలియదు.


ఒక తల్లి తన కూతురును ప్రపంచం గర్వించదగ్గ టెన్నిస్‌ ప్లేయర్‌గా తయారుచేయాలని అలాంటి ప్లేయర్‌ పేరే పెట్టుకుంది. ఆ అమ్మాయి పేరు మార్టినా హింగిస్‌. పెట్టుకున్న పేరు మార్టినా నవ్రతిలోవా. మా అమ్మ , నాన్నలు నన్ను అలా ప్రోత్సహించలేదు. వాళ్లు ప్రోత్సహించి ఉంటే నేను ఇంకా ఎక్కడికో వెళ్లేవాడ్నేమో. కేవలం సర్వైవల్‌ కోసమే కష్టపడ్డాను.


ఆర్కే : మీరు నటుడు కావడం మీ అమ్మానాన్నకు నచ్చేది కాదా?

గొల్లపూడి: ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాను మా అమ్మకు నాన్నకు చూపించాలనుకున్నా. వాళ్లిద్దర్నీ థియేటర్‌కు తీసుకెళ్లాను. నాలుగైదు సీన్లు అయ్యాయి. మా అమ్మ ఏమీ రియాక్టు కావడం లేదు. ‘సినిమా చూస్తున్నావా అమ్మా. అందులో ఉన్నది నేనే’ అన్నాను. సినిమా అంతా పూర్తయ్యాక కారులో వెళుతున్నపుడు మరోసారి అడిగితే ‘ఏమోరా ఆ సినిమాలో నిన్ను అందరూ తిడుతున్నారు. ఇంకో వేషం ఉందే అది వేయాల్సింది’ అంది. ఇంకో వేషం అంటే చిరంజీవి వేషం (నవ్వులు). అమ్మ అనే పరిధి నుంచి ఆవిడ బయటికి వచ్చి నన్ను చూడలేకపోయింది. ‘అభిలాష’ కోసం శ్మశానంలో నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా ‘నువ్వు నటించడానికి వీల్లేదు’ అంది అమ్మ. ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు కూడా ‘అమ్మా నేను అక్కడ పెద్ద డ్యూటీ ఆఫీసర్‌ను..’ అంటే - ‘నువ్వు రేడియోలో ఏమైనా మాట్లాడతావా?’ అనేది. ‘నేను మాట్లాడేవాళ్లకు ఇంఛార్జిని’ అన్నాను. ‘ఎందుకు ఆ దిక్కుమాలిన ఉద్యోగం. కనీసం మాట్లాడితేనైనా రేడియోలో వినొచ్చు కదా!’ అనేది.


ఒక రోజు హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌కు వచ్చింది అమ్మ. అక్కడ స్థానం నరసింహారావుగారు కనిపించారు. ఆయనకు అమ్మను పరిచయం చేయగానే - ‘బాగా రాస్తాడమ్మా వీడు. మంచి కుర్రాడు’ అన్నారాయన. నరసింహారావుగారిని అమ్మ గుర్తుపట్టింది. ‘వీళ్లందరి దగ్గర పనిచేస్తున్నావా నువ్వు.. పోన్లే మంచి ఉద్యోగమే’ అంది. నేను పనిచేసే ఆలిండియా రేడియో కంటే వాళ్లు పనిచేస్తున్న ఆలిండియా రేడియోనే ఆవిడకు గొప్పగా అనిపించింది.

Advertisement
Advertisement
Advertisement