యథేచ్ఛగా రిగ్గింగ్‌

ABN , First Publish Date - 2021-04-09T08:45:10+05:30 IST

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందనలో వైసీపీ నాయకులు బరితెగించారు. అన్ని బ్యాలెట్‌ పత్రాలపై స్వస్తిక్‌ గుర్తువేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు...

యథేచ్ఛగా రిగ్గింగ్‌

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందనలో వైసీపీ నాయకులు బరితెగించారు. అన్ని బ్యాలెట్‌ పత్రాలపై స్వస్తిక్‌ గుర్తువేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 51వ నంబరు బూత్‌లో 835, 52వ బూత్‌లో 888 ఓట్లు రిగ్గింగ్‌ చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఫ్యాన్‌ గుర్తుపై స్వస్తిక్‌మార్క్‌ ముద్రించిన పేపర్లను వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. జడ్పీటీసీ స్థానానికి రీపోలింగ్‌ జరపాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పెరికపాడులో కూడా రిగ్గింగ్‌ చేశారని ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్‌లోని ఎన్‌.సురవరంలో వైసీపీ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.  ఇద్దరు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లపై చేయి చేసుకుని, పోలింగ్‌బూత్‌కు తాళాలు వేసి ఓట్లు గుద్దుకుంటే.. పోలీసులు బయట కాపలా కాశారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 


సోషల్‌ మీడియాలో బ్యాలెట్లు

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట-2 ఎంపీటీసీ స్థానానికి చెందిన బ్యాలెట్‌ పత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. వైసీపీకి ఓటు వేసిన వారు.. బ్యాలెట్‌ పత్రాలను ఫొటో తీసి పోస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పల్లంకుర్రు లక్ష్మీవాడ పోలింగ్‌బూత్‌లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి, సెల్ఫీ దిగి..సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై వెంకటరమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని ఓటును కలెక్టర్‌ రద్దు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ బ్యాలెట్‌ పత్రాల ఫొటోలు హల్‌చల్‌ చేశాయి. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో నజ్మా అనే వ్యక్తి వైసీపీకి ఓటేసి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. అదే గ్రూప్‌లో ఏడు బ్యాలెట్‌ పత్రాలు ఉన్నాయి. 

Updated Date - 2021-04-09T08:45:10+05:30 IST