Abn logo
Mar 19 2020 @ 03:13AM

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట

Kaakateeya

అడవులలో స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి మాంసాహార ప్రియులకు విందు భోజనంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలలో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అడవులకు సరిహద్దులలో గల గ్రామాలలోని వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని ఆటోలు, ఇతర మార్గాల ద్వారా నగరాలు, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడవులలోని వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టడం, కరెంటు తీగలు అమర్చడం, మందుగుండు సామాగ్రి ద్వారా వాటిని హతమారుస్తున్నారు. కొన్ని గ్రామాలలో ముఠాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసాన్ని కార్పొరేటు హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, నెమళ్లు, జింకలు వేటగాళ్ల వలలో పడి కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఈ చట్టాన్ని అమలు చేసి వన్య ప్రాణులను రక్షించాల్సిన అటవీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. అటవీ శాఖ సిబ్బందిలోని కొంతమంది వేటగాళ్లతో చేతులు కలిపి వన్యప్రాణుల వేటకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది తమ కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పోడు వ్యవసాయం మూలంగా అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేటగాళ్ల వల్ల అటవీ క్షీణత వల్ల వన్య ప్రాణులు కనుమరుగవుతున్నాయి. ఇలా రోజురోజుకూ వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుండడం కలవరానికి గురిచేస్తున్నది. వరంగల్‌ రూరల్‌లోని కొత్తగూడెం, పాకాల అడవులు, జయశంకర్‌ జిల్లాలోని మహదేవ్‌పూర్‌, పలిమెల, వాజేడు, మహాముత్తారం, కాటారం, గూడూరు, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల పరిధిలో ఈ వేట నిరాటంకంగా సాగుతున్నది. ప్రభుత్వం స్పందించి అటవీ అధికారులు, సిబ్బంది వేటగాళ్లను గుర్తించి శిక్షించేలా ఆదేశించాలి. వన్యప్రాణులను సంరక్షించకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అందుకని, ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఈ దిశగా కదలాలి. 

కామిడి సతీష్ రెడ్డి

Advertisement
Advertisement