పొడగించినా.. సడలించారు..

ABN , First Publish Date - 2020-05-07T10:01:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెల 29వరకు పొడగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల

పొడగించినా.. సడలించారు..

తెరుచుకున్న మద్యం షాపులు 

తొలిరోజు రూ. కోటి 80 లక్షల విలువ చేసే మద్యం విక్రయం 

రేపటి నుంచి మున్సిపాలిటీలలో సరి, బేసి పద్ధతిలో బీ కేటగిరి షాపులు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెల 29వరకు పొడగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల నిబంధనలను, వెసులుబాట్లను ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 45 రోజులుగా ఉన్న పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. జిల్లా ప్రస్తుతం ఆరెంజ్‌జోన్‌లో ఉన్నా రెండు, మూడు రోజుల్లోనే గ్రీన్‌జోన్‌లోకి వస్తుంది. జిల్లాలో ఏప్రిల్‌ 15న చివరి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. 21 రోజులుగా కొత్త కేసులు రాక పోవడంతో ఆరెంజ్‌ జోన్‌ను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది.  ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నా పలు వెసులుబాట్లు అమలులోకి రావడంతో ప్రజలు ఒకవైపు కరోనా భయం ఉన్నా బతుకుబండి లాగడం కోసం వీఽధుల్లోకి రావడం మొదలైంది.


ప్రభుత్వం సూచించిన మేరకు మాస్కులు ధరిస్తున్నా భౌతిక దూరం పాటించడం లేదు.  బుధవారం వివిధ దుకాణాలను తెరవడం ప్రారంభించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి గుమిగూడే ప్రమాదముందని భావించిన ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్ని నిబంధనలను విధించింది. ఆ మేరకు జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌, కొత్తపల్లి, హుజురాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో సరి, బేసి పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. 


తెరచుకున్న మద్యం షాపులు 

జిల్లాలో 45 రోజుల అనంతరం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 87 మద్యం షాపులను తెరచి అమ్మకాలు ప్రారంభించారు. కొన్ని మద్యం షాపుల ముందు యజమానులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరికొందరు సర్కిళ్లు వేసి భౌతిక దూరం పాటించేలా చూసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించి వచ్చిన వారికి మాత్రమే మద్యం విక్రయించారు. తొలిరోజు కోటి 80 లక్షల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. ఉదయం మద్యం దుకాణాల వద్ద కొంత రద్దీ కనిపించినా మధ్యాహ్నం నుంచి సందడి తగ్గింది. ఉదయం 7 గంటల నుంచే కరీంనగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కే చంద్రశేఖర్‌, ఏఈఎస్‌ పి తాతాజీ కరీంనగర్‌లోని వైన్‌షాపులున్న ప్రాంతాల్లో తిరుగుతూ మద్యం షాపులు తెరిచిన సమయంలో కొనుగోలుకు వచ్చే ప్రజలు భౌతికదూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టారు.


వైన్‌షాపుల నిర్వాహకులకు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, మాస్క్‌లు ధరించినవారికే మద్యం విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం 16 శాతం పెంచిన ధరల ప్రకారం కొత్త మద్యం ధరల పట్టికను అన్ని వైన్‌షాపులకు అందజేశారు. ఉదయం 10:30కు వైన్‌షాపులను తెరచి మద్యం అమ్మకాలను ప్రారంభించారు. కొన్ని షాపులు మాత్రం 12 గంటలకు తెరిచారు. ఉదయం 9 గంటల నుంచే పలు వైన్‌షాపుల వద్ద బారులుతీరారు. సాయంత్రం 6 గంటలకు అన్ని వైన్‌షాపులు మూసివేశారు. ప్రతి వైన్‌షాపు వద్ద ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌తో పాటు సివిల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుళ్లతో బందోబస్తుు ఏర్పాటు చేశారు.  ఐఎంఎల్‌ డిపో ను బుధవారం తెరిచి  ఉమ్మడి జిల్లాలోని దుకాణాలకు మద్యం సరఫరా చేశారు. 


కొనసాగుతున్న కర్ఫ్యూ: 

లాక్‌డౌన్‌ను ఈనెల 29వ తేదీ వరకు పొడగించడంతోపాటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. సాయంత్రం 6.00 గంటల వరకు మద్యం దుకాణాలతోపాటు అన్ని వ్యాపార సంస్థలను మూసి వేశారు. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలుచేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  


వెంటాడుతున్న కరోనా భయం

ఒకవైపు నిబంధనలు సడలించడం, మరోవైపు కరోనా పాజిటివ్‌ వచ్చిన జగిత్యాల జిల్లాకు చెదిన వ్యక్తి కరీంనగర్‌లోని డయాగ్నస్టిక్‌ సెంటర్‌, ఆస్పత్రికి వచ్చాడు. అతని ద్వారా కొందరికి కరోనా సోకే ప్రమాదం లేక పోలేదని ఆందోళన వ్యక్తమవుతున్నది. అతనికి ట్రీట్‌ మెంట్‌ ఇచ్చిన డాక్టర్లు, నర్సులు, వార్డుబాయ్‌లు, అతనితో ప్రాథమికంగా కాంటాక్టు అయిన వ్యక్తులు 48 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరిని ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కొందరికి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


Updated Date - 2020-05-07T10:01:41+05:30 IST