తలపుల ద్వారాలు తెరుస్తున్నాడు!

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

తమిళనాడులోని కుంభకోణం... వారసత్వ సంపదకు నెలవైన పట్టణం. సంతానకృష్ణన్‌దీ అదే ప్రాంతం.

తలపుల ద్వారాలు తెరుస్తున్నాడు!

చిన్నప్పుడు పల్లెటూళ్లలో ద్వారాలు గుర్తున్నాయా..! విభిన్న రంగులు అద్దుకుని... చూడముచ్చటగా కనిపించేవి. నేటికీ మదిలో పదిలంగా ఉన్న ఆ తలుపులనే ‘లైఫ్‌సైజు’ చిత్రాలుగా మలుస్తున్నాడు యువ కళాకారుడు కేఆర్‌ సంతానకృష్ణన్‌. మళ్లీ మనల్ని ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతున్నాడు... 


తమిళనాడులోని కుంభకోణం... వారసత్వ సంపదకు నెలవైన పట్టణం. సంతానకృష్ణన్‌దీ అదే ప్రాంతం. ప్రభుత్వ కళాశాలలో చదివే రోజుల్లో అక్కడి వీధుల్లో నుంచి వెళుతుండేవాడు. ఇళ్ల గుమ్మాలు, తలుపులు రంగు రంగుల్లో... కళ్లకు ఇంపుగా... ఎంతో కళగా కనిపించేవి. అవి అతడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 


‘‘రోజూ కాలేజీకి వెళ్లేటప్పుడు ఆ వర్ణశోభిత ముఖద్వారాలు చూసేవాడిని. విచిత్రమేమంటే... ఒక తలుపు తెరచి, మరొకటి మూసి ఉండేది. తెరచిన తలుపులో నుంచి చూస్తే ఇంటి లోపల కొంత భాగం కనిపిస్తుంటుంది. ఎందుకో ఆ దృశ్యాలు నాకు అద్భుతంగా, ప్రత్యేకంగా అనిపించాయి. అలానే మదిలో నాటుకుపోయాయి’’ అంటాడు కృష్ణన్‌. 




ప్రయోగానికి శ్రీకారం... 

డిగ్రీ అయిపోయింది. చెన్నైలో మాస్టర్స్‌ చేయడానికి వెళ్లేముందు ప్రయోగాత్మకంగా తలుపుల పెయింటింగ్స్‌ గీయాలనుకున్నాడు కృష్ణన్‌. కుంభకోణంలో అతడు చూసిన చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు మినియేచర్లుగా మలిచాడు. అక్రాలిక్‌ పెయింటింగ్స్‌తో తుదిరూపు ఇచ్చాడు.


‘‘గొప్ప కళాకారుల్లా ఈ రంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నా. దానికి థీమ్‌ ఏమిటని ఆలోచిస్తుండగా ఆ తలుపులు గుర్తుకువచ్చాయి. ఇక ఆలస్యం చేయలేదు’’ అంటున్న కృష్ణన్‌... కొన్నేళ్లకు అందులో నిష్ణాతుడయ్యాడు. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తను మలిచిన ద్వారాలతో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ముఖద్వారాలకు ముఖచిత్రమయ్యాడు. 



అందుకే అంతటి ఆదరణ... 

ఎక్కడకు వెళ్లినా... సంతానకృష్ణన్‌ కళాచిత్రాలకు విపరీతమైన ఆదరణ. ఎవరు చూసినా ఫిదా కావల్సిందే. అంతలా ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాడు అతడు. దానికి కారణం ఏమిటని కృష్ణన్‌ను అడిగితే... ‘‘ఈ తలుపులు చూసిన ప్రతిఒక్కరూ నాతో చెప్పే మొదటి మాట... బాల్యంలో తమ ఇల్లు గుర్తుకు వచ్చిందని..! అలా నాటి జ్ఞాపకాలు ఒక్కసారి వారి కళ్ల ముందు తిరుగుతున్నాయి. తద్వారా తమ మూలాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ... మధురానుభూతి పొందుతున్నారు. బహుశా అందుకే నా చిత్రాలు అంతగా క్లిక్‌ అవుతున్నాయోమో’’ అంటాడు. 




ఒక్కోదానికీ ఒక్కో కథ... 

సంతానకృష్ణన్‌ ఇంట్లో ఇప్పుడు ఎనభైకి పైగా ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో లైఫ్‌సైజ్‌వి ప్రత్యేక ఆకర్షణ. ఒక్కో ద్వారం ఒక్కో కథ చెబుతుంది. వీటిల్లో నాటి, నేటి తలుపులు ఆకట్టుకొంటాయి. దీని కోసం అతడు దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగాడు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో ఇళ్ల ద్వారాలు పరిశీలించి వాటిని చిత్రాలుగా మలిచాడు. ‘‘దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 22 ముఖద్వారాల పెయింటింగ్స్‌ వేశాను. పశ్చిమబెంగాల్‌లో తలుపులు పెద్దవిగా ఉంటాయి.


అదే రాజస్తాన్‌కు వెళితే ఇరువైపులా ఏనుగుల కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. మధుబని ఆర్ట్‌తో కూడా కొన్ని చిత్రాలు గీశాను. ‘డోర్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఒక పెయింటింగ్స్‌ సిరీస్‌ చేశాను’’ అని తన జర్నీ చెప్పుకొచ్చిన కృష్ణన్‌ ప్రస్తుతం తన సొంత పట్టణమైన కుంభకోణంలో ఓ స్టూడియో ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాడు. 



సహజంగా కనిపించాలని... 

ఒక్కసారి కృష్ణన్‌ ఇంటికి వెళితే... అక్కడ అతడి పెయింటింగ్స్‌ బారులు తీరి ఉంటాయి. చూస్తే నిలువెత్తున నిజమైన ద్వారాలను తలపిస్తాయి. 


‘‘కాన్వాస్‌పై అక్రాలిక్‌ పెయింట్స్‌తో పాటు... సహజత్వం కోసం కొంత కలపను కూడా ఉపయోగిస్తాను. తెరిచిన తలుపులో నుంచి ఇంటి లోపల చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇవేకాకుండా ప్రస్తుతం వాడుతున్న ఆధునిక ద్వారాల చిత్రాలూ వేస్తున్నాను. కొన్ని లైఫ్‌సైజ్‌ దర్వాజాలున్నాయి. అయితే వాటిని తీసుకువెళ్లి ఇంటికి పెడతానంటే కుదరదనుకోండి’’ అని నవ్వుతూ చెబుతాడు ఈ యువ కళాకారుడు. 


అతడు వేసిన పెయింటింగ్స్‌లో ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌, అమితాబ్‌బచ్చన్‌, కరణ్‌జోహార్‌, సచిన్‌ టెండుల్కర్‌ తదితర సెలబ్రిటీల ద్వారాలు కూడా ఉన్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌, చెన్నైలోని రెయిన్‌ట్రీ హోటల్స్‌కు వెళితే కృష్ణన్‌ కళకు అద్దంపట్టే ‘తలుపులు’ ఆహ్వానం పలుకుతాయి. 


దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 22 ముఖద్వారాల పెయింటింగ్స్‌ వేశాను. పశ్చిమబెంగాల్‌లో తలుపులు పెద్దవిగా ఉంటాయి. అదే రాజస్తాన్‌కు వెళితే ఇరువైపులా ఏనుగుల కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. మధుబని ఆర్ట్‌తో కూడా కొన్ని చిత్రాలు గీశాను.

Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST