Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపరేషన్‌ విపక్ష

ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్‌ఎస్‌ వ్యూహం

విపక్ష ఓటర్లతో బేరాలు 

స్వతంత్రుల్లో కుదరని ఏకాభిప్రాయం

నల్లగొండ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరో ఆరు రోజుల్లో ఉండటంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటికే నియోజకవర్గాల సమావేశాలు తుది దశకు చేరగా, మరోవైపు విహార యాత్ర, ఎన్నికల క్యాంపు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపునకు అవసరమైన ఓట్లు ఉన్నా, సొంత పార్టీ ఓటర్లలో అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్‌ కీలక నేతలు ప్రతిపక్ష ఓటర్లకు గాలంవేయడం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 19 మంది ఎక్స్‌ అఫీషియోతో కలిపి 1259 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో వివిధ కారణాలతో 7 స్థానాలు ఖాళీ కాగా, మొత్తం 1271 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో ఎక్స్‌ అఫీషియోలను మినహాయించి టీఆర్‌ఎ్‌సకు 791, కాంగ్రెస్‌ 396, బీజేపీ 37, సీపీఎం 17, సీపీఐ 5, ఇతరులు 13 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం టీఆర్‌ఎ్‌సకే ఆధిక్యం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన నాటికి సుమారు 200 మందికిపైగానే ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు. అంటే సుమారు 1000 ఓట్ల వరకు టీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నట్టే. అయినా అసంతృప్తితో తమ ఓటర్లు జారిపోకుండా కనీసం ఏ అభ్యర్థికీ టచ్‌లోకి వెళ్లకుండా నిలువరించేందుకు అధికారపార్టీ పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

విపక్ష ఓటర్లకు గాలం

విపక్షాల్లోని, ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓటర్లతో సంబంధాలున్న నాయకులను గుర్తించి అధికారపార్టీ ఆపరేషన్‌ మొదలుపెట్టింది. విపక్ష ఓటర్లకు ఆఫర్లు ప్రకటించడం ప్రారంభించారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని, అంతా స్వతంత్రులే కావడంతో పార్టీ గుర్తులు లేవవని, అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అందుకు ప్రతిఫలం అందించే బాధ్యత తనదేనంటూ కొందరు విపక్ష ఓటర్లే రంగంలోకి దిగడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కీలక నేత తనకు బాధ్యత అప్పగించారని, అనుకున్న మొత్తం అందించే పూచీ తనదేనంటూ, ముందుగా రెండు ఖరీదైన మద్యం సీసాలు పంపుతానని, ఓకే అంటే మిగతా విషయాలు మాట్లాడుదామని కాంగ్రె్‌సకు చెందిన ఓటర్లే రెండు రోజులుగా మిగిలినవారితో రాయబేరాలు నడిపినట్టు వినికిడి. ఇదిలా ఉండగా, ఓటుకు కనీసంగా రూ.3లక్షలు ఇస్తేనేసరి, లేదంటే తమ ఉనికి చాటాలని అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీటీసీలు అసంతృప్తితో రగులుతున్నారు. ప్రస్తుతానికి కనీసంగా రూ.1లక్ష ఇస్తామనే భరోసా ఉంది. అయితే దీన్ని పెంచుకోవాలని అధికార పార్టీ ఓటర్లు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ చోటుచేసుకుంటే ప్రమాదమని, దీని నుంచి బయటపడేందుకు ప్రతిపక్షాల ఓటర్లను తమవైపు మళ్లించుకోవడమే మార్గమని భావించి అధికార పార్టీ పెద్దలు ఆపరేషన్‌ అపోజిషన్‌కు శ్రీకారం చుట్టారు. 

స్వతంత్రుల మధ్య కుదరని ఏకాభిప్రాయం

అధికారికంగా పోటీలో లేని కాంగ్రెస్‌, స్వతంత్రులను తెరవెనుక బలపరిచే విషయంలోనూ కలిసిరాని పరిస్థితి. నేటికీ బరిలో తామంటే తాము ఉన్నామంటూ స్వతంత్రులు ప్రకటిస్తున్నారు. స్వతంత్రుల్లో జడ్పీటీసీ ఫోరం నుంచి బరిలో ఉన్న ఆలేరు జడ్పీటీసీ కుడుదుల నగేష్‌ ప్రచారంలో ముందున్నారు. ఆయన ఇప్పటికే ఉమ్మడి జిల్లా అంతటా పర్యటించి విపక్ష ఓటర్లను కలవడంతో పాటు అధికార పార్టీకి చెందని ఓటర్లను ఫోన్ల ద్వారా పలకరిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ దిగ్గజాలు ఈ ఎన్నికను చూసీచూడనట్లు వ్యవహరిస్తుండగా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తన అనుచరుడు లక్ష్మయ్యను బరిలో దించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ వెంకట్‌రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో ఉన్న నేపథ్యంలో పోటీలో చివరకు ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఎంపీ వెంకట్‌రెడ్డితో స్వతంత్ర ఎంపీటీసీలు, ఆయన అనుచరుడు లక్ష్మయ్య హైదరాబాద్‌లో శనివారం భేటీ అయి ఎన్నికలో పాటించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  స్వతంత్రులంతా కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసుకోవాలని ఇప్పటికే రెండుసార్లు సమావేశమైనా ఫలితం లేదు.

ఆదరణ కోల్పోయిన ప్రతిపక్షాలు : మంత్రి జగదీష్‌రెడ్డి

యాదాద్రి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి)/ నకిరేకల్‌, కోదాడటౌన్‌: ప్రతిపక్షాలు ప్రజల ఆదరణను కోల్పోయారని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. భువనగిరి, నకిరేకల్‌, కోదాడలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పచ్చగా ఉన్న తెలంగాణను చూసి బీజేపీ ఓర్వలేక కుయుక్తులు పన్నుతోందని, అన్నదాతలతో రాజకీయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో సంక్షోభానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి గెలుస్తారని అన్నారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, మల్లయ్యయాదవ్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేష్‌

నల్లగొండ, మోత్కూరు, డిసెంబరు 3: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీఆర్‌ఎ్‌సను వెంటాడుతోందని, అందుకే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేష్‌ అన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లా మోత్కూరు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సకు గెలుస్తామనే నమ్మకం ఉంటే క్యాంపు రాజకీయాలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. నిధులు, విధులు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయన్నారు. సమావేశాల్లో పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement