విద్యా రంగంలో మార్పులతో అవకాశాలు

ABN , First Publish Date - 2020-05-28T10:15:40+05:30 IST

విద్యా రంగంలో మార్పులతోనే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్

విద్యా రంగంలో మార్పులతో అవకాశాలు

  • ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
  • కాన్ఫరెన్స్‌కు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు 

 కాకినాడ, మే 27(ఆంధ్రజ్యోతి): విద్యా రంగంలో మార్పులతోనే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ఏడాది పాలనపై అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు.కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విద్యా శాఖ సమీక్షలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో పాటు విద్యావేత్తలతో మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బోస్‌ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీతత్వం పెరిగిందన్నారు.  కొవిడ్‌ 19 వల్ల విద్యార్థులకు వృధా అయిన సమయాన్ని భర్తీ చేయడానికి ఉపాధ్యాయ వర్గాలు సూచనలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు అన్ని విధాల సంపూర్ణ సహాయం అందించాలన్నారు. ఆధార్‌ కార్డులో అభ్యంతరాలున్నాయనే సాకుతో అమ్మఒడి అందడం లేదని, వాటిని సరి చేయాలని కోరారు. నాడు-నేడు ద్వారా చేపట్టే పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. కచ్చులూరు బోట్‌ ప్రమాదంలో ఎవరిని సంప్రదించాలనే వ్యవస్థ లేదని, అటువంటి వ్యవస్థ ఏర్పాటుకు మేధావులు, నిపుణులు తగు సలహాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జేఎన్‌టీయూకే వీసీ రామలింగరాజు, పూర్వ వీసీ అల్లం అప్పారావు, జేసీ కీర్తి, ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌, డీఈవో ఎస్‌.అబ్రహాం, ఎస్‌ఎస్‌ఎస్‌ ఏపీసీ విజయభాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T10:15:40+05:30 IST