Abn logo
Jun 12 2021 @ 00:26AM

జాదవ్‌కు అవకాశం

గూఢచారి, ఉగ్రవాది అంటూ పాకిస్థాన్‌ ఉరిశిక్ష విధించిన భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు హైకోర్టులో అప్పీలు చేసుకొనే అవకాశం దక్కడం మంచి పరిణామం. పాకిస్థాన్‌ పార్లమెంటు దిగువసభ గురువారం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. తనకు సైనిక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను రద్దుచేయమని జాదవ్‌ ఇకపై అక్కడి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించగలుగుతాడు, న్యాయ సహకారాన్నీ పొందుతాడు. రెండేళ్ళక్రితం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాల మేరకు పాక్‌ పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ఆమోదంతో పాకిస్థాన్‌ ఎంతో బాధ్యతాయుతమైన దేశమని ప్రపంచానికి తెలిసిందని ఆ దేశ న్యాయమంత్రి వ్యాఖ్యానించారు. గత ఏడాది ఓ ఆర్డినెన్సు తెచ్చి, ఇప్పుడు ఇలా బిల్లు చేయపోయివుంటే కోర్టు ధిక్కరణ పేరిట భారతదేశం ఐసీజే మెట్లెక్కేదనీ, భద్రతామండలిని ఆశ్రయించేదని ఆయన అన్నారు.


ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం భారత్‌ ఒత్తిళ్ళకు లొంగిపోయిందంటూ విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సందర్భంలో మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ పరువుతీసే ఉద్దేశంతో భారతదేశం నిజానికి ఈ బిల్లు రాకూడదని కోరుకుంటోందనీ, పాక్‌ విపక్షాలు భారత్‌ మనోభిప్రాయానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాయని విదేశాంగమంత్రి మహమూద్‌ ఖురేషీ మండిపడ్డారు. ఈ మాటల గారడీలు అటుంచితే, కుల్‌భూషణ్‌ విషయంలో ఐసీజే ఆదేశాలతో ఆటలాడే దుస్సాహసానికి పాల్పడకుండా పాకిస్థాన్‌ మంచిపని చేసింది.


భారతదేశం బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తూనే, కుల్‌భూషణ్‌కు భారత న్యాయవాదిని సమకూర్చాలనీ, లేదా ఏదైనా తటస్థదేశం నుంచి న్యాయసహకారం లభించేట్టు చూడాలని కోరింది. ఇవేమీ జరగనిపక్షంలో బిల్లు ఆమోదంవల్ల బాధితుడికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదన్నది. పాకిస్థాన్‌ ఇందుకు అంగీకరించే అవకాశాలు ఎలాగూ తక్కువే. గూఢచర్యానికి సంబంధించిన కేసులో మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్ష మీద ఉన్నత న్యాయస్థానాల్లో పునఃపరిశీలనలూ, విచారణలూ, సమీక్షలూ జరిగినట్టు ఐసీజేకు చూపడం, దాని ఆదేశాలకు కట్టుబడివున్నట్టుగా కనిపించడం పాక్‌కు ముఖ్యం. ఉరిని నిలిపివేసి, వియన్నా ఒప్పందం మేరకు దౌత్య అధికారులతో భేటీకి ఏర్పాట్లు చేయమని 2019జులై 17న ఐసీజే తీర్పు చెప్పిన నెలన్నరకు కానీ కుల్‌భూషణ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్‌ కలుసుకోలేకపోయారు. తనదేశ దౌత్యాధికారి సమక్షంలో కూడా జాదవ్‌ ధైర్యంగా నోరువిప్పలేక, తాను తప్పుచేశానంటూ పాకిస్థాన్‌ అధికారులు గతంలో తనతో బలవంతంగా చెప్పించిన మాటలే వల్లించాడు. జాదవ్‌ ఎంతటి భయానకమైన ఒత్తిడిలో ఉన్నాడో అప్పుడే అర్థమైంది. అన్ని కష్టాలూ నిర్భయంగా చెప్పుకోవాల్సిన జాదవ్‌ పాక్‌ అధికారుల సమక్షంలో మనసు తెరవలేకపోయాడు. ఉగ్రవాదానికి సంబంధించిన మరో కేసు ఇంకా మిగిలేవున్నందున, పాక్‌ నిర్బంధంలో మరిన్నేళ్ళు గడపాల్సిన స్థితిలో ఆత్మరక్షణార్థం ఆయన అలా మాట్లాడాడు. 


ఇప్పుడు బిల్లు ఆమోదంతో హైకోర్టులో అప్పీలుచేసుకొనే అవకాశం జాదవ్‌కు వచ్చినప్పటికీ, పాకిస్థాన్‌ న్యాయవ్యవస్థ అతడికి న్యాయం చేకూరుస్తుందని నమ్మలేం. జాదవ్‌ తరఫున వాదించడానికి భారతదేశ న్యాయవాదిని అనుమతించాలన్న డిమాండ్‌కు ఒకవేళ పాకిస్థాన్‌ తలూపినా, బాధితుడికి న్యాయం జరగదని కొందరు న్యాయనిపుణుల అనుమానం. శ్రీలంక, సింగపూర్‌ వంటి చక్కని న్యాయవ్యవస్థ ఉన్న ఏదో ఒక తటస్థదేశంలో అప్పీలు ప్రక్రియ కొనసాగితే ఉత్తమమనీ, భారతదేశం తదనుగుణంగా ఐసీజేకు విజ్ఞప్తిచేయాలని వారు అంటున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో చక్కని పోరాటంతో పాకిస్థాన్‌ను భారతదేశం బాగానే లొంగదీసింది. భారత దౌత్యప్రతినిధితో భేటీ, ఉరిపై అప్పీలు అవకాశం, న్యాయవాది సహాయం వంటివి జాదవ్‌కు దక్కుతున్నా, ఐసీజే ఆదేశాల స్ఫూర్తికి అనుగుణంగా అవి అమలుకావడం ప్రధానం. భారత్‌ అందుకోసం పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడితెచ్చి, ఆక్షేపణలూ అభ్యంతరాలను రేపు ఐసీజేలో తెలియపరచడం వల్ల కచ్చితంగా సానుకూల ప్రభావం ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement