వాణీదేవికి అవకాశం... పీవీకి గౌరవం

ABN , First Publish Date - 2021-02-24T06:02:15+05:30 IST

తెలంగాణ ఎన్నో విషయాల్లో భిన్నంగా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో దేశానికి మార్గదర్శిగా ఉంటోంది. సామాజిక, రాజకీయ అంశాల్లో...

వాణీదేవికి అవకాశం... పీవీకి గౌరవం

తెలంగాణ ఎన్నో విషయాల్లో భిన్నంగా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో దేశానికి మార్గదర్శిగా ఉంటోంది. సామాజిక, రాజకీయ అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మన ప్రత్యేకతలు, గొప్పదనాలు మరుగునపడిపోయాయి. ఎందరో దార్శనికుల గొప్పదనం ఎవరికీ తెలియకుండా పోయింది. అలాంటి గొప్ప నేతలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తింపు ఇస్తోంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పరిపాలనాదక్షుడు పీవీ నరసింహారావు విషయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఇలాగే జరిగింది. భారతదేశం ఇప్పుడున్న స్థితికి కారణం పీవీ నరసింహారావే. ఆయన మొదలుపెట్టిన సంస్కరణలు, విధానాలతోనే మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తోంది. అంతటి గొప్ప నేత పీవీ కీర్తిని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏడాదిపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పీవీ గొప్పదనం, దార్శనికత, పరిపాలనాదక్షత గురించి తెలంగాణ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తోంది. దేశం గర్వించదగ్గ మేధావి, పరిపాలనాదక్షుడు పీవీ తెలంగాణ బిడ్డ కావడం మనకు గొప్ప గుర్తింపు. సంస్కరణలతో ఆధునిక భారత నిర్మాతగా పేరొందిన పీవీ ప్రభను విశ్వవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనికోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలాగే పీవీ స్వగ్రామం వంగరలో, వరంగల్‌, హైదరాబాద్‌లలో పీవీ స్మారకాలను నిర్మిస్తోంది. వీటితో పాటు పీవీ కుటుంబానికి గుర్తింపు తెచ్చే ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తె వాణీదేవికి హైదరాబాద్‌-–రంగారెడ్డి-–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ప్రధాన రాజకీయపార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం అరుదైన విషయం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపిక హర్షణీయం. రాజకీయ నిర్ణయమే అయినా ఇది పీవీ నరసింహారావు పట్ల, వారి కుటుంబం పట్ల కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. పీవీ కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు ఎమ్మెల్సీ పెద్ద పదవి ఏమీ కాదు. పీవీ భారతదేశానికి చేసిన సేవకు కృతజ్ఞతగా దీన్ని భావించాలి. తెలంగాణ భూమిప్రుతుడు పీవీని మనందరం స్మరించుకుని, గౌరవించుకోవడానికి ఇది సరైన తరుణం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను, భూమిపుత్రులను గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. రాజకీయంగా పదవులను ఇచ్చే విషయంలోనూ ఇది ఎప్పుడూ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న ఈ పరంపరలో భాగంగానే కేసీఆర్‌ ప్రభుత్వం ఇటీవలే ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నను శాసనమండలి సభ్యుడిగా నియమించింది. పీవీ కుమార్తె వాణీదేవి ఏ రోజు ఆ దర్పాన్ని ప్రదర్శించలేదు. క్రమశిక్షణతో ఎదిగిన వ్యక్తి ఆమె. తండ్రి దేశంలోనే అత్యున్నత పదవిని అధిష్టించినా ఏ రోజూ రాజకీయ అవకాశాల కోసం ప్రయత్నించలేదు. స్వతహాగా కళాకారిణి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వాణీదేవి మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ. విశాల భావాలు కలిగిన విద్యావేత్త. సైన్స్‌, ఆర్ట్స్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీలతో పాటు స్కూలు, కాలేజీలను ఏర్పాటుచేసి విద్యారంగంలో అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ప్రతిష్ఠాత్మక జెఎన్‌టియులో లెక్చరర్‌గా బోధనలు చేశారు. ప్రతిభతో ఎన్నో పురస్కారాలను పొందారు. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపికపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 

దేశానికి ఎంతో చేసిన పీవీని, ఆయన కుటుంబాన్ని రాజకీయ కారణాలతో అవమానాలకు గురిచేసిన సందర్భాలను మనం మర్చిపోలేం. వాణీదేవికి ఇచ్చిన ఈ అవకాశం అలాంటి వాటికి ముగింపు పలుకుతూ, పీవీ గొప్పతనాన్ని ఇప్పటి తరానికి తెలిపేలా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవిని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. వాణీదేవికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం ఇవ్వడాన్ని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలి. ఆమెను ఎమ్మెల్సీగా ఎన్నుకుని తెలంగాణ సమాజం తమ గొప్పదనాన్ని చాటాలి. తెలంగాణ పట్టభద్రులు, మేధావులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిగిలిన అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకునేలా చూడాలి. అయినా రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇతర పార్టీలు పోటీలో ఉంటే వాణీదేవి ఘనవిజయం సాధించేందుకు అందరం సహకరించాలి. ఆర్థిక సంస్కరణలతో మన దేశం అభ్యున్నతికి కృషి చేసిన పీవీకి ఇదే మనం ఇచ్చే శతజయంతి ఉత్సవ కానుక అవుతుంది.

వద్దిరాజు వెంకటేశ్వర్‌రావు

సీనియర్‌ న్యాయవాది

Updated Date - 2021-02-24T06:02:15+05:30 IST