ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-25T08:18:25+05:30 IST

స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ వరంగల్‌ మినహా ఇతర స్థానాల్లో ముగిసింది.

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

  • స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ
  • వరంగల్‌ మినహా మిగిలిన స్థానాలక పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
  • నేడు, రేపు ఉపసంహరణలకు అవకాశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ వరంగల్‌ మినహా ఇతర స్థానాల్లో ముగిసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా దాఖలైన ఏకైన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. బుధవారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిర్కరించారు. దీంతో పోటీలో కవిత ఒక్కరే మిగిలి ఉండడంతో.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. ఈ నెల 26న ఆమె ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, జిల్లా ఎన్నికల పరిశీలకులు అనితరాజేంద్రన్‌ సమక్షంలో బుధవారం నామినేషన్ల పరిశీలన జరిపిన అధికారులు.. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ అఫిడవిట్‌ను సక్రమంగా సమర్పించలేదని, కొన్ని వివరాలను సరిగా పొందుపరచలేదని తేల్చారు. అంతకుముందు.. శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ముగ్గురు ఓటర్లు ఆయన తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఫోర్జరీ చేయలేదని, వారు వివరాలు, ఫొటోలు ఇచ్చిన తర్వాతే నామినేషన్‌ వేశానని శ్రీనివాస్‌ చెప్పారు. కాగా, అఫిడవిట్‌లో వివరాలు సక్రమంగా లేకపోవడం వల్లే శ్రీనివాస్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.  ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం కావడంతో.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. నగరంలోని కవిత ఇంటి వద్ద సంబరాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ కూడా..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి (శంభీపూర్‌) రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను వీరిద్దరితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా చలికా చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేశారు. కాగా, చంద్రశేఖర్‌ గడువు ముగిశాక నామినేషన్‌ వేసినట్లు స్ర్కూటినీలో నిర్ధారించారు. ప్రతిపాదకుల సంతకాలు లేనందున, సెక్యూరిటీ డిపాజిట్‌ సమర్పించకపోవడంతో తిరస్కరించారు.  


ఖమ్మంలో అన్ని నామినేషన్లకూ ఆమోదం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నలుగురు అభ్యర్థుల నామినేషన్లకూ అధికారులు ఆమోదం తెలిపారు. వీరిలో టీఆర్‌ఎస్‌ తరఫున తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ నుంచి రాయల నాగేశ్వరరావు ఉండగా, కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ నేతలు సీపీఐ మద్దతు కోరారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అభ్యర్థి మధుసూదన్‌ బుధవారం సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ను కలిశారు. దీనిపై రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం చెబుతామని సీపీఐ నేతలు తెలిపారు. కాగా, వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా.. 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నలుగురి నామినేషన్లు ఆమోదం పొందగా, మరొకరి పత్రాల పరిశీలనను గురువారానికి వాయిదా వేశారు. నల్లగొండ స్థానానికి దాఖలైన 11 నామినేషన్లలో 8 ఆమోదం పొందాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను 10 మంది నామినేషన్లు వేయగా.. ఆరింటిని అధికారులు తిరస్కరించారు. ఒక అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. 


సీఈవోకు శైలజారెడ్డి ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన నామినేషన్‌ పత్రాలను టీఆర్‌ఎస్‌ నేతలు చింపివేసి రౌడీలతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు అనుచరులు తనను నామినేషన్‌ వేయనివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు. లేదంటే హైకోర్టుకు వెళతామన్నారు. దీనిపై స్పందించిన శశాంక్‌ గోయల్‌ వెంటనే కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి.. నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-11-25T08:18:25+05:30 IST