కర్నాటకలో దుమ్ము దుమారం రేపుతున్న ‘యాడ్స్’

ABN , First Publish Date - 2021-04-23T00:02:59+05:30 IST

కరోనా సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోయిన సందర్భంలో యడియూరప్ప సర్కార్ ఇచ్చిన యాడ్స్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి

కర్నాటకలో దుమ్ము దుమారం రేపుతున్న ‘యాడ్స్’

బెంగళూరు : కరోనా సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోయిన సందర్భంలో యడియూరప్ప సర్కార్ ఇచ్చిన యాడ్స్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బెంగళూరు మెట్రోకు ప్రధాని మోదీ బడ్జెట్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా యడియూరప్ప సర్కార్ పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తోంది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో ఇంత పెద్ద ఎత్తున యాడ్స్ ఏంటని కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. కోవిడ్ యోధులను సత్కరించడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటోందని, కానీ ప్రకటనలకు మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. నిధుల కొరత ఉందని, అందుకే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేకపోతున్నామని యడియూరప్ప సర్కార్ ప్రకటించిందని, ఇప్పుడు ప్రకటనల కోసం ఎందుకు దుబారా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. 


మండిపడ్డ కుమార స్వామి

ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ఈ రోజు దినపత్రికలను చూశా. చాలా బాధపడ్డాను. బెంగళూరు మెట్రో బడ్జెట్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ ఇచ్చింది. కేంద్రం ఏమీ భిక్షగా వేయలేదు. మేము మరణం అంచుల్లో ఉన్నాం. ప్రభుత్వం మాత్రం పత్రికల్లో ప్రకటనలకు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రజలతో చెలగాటమాడుతోంది.’’ అంటూ కుమార స్వామి వీడియో రిలీజ్ చేశారు. 

Updated Date - 2021-04-23T00:02:59+05:30 IST