నేటి నుంచి ఆప్షన్లు

ABN , First Publish Date - 2021-12-08T15:20:06+05:30 IST

ఉద్యోగుల విభజనపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నీ సర్దుకుంటే ఈ నెలాఖారుకల్లా విభజనను పూర్తి చేయనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం..

నేటి నుంచి ఆప్షన్లు

ఉద్యోగ విభజనపై వడివడిగా అడుగులు..

తొలుత ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో అమలు

జిల్లా ఉద్యోగులతో పాటే జోనల్‌, మల్టీ జోనల్‌ బదిలీలు

పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌

నెలాఖరుకల్లా విభజన ప్రక్రియ పూర్తి కావాలి

విభాగాధిపతులు, కార్యదర్శులతో సీఎస్‌ సమీక్ష


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విభజనపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నీ సర్దుకుంటే ఈ నెలాఖారుకల్లా విభజనను పూర్తి చేయనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం సోమవారం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించి, తమ శాఖల కార్యదర్శులకు పంపించాలంటూ విభాగాధిపతులను ఆదేశిస్తూ మరో ఉత్తర్వును కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. బుధవారం నుంచి జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులతో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు.


విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరే ప్రక్రియను బుధవారమే ప్రారంభించాలని చెప్పారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితాను తయారు చేయాలని, ఆ సీనియారిటీ ఆధారంగా విభజనను చేపట్టాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో లేని రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ప్రక్రియను మొదట చేపట్టాలని నిర్ణయించారు. నెలాఖరుకల్లా విభజన పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విభజన ప్రక్రియను పరిశీలించడానికి ప్రతి జిల్లాకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తామని సీఎస్‌ వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యోగులతో పాటే జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టాలని సూచించారు. 


సీఎస్‌తో టీఎన్‌జీవో సంఘం నేతల భేటీ

తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల(టీఎన్‌జీవో) సంఘం ప్రతినిధులు మంగళవారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. స్పౌజ్‌ కేసులకు సంబంధించి భార్యాభర్తలను ఒకే జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో ఉంచాలని టీఎన్జీవోల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌ కోరారు. వీటికి అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని కోరారు. దీనికి సీఎస్‌ అంగీకరించారని రాజేందర్‌ తెలిపారు. కాగా, ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో ఉద్యోగులకు మార్గదర్శనం చేయాలని టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, అద్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ జిల్లాల నేతలకు పిలుపునిచ్చారు. ఉద్యోగుల విభజన నేపథ్యం లో మంగళవారం టీజీవో సంఘ సమావేశం ఇక్కడ జరిగింది. అధికారులిచ్చే గడువులోగా ఉద్యోగులంతా ఆప్షన్లు ఇచ్చుకోవాలని, జిల్లాల్లోని సంఘం నేతలు ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. ఉద్యోగుల సర్దుబాటు పూర్తి కాగానే మిగిలిన పోస్టులకు ప్రభుత్వం రికూ్ట్రట్‌మెంట్‌ నోటిఫికేషన్లు ఇస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు. 


కొత్త జిల్లాలవారీగా టీచర్లు వచ్చే విద్యా సంవత్సరమే

కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల ఖరారు ప్రక్రియను ప్రస్తుతానికి రికార్డులకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చోటుకు బదిలీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని చూస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, హేతుబద్ధీకరణను నిర్వహించాల్సి ఉండటంతో స్థానికత ఖరారులో భాగంగా టీచర్లను వెంటనే స్థాన చలనాన్ని చేయకూడదని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులను విభజించాలని, ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విద్యా శాఖలో  సుమారు లక్ష మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండటం, విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం.. విభజన ప్రక్రియలో భాగంగా టీచర్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పంపిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియను అధికారులు, ప్రస్తుతానికి రికార్డుల  వరకే  పూర్తి చేసి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు.


ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన డీఈవోలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులను విభజిస్తే కొన్నిపాఠశాలల్లో ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెరిగే వీలుంది. ఈ విషయంలో సమతుల్యతను సాధించడానికి రేషనలైజేషన్‌ను నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆయా జిల్లాల వారీగా టీచర్లను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఈ ఖరారును పూర్తయిన తర్వాత జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయుల పదోన్నతులు, వెనువెంటనే రేషనలైజేషన్‌ను నిర్వహించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని భావిస్తున్నారు.  

Updated Date - 2021-12-08T15:20:06+05:30 IST