సన్‌రైజింగ్‌ సాంగ్‌

ABN , First Publish Date - 2020-07-01T05:49:17+05:30 IST

కరోనా వచ్చి ఐపీఎల్‌ వాయిదా పడింది కానీ... లేదంటే ఈ పాటికి లిఖిత్‌ దోర్బల పేరు రీసౌండ్‌ ఇచ్చుండేది. ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ అభిమానుల కోసం అతడు కట్టిన బాణీ అంతలా జోష్‌ నింపుతోంది...

సన్‌రైజింగ్‌ సాంగ్‌

కరోనా వచ్చి ఐపీఎల్‌ వాయిదా పడింది కానీ... లేదంటే ఈ పాటికి లిఖిత్‌ దోర్బల పేరు రీసౌండ్‌ ఇచ్చుండేది. ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ అభిమానుల కోసం అతడు కట్టిన బాణీ అంతలా జోష్‌ నింపుతోంది. ‘ఆరెంజ్‌ ఆర్మీ’ అంటూ సాగే ఈ ఇంజనీరింగ్‌ కుర్రాడి వీడియో పాట ఉత్సాహాన్నే కాదు... ఆటలో స్ఫూర్తినీ రగిలిస్తుంది. 


ఓ వీధి... కుర్రాళ్లు క్రికెట్‌ ఆడుతుంటారు. ఆట ఆఖరి క్షణాలకు చేరుకుంది. బ్యాటింగ్‌ జట్టు గెలవాలంటే కావాల్సింది 12 పరుగులు... ఉన్నది 8 బంతులు. ఆ జట్టులో ఓ ఆటగాడు... ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (ఎస్‌ఆర్‌హెచ్‌) అభిమాని... బ్యాటింగ్‌కు వెళాతానంటాడు. కానీ పంపరు. వాడేం పెద్ద ఆటగాడు కాదనేది వాళ్ల నమ్మకం. బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు వచ్చేస్తున్నారు. ఇక మిగిలింది అవకాశం దక్కని ఆ ఆటగాడే! చివరి వికెట్‌గా క్రీజ్‌లోకి వెళ్లి ఆఖరి బంతికి సిక్సర్‌ బాదుతాడు. జట్టును గెలిపిస్తాడు. ‘అండర్‌ డాగ్‌’ అనుకున్నవాడే అద్భుతం సాధిస్తాడు. 


లాక్‌డౌన్‌ నడుస్తుంటే... 

‘మనసులోని లక్ష్యానికి ప్రాణం పోసేద్దాం... మనమంతా రైజప్‌ అని కలిసి నడుద్దాం... రైజర్స్‌ అని చాటి చెబుదాం... ఆశయంతో కసి కసిగా ఆటని గెలిచేద్దాం’ అంటూ మధ్య మధ్యలో మరో యువకుడు హమ్‌ చేస్తూ కనిపిస్తాడు. ఆ కుర్రాడే లిఖిత్‌. ఈ సీనంతా అతడు రూపొందించిన ‘ఆరెంజ్‌ ఆర్మీ’ వీడియో సాంగ్‌లోనిది. ఈ రాక్‌ సాంగ్‌ రాసింది, బాణీ కట్టింది, పాడిందీ అతడే! ఇటీవల ‘ప్రపంచ సంగీత దినోత్సవం’నాడు దీన్ని యూట్యూబ్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశాడు. 21 ఏళ్ల లిఖిత్‌ తొలి ఆల్బమ్‌ ఇదే! ఇందులో లిరిక్స్‌ ఇంగ్లీషు, తెలుగులో ఉండటం మరో ప్రత్యేకత. 

‘‘రెండేళ్ల కిందటే ఈ ట్యూన్‌ కట్టాను. అయితే లిరిక్స్‌ మాత్రం ఈ మధ్యే రాశాను. అవకాశాలు దొరకని ఓ అండర్‌ డాగ్‌ ఆటగాడే చివరకు జట్టును గెలిపిస్తాడు. ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి రూపొందించిన పాట ఇది’’ అంటాడు లిఖిత్‌. అన్నట్టు ఇతడు హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌లోని ‘జోగిన్‌పల్లి బీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌’లో బీటెక్‌ (ఈసీ) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 


పియానో పిచ్చోడు... 

ఇంట్లో ఎవరికీ సంగీతంలో ప్రవేశం లేకపోయినా లిఖిత్‌ మాత్రం పియానోను తెగ ప్రేమిస్తాడు. ఐదేళ్లప్పుడే ఈ వాయిద్యం పనిపట్టడం మొదలుపెట్టాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పియానోలో మునిగిపోతాడు. ప్రతిష్ఠాత్మక ‘లండన్‌ ట్రినిటీ కాలేజ్‌’ నుంచి పియానోలో ఏడో గ్రేడ్‌ సాధించాడంటే అతడి సత్తా ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


‘‘పియానోలో మొత్తం 8 గ్రేడ్స్‌ ఉంటాయి. అందులో నేను 7 పూర్తి చేశాను. ‘లండన్‌ ట్రినిటీ కాలేజ్‌’ వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంగీత కళాకారుల కోసం ఇవి నిర్వహిస్తుంటారు. ఒక్కో గ్రేడ్‌కు ఒక్కో సిలబస్‌ ఉంటుంది. దాని ప్రకారం వాళ్లు అడిగినప్పుడు మనం ప్లే చేయాలి. ఇంకా ఒక్క గ్రేడ్‌ మిగిలి ఉంది. అది కూడా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాను’’ అంటున్న లిఖిత్‌ ఐదేళ్లప్పుడు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. సంగీతం మీద ఇష్టంతోనే కంపోజింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ‘వాసప్‌’ అనే హైదరాబాద్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లో సభ్యుడు కూడా! లిఖిత్‌ తండ్రి సీనియర్‌ పాత్రికేయుడు. అతని బలం కుటుంబమే. అడిగింది కాదనకుండా ప్రోత్సహిస్తున్నారు.  


టార్గెట్‌... సినీ రంగం...  

ఒక పక్క ఇంజనీరింగ్‌ చదువుతూనే మరో పక్క కెరీర్‌ను నిర్మించుకొంటున్నాడు ఈ హైదరాబాదీ. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌కు నేపథ్య సంగీతం కూడా అందించాడు. మరికొన్ని చేస్తున్నాడు. ‘‘నాదగ్గర ఇంకా రెండు పాటలు, కొన్ని ఇనుస్ర్టుమెంటల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి త్వరలో నా తొలి ఆల్బమ్‌ విడుదల చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా.  నా లక్ష్యం సినిమా రంగం. సంగీత దర్శకుడిగా స్థిరపడాలన్నది నా అభిలాష. తద్వారా తెలుగు ప్రేక్షకులకు గతంలో ఎన్నడూ వినని ఓ సరికొత్త సంగీతాన్ని పరిచయం చేయాలి’’ అంటున్న లిఖిత్‌ దోర్బల కల నెరవేరాలని ఆశిద్దాం.




ఇది ఫ్రెండ్స్‌ ప్రాజెక్ట్‌... 

‘ఆరెంజ్‌ ఆర్మీ’ లిఖిత్‌... అతని స్నేహితులు కలిసి రూపొందించిన ప్రాజెక్ట్‌. ‘‘నేను ‘కభీ జో బాదల్‌ బర్సే..’ పాట తరచూ వింటుండే వాడిని. వినీ వినీ ఆ ట్యూన్‌కు ఇంప్రొవైజేషన్‌ చేయడం మొదలుపెట్టాను. అలా కొన్నాళ్లకు అద్భుతమైన బాణీ కుదిరింది. ఈ వీడియోకు దర్శకత్వం, స్ర్కీన్‌ప్లే రవితేజ. కెమెరామెన్‌ కళా పవన్‌. ఇందులో పనిచేసిన అందరూ నాలా ఔత్సాహికులు, స్నేహితులు. అందుకే స్టూడియోలో రికార్డింగ్‌కు తప్ప పెద్దగా ఖర్చు కూడా అవ్వలేదు’’ అని తెర వెనుక కథ చెప్పుకొచ్చాడు లిఖిత్‌.


Updated Date - 2020-07-01T05:49:17+05:30 IST