రేపటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌

ABN , First Publish Date - 2021-05-17T13:05:53+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఇకపై ఆయా ఆస్పత్రుల ద్వారానే రెమ్‌డెసివిర్‌ అందించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిర్ణయించారు...

రేపటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌

సీఎం స్టాలిన్‌ ఉత్తర్వులు

చెన్నై: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న   కరోనా బాధితులకు ఇకపై ఆయా ఆస్పత్రుల ద్వారానే రెమ్‌డెసివిర్‌  అందించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు డిమాండ్‌ పెరగడంతో దాని కోసం జనం గుమిగూడటం వల్ల వైరస్‌ వ్యాప్తి అధికమవుతోందని వైద్యనిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల విక్రయాలను క్రమబద్ధం చేయడానికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధా కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేలు ఆస్పత్రులకు చెందిన వైద్యులే ఎక్కువ సంఖ్యలో రెమ్‌డెసివిర్‌ ప్రతిపాదిస్తున్నారని, ఆ కారణం గానే రోగుల బంధువులు డాక్టర్ల చీటీలను పట్టుకుని రెమ్‌డెసివిర్‌ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల వద్దనున్న విక్రయ కేంద్రాలకు తరలివస్తున్నారని  సీఎంకు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆక్సిజన్‌ ఆధారిత కరోనా బాధితుల అవసరాలను బట్టి రెమ్‌డెసివిర్‌ను ఆ ఆస్పత్రులకు చెందిన మందుల దుకాణాలకు పంపిణీ చేస్తే సమంజసంగా వుంటుందని సూచించారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆక్సిజన్‌ ఆధారిత కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సక్రమంగా అందిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఆ ఇంజెక్షన్లను రోగులకు నిర్ణీత ధరలకే వేస్తున్నాయని, అయితే ఆధికశాతం ప్రైవేటు ఆస్పత్రులు ఆ ఇంజెక్షన్లను దుకాణాల్లో కొనితెమ్మంటూ రోగుల బంధువులకు చీటీలిచ్చి పంపుతున్నాయని చెప్పారు. తొలుత చెన్నై కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రి వద్ద రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం కోవై, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి నగరాల్లోనూ ప్రభుత్వ కౌంటర్ల ద్వారా ఆ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నా జనం ఏ మాత్రం తగ్గటం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అధికారులతో సమగ్రంగా చర్చలు జరిపిన మీదట రెమ్‌డెసివిర్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆక్సిజన్‌ ఆధారిత కరోనా బాధితుల సంఖ్యకు అను గుణంగా ప్రభుత్వమే  నిర్ణీత ధరలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు ఆ మందులను అధిక ధరలకు విక్రయించకుండా స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు తరచూ తనిఖీ చేయా లని ఆదేశించిన స్టాలిన్‌  సమావేశానంతరం ఓ ఉత్తర్వు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆక్సిజన్‌ ఆధారిత కరోనా బాధితులకు ఆయా ప్రైవేటు ఆస్పత్రుల ద్వారానే రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో చేరిన ఆక్సిజన్‌ ఆధారిత కరోనా బాధితుల వివరాలను ఆరోగ్యశాఖ అధికారులకు పంపి, అవసరమైనంతమేరకు రెమ్‌డెసివిర్‌ మందులను పొందవచ్చని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-17T13:05:53+05:30 IST