ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2020-07-07T09:57:29+05:30 IST

జిల్లాలో నిన్నటివరకు ఉపాధ్యాయులు నాడు నేడు పనులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి

ఆందోళన రేకెత్తిస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులు

నిన్నటిదాక నాడు నేడు పనులు

13 నుంచి కొత్త విధులు నిర్వహించాలని ఆదేశాలు 


గుంటూరు(విద్య), జూలై 6: జిల్లాలో నిన్నటివరకు ఉపాధ్యాయులు నాడు నేడు పనులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా ఈనెల 13 నుంచి  వారంలో ఒకటి లేదా రెండు రోజులు పాఠశాలలకు తప్పనిసరిగా రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల్లో దాదాపు ఎనిమిది ప్రధాన విధుల్ని ఉపాధ్యాయులకు కేటాయించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. 


జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 3,043, ప్రాథమికోన్నత పాఠశాలలు 772, ఉన్నత పాఠశాలలు 344 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో  ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా అనేక పనులు ప్రారంభించింది. ఆయా పనులకు నిర్ధేశించిన గడువు విధించి పూర్తిచేయించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష రించకుండా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం ఏమిటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాజుపాలెం మండలం ఉప్పలపాడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మల్లెల శేఖర్‌బాబు మృతి ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 


ఇవీ ప్రధాన విధులు 

కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు ప్రకారం  ప్రధానోపాధ్యాయులు ఈనెల 10లోగా యుడైస్‌ సమాచారం అప్‌లోడు చేయాలి. నాడు నేడు కార్యక్రమాలను పనివిభజన ద్వారా పంచుకుని చేయించాలి. ఇవి ఈనెల 31లోగా పూర్తిచేయాలి. లైబ్రరీ పుస్తకాల పంపిణీ, ప్రాజెక్టు పనులు విద్యార్థులకు ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఈనెల 13 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరై బ్రిడ్జి కోర్సును పరిశీలించాలి. యూపీ, హైస్కూల్‌ ఉపాధ్యాయులు  ప్రతి సోమ, గురువారాల్లో హాజరై బ్రిడ్జికోర్సు, టీవీ పాఠాలను పరిశీలించాలి.


నాడు నేడు పనులకు ఇసుక కొరత

పాఠశాలల్లో నాడు నేడు పనులు ప్రారంభించడానికి ప్రధానంగా ఇసుక కొరత ఇబ్బంది పెడుతోంది. ఆన్‌లైన్‌లో బుక్‌చేస్తే డెలివరీ ఇవ్వడానికి రెండువారాలు పడుతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏదైనా పనులు నాసిరకంగా ఉంటే దీనికి ఉపాధ్యాయుల్ని బాధులుగా చేస్తున్నారు. మరోవైపు నిధులు విడుదల సమస్యగా మారింది. ఒకవేళ నిధులు విడుదలైనా పనులు సకాలంలో పూర్తికావడం లేదు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నా రని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-07T09:57:29+05:30 IST