పాత చట్ట ప్రకారమే..సాదాబైనామాల క్రమబద్ధీకరణ!

ABN , First Publish Date - 2021-01-12T08:10:56+05:30 IST

సాదాబైనామాల దరఖాస్తులను పాత చట్టం ప్రకారమే క్రమబద్ధీ కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో దీనిపై స్పష్టత వచ్చినట్టు

పాత చట్ట ప్రకారమే..సాదాబైనామాల క్రమబద్ధీకరణ!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలో స్పష్టత

వచ్చిన దరఖాస్తుల్లో 10-20 శాతానికే?

పాస్‌పోర్ట్‌తో ఎన్నారైల ఆస్తుల రిజిస్ట్రేషన్‌

రెవె న్యూ కోర్టు కేసులన్నీ కలెక్టర్ల ట్రైబ్యునళ్లకే

పెండింగ్‌ మ్యుటేషన్ల బాధ్యత వారిదే

వారంలో యూజర్‌ ఫ్రెండ్లీ ధరణి: సీఎం


రెవెన్యూ పనులన్నీ కలెక్టర్లే చేయాలి. ఈ అంశాలను కిందిస్థాయి అధికారులకు అప్పగించి, చేతులు దులుపుకోవద్దు. అలా చేస్తే ఆశించిన ఫలితం రాదు. కలెక్టర్లే అన్ని విషయాలనూ స్వయంగా పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టు కేసులు మినహా పార్ట్‌-బీలో చేర్చిన అంశాలన్నింటినీ కలెక్టర్లు పరిష్కరించాలి. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించి, ఆమోదించాలి. 

- కేసీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామాల దరఖాస్తులను పాత చట్టం ప్రకారమే క్రమబద్ధీ కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో దీనిపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 10 నుంచి 20 శాతానికి మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని పాత చట్ట ప్రకారం క్రమబద్ధీకరిస్తారు. మిగిలినవి తిరస్కరణకు గురవ్వవచ్చని తెలుస్తోంది. 2016లో ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 2014 జూన్‌ 2కు ముందు భూ క్రయవిక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న వాటిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో సుమారు 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6.18 లక్షల దరఖాస్తులకు సంబంధించిన సుమారు 2.68 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించారు. 4.19 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ప్రభుత్వం మళ్లీ 2020 అక్టోబరు 12వ తేదీన ఈ పథకాన్ని ప్రకటించింది. అదే నెల చివరి వరకు గడువుగా నిర్ణయించారు.తర్వాత నవంబరు 10 వరకు పొడిగించారు.


అయితే, అక్టోబరు 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కొత్త  రెవెన్యూ(ధరణి) చట్టాన్ని తీసుకువచ్చింది. దాంతో   రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-1971 యాక్ట్‌ రద్దయింది. సాదాబైనామాలను.. ఈ చట్టంలోని సెక్షన్‌-5(ఏ)ను అనుసరించి తెచ్చిన రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ రూల్స్‌-1989లోని రూల్‌-22 ప్రకారం ఫారం-10లో దరఖాస్తు చేసుకున్నవారికి 13బీ సర్టిఫికెట్‌ (తెల్లకాగితానికి చట్టబద్ధత కల్పిస్తూ) జారీచేస్తారు. ఇలా అక్టోబరు 29వ తేదీ నాటికి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2.26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు పొడిగింపు తర్వాత మరో 6.74 లక్ష లు వచ్చాయి.


కానీ, అక్టోబరు 29వ తేదీ నాటికి వచ్చిన వాటినే పరిశీలనలోకి తీసుకోవాలని.. ఆ తర్వాత స్వీక రించిన దరఖాస్తులపై ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. దాంతో పాత చట్టం అమల్లో ఉన్న సమయానికి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన 9 లక్షల దరఖాస్తుల్లో చాలా వరకు మొదటిసారి తిరస్కరించినవే ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ల పరిశీలనలో తేలినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సమావేశంలో కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. 

Updated Date - 2021-01-12T08:10:56+05:30 IST