అసలు‘రంగు’

ABN , First Publish Date - 2021-03-11T06:37:44+05:30 IST

ప్రిన్స్‌హ్యారీతో వివాహమైన తరువాత బ్రిటిష్‌ రాజకుటుంబంలో తాను అనుభవించిన అవమానాలు, వివక్షలనూ వివరిస్తూ నటి మేఘన్‌ మర్కెల్...

అసలు‘రంగు’

ప్రిన్స్‌హ్యారీతో వివాహమైన తరువాత బ్రిటిష్‌ రాజకుటుంబంలో తాను అనుభవించిన అవమానాలు, వివక్షలనూ వివరిస్తూ నటి మేఘన్‌ మర్కెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకుటుంబంలో ఇమడలేని వాతావరణం ఏర్పడటంతో ఈ దంపతులు అన్ని హోదాలూ వదులుకొని ఏడాదిక్రితం బయటకు వచ్చేశారన్న విషయం తెలిసిందే. కొన్ని ఇళ్ళల్లో కొత్తకోడలు సూటిపోటిమాటలు, అత్తింటి ఆరళ్ళూ ఎదుర్కొన్నట్టుగా రాజకుటుంబంలో మేఘన్‌ అంతకంటే ఘోరమైన అవమానాలను చవిచూశారన్న వాస్తవాన్ని్ ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూ తెలియచెప్పింది. 


నల్లజాతి మహిళలు జాతి, లింగ వివక్షలూ రెండింటినీ చవిచూస్తారన్న వాదనకు ఈ ఇంటర్వ్యూ నిదర్శనం. ఓప్రా విన్‌ఫ్రేతో మేఘన్‌ ఇంతగా మనసు విప్పిమాట్లాడటానికి ఆ వివక్షనూ బాధను ఆమె సరిగ్గా అర్థంచేసుకోగలదన్న నమ్మకం కూడా కావచ్చు. అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేయడంలో ఓప్రాది అందెవేసిన చెయ్యి. తన వ్యాఖ్యలతో, విమర్శలతో రాజకుటుంబాన్ని ఇరకాటంలోకి నెట్టాలనీ, కక్ష సాధించాలనీ మేఘన్‌కు ఉన్నట్టు కనబడదు. మేఘన్‌కు యుక్తవయసునుంచే రాజకుటుంబం అంటే మోజు ఉన్నందున ఆమె దురుద్దేశంతోనే ప్రిన్స్‌ను వలలో వేసుకున్నట్టుగా, ఆ తరువాత కుటుంబాన్ని ఆమే చీల్చినట్టుగా ఈ ఇంటర్వ్యూ తరువాత బురదజల్లే ప్రయత్నం కూడా జరిగింది. రాజకుటుంబాన్ని బజారుకు ఈడ్చాలన్న ఉద్దేశమే ఉంటే దంపతులు ఇలా అన్నీ వదులుకొని అమెరికా తరలిపోయేవారు కాదు. దాదాపు మూడేళ్ళు తాను అనుభవించిన నరకాన్ని ఆ రెండుగంటల కాలంలో మేఘన్‌ ఎంతో జాగ్రత్తగా వివరించారు. వివాహం రోజున ఎదురైన అవమానంతో ఆరంభమైన ఆరళ్ళు ఆమెను చివరకు ఆత్మహత్య చేసుకోవాలనిపించే స్థితికి నెట్టేశాయి. పుట్టబోయే బిడ్డ ఎలాగూ నల్లగా ఉంటాడు కనుక యువరాజు హోదా, రాజకుటుంబీకులకు ఇచ్చే భద్రత ఇవ్వకూడదన్న చర్చ క్వీన్‌ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న జాఢ్యాలను వెలుగులోకి తెచ్చింది. ఎవరా మాటన్నది అంటూ ఓప్రా గట్టిగా రెట్టించినప్పటికీ మేఘన్‌ నోరువిప్పకపోవడం ద్వారా రాజకుటుంబాన్ని నిజానికి రక్షించింది. ఈ తరహా వివక్షలూ, అవమానాల కారణంగానే తాము దూరంగా వచ్చేసినట్టు హ్యారీ కూడా నిర్థారించారు. బ్రిటిష్‌ టాబ్లాయిడ్ల వివక్షాపూరిత కథనాలు సైతం రాజకుటుంబీకుల వైఖరిని ప్రభావితం చేసి, గాలి కబుర్లకూ, వివక్షలకూ ఆధారాలైనాయి. హ్యారీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాబ్లాయిడ్లే తమ కుటుంబాన్ని చీల్చాయని ఘాటుగా అన్నాడు. వాటి కారణంగానే అతడి తల్లిదండ్రులు ప్రిన్స్‌ చార్లెస్‌, డయానాలు విడిపోయారు. డయానా మరణానికి కూడా అవే కారణం. కుమారుడికోసం ఆమె మిగల్చిన సొమ్మే ఇప్పుడు ఈ దంపతులను కష్టకాలంలో ఆదుకున్నది. దూరంగా పోయినా సరే, రాజకుటుంబం వీరిమీద కక్షసాధిస్తూనే ఉన్నది. ఇలా వేరుపడటానికి మేఘన్‌ కారణం కాదంటూ, అటువంటి స్థితిలో ఒక భర్తగా, తండ్రిగా ఏం చేయాలో తాను అదేచేశానంటూ అంటూ హ్యారీ ఇచ్చిన వివరణ అతడి పరిపక్వతకు నిదర్శనం. 


హ్యారీ, మేఘన్‌లు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఎంతగానో బాధపడుతున్నామనీ, మరీముఖ్యంగా వర్ణవివక్షకు సంబంధించి వ్యక్తమైన అంశాలు చాలా తీవ్రమైనవనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించుకొనేందుకు కృషి జరుగుతుందంటూ బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ ఎంతో జాగ్రత్తగా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కుటుంబానికి ఆ దంపతులు ఎప్పటికీ ప్రియమైనవారేనన్న వ్యాఖ్యలో నిజం లేదు. ద్వేషాలు, అసూయలు, అహంభావాలతో పాటు వర్ణవివక్ష రాజకుటుంబంలో ఎంతగా పాతుకుపోయి ఉన్నదో ఈ ఇంటర్వ్యూ ప్రపంచానికి తెలియచెప్పింది. హ్యారీ మేఘన్‌ వివాహం ప్రతిపాదనే ప్యాలెస్‌లో చిచ్చురేపిందని అప్పట్లో పత్రికలు రాశాయి. కానీ, ఆ వివాహం ఘనంగా జరగడంతో హ్యారీ కుటుంబీకులు మనసారా ఆమెను స్వాగతించారని అంతా భ్రమపడ్డారు. అది నిజం కాదని అనతికాలంలోనే తేలిపోయింది. హ్యారీ అన్నట్టుగా రాజకుటుంబం ఒక వల. తండ్రి చిక్కుకొని ప్రేమించినామెను వదులుకున్నాడు, కొడుకు బయటపడి ప్రేమను నిలబెట్టుకున్నాడు.

Updated Date - 2021-03-11T06:37:44+05:30 IST