నేనాడను.. పొండి!

ABN , First Publish Date - 2021-06-02T08:52:50+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టైటిల్‌ ఫేవరెట్‌, ప్రపంచ రెండో ర్యాంక్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా టోర్నీ నుంచి తప్పుకొంది...

నేనాడను.. పొండి!

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగిన ఒసాకా
  • మానసిక ఆందోళనే కారణమని వెల్లడి
  • బహిష్కరిస్తామన్న నిర్వాహకులకు జపాన్‌ స్టార్‌ ఝలక్‌


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టైటిల్‌ ఫేవరెట్‌, ప్రపంచ రెండో ర్యాంక్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా టోర్నీ నుంచి తప్పుకొంది. టోర్నీకి ముందు మీడియాను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ జపాన్‌ స్టార్‌.. ఇప్పుడు ఏకంగా ఈవెంట్‌కే దూరమై అందరినీ షాక్‌కు గురిచేసింది. కొన్నాళ్లుగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నానని, కొద్దిరోజులు ఆటకు విరామం ఇవ్వాలనుకుంటున్నందున టోర్నీలో ఆడాలనుకోవడం లేదని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. సింగిల్స్‌ తొలిరౌండ్‌ గెలిచిన 23 ఏళ్ల ఒసాక.. బుధవారం రెండోరౌండ్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి దూరమవడంపై ఆమె ట్విటర్‌లో సుదీర్ఘ లేఖ రాసింది. ‘వైదొలగాలని ముందే ప్రకటించడం టోర్నీతో పాటు మిగతా క్రీడాకారులకు మంచిదని భావిస్తున్నా. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నా. దానినుంచి బయటపడేందుకు చాలా కష్టపడుతున్నా. తరచూ సంగీతం వింటా.ఎప్పుడూ చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవడానికి కారణం అదే. అంతేతప్ప నేనేదో పరధ్యానంగా ఉంటానని కాదు. నేను పబ్లిక్‌ స్పీకర్‌ను కాను. అందుకే ప్రపంచ మీడియాతో మాట్లాడేటప్పుడు తీవ్ర ఆందోళన చెందుతా. పారిస్‌ టోర్నీలో కూడా అదే ఆందోళనతో ఉన్నా. స్వీయరక్షణ కోసమే మీడియా సమావేశాన్ని నిరాకరించా. ప్రస్తుతం నా టైమ్‌ బాగాలేదు. ఆటలో నిబంధనలు పాతవైపోయాయి. మీడియా ప్రతిసారీ నా పట్ల సానుకూలంగానే స్పందించింది. ఈసారి సమావేశాలకు హాజరు కాలేనందుకు వారికి క్షమాపణ చెబుతున్నా’ అని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఒసాకా ట్వీట్‌ చేసింది.


ఒసాకాను హత్తుకోవాలనుంది: సెరెనా

మానసిక ఆందోళన నేపథ్యంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడాలనుకోవడం లేదన్న ఒసాకా నిర్ణయానికి అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌తోపాటు సహచరులు, ఇతర క్రీడాకారులు మద్దతు తెలిపారు. ‘ఆమెకు ఓ హగ్‌ ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఎలాంటి పరిస్థితో నాకు తెలుసు. నేను కూడా గతంలో ఇలాంటివి ఎదుర్కొన్నా. ఇలాంటి  సమయంలో అందరూ ఒకేలా స్పందించాలని లేదు. ఒసాకా ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేస్తుందో అలాగే చేయనివ్వండి’ అని సెరెనా వ్యాఖ్యానించింది. ‘టెన్నిస్‌ క్వీన్‌.. ఈ పరిస్థితుల్లో మేమంతా మీ వెంటే’ అని గతంలో మీడియా సమావేశాన్ని బహిష్కరించి భారీ జరిమానాకు గురైన ఎన్‌బీఏ స్టార్‌ కైరీ ఇర్విన్‌ ట్వీట్‌ చేశాడు. ఇక, ఒసాకాకు సెరెనా సోదరి వీనస్‌ విలియమ్స్‌తో పాటు బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి లారా రాబ్సన్‌ కూడా మద్దతు ప్రకటించారు. 


ఎందుకిలా..?

ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు మానసికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, అందుకే మ్యాచ్‌కు ముందు-తర్వాత మీడియా సమావేశానికి హాజరుకానని టోర్నీకి ముందే ఒసాకా ప్రకటించింది. అనుకున్నట్టే తొలిరౌండ్‌ తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో టోర్నీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిందన్న కారణంతో ఒసాకాపై నిర్వాహకులు 15వేల డాలర్లు జరిమానా విధించారు. అంతేకాదు.. తన నిర్ణయం మార్చుకోకుంటే,  ఆమెపై బహిష్కరణ వేటు కూడా వేస్తామని ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు యూఎస్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు సంయుక్తంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఒసాకా స్వచ్ఛందంగా తప్పుకొంటూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


Updated Date - 2021-06-02T08:52:50+05:30 IST