11 ఏళ్ల క్రితం బైడెన్ గురించి లాడెన్ రాసిన లేఖ.. అఫ్ఘాన్ పరిస్థితుల నేపథ్యంలో హాట్ టాపిక్

ABN , First Publish Date - 2021-08-23T17:11:36+05:30 IST

ఒసామా బిన్‌లాడెన్.. ఈ పేరును బహుశా ప్రపంచం ఎన్నటికీ మర్చిపోదేమో. మిగిలిన దేశాల గురించి పక్కన పెడితే.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడి పేరును కచ్చితంగా జ్ఞప్తికి ఉంచుకుంటుంది. దానికి కారణం 9/11 దాడే. న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడులతో

11 ఏళ్ల క్రితం బైడెన్ గురించి లాడెన్ రాసిన లేఖ.. అఫ్ఘాన్ పరిస్థితుల నేపథ్యంలో హాట్ టాపిక్

వాషింగ్టన్: ఒసామా బిన్‌లాడెన్.. ఈ పేరును బహుశా ప్రపంచం ఎన్నటికీ మర్చిపోదేమో. మిగిలిన దేశాల గురించి పక్కన పెడితే.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడి పేరును కచ్చితంగా జ్ఞప్తికి ఉంచుకుంటుంది. దానికి కారణం 9/11 దాడే.  న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడులతో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దాడిలో సుమారు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 6వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో 2011, మే2న బిన్‌ లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే పదేళ్ల కిందటే మట్టిలో కలిసిపోయిన బిన్ లాడెన్ పేరు.. అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. జో బైడెన్‌పై బిన్‌లాడెన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని బిన్ లాడెన్ అప్పట్లో బలంగా కోరుకున్నాడని.. తద్వారా అమెరికా పతనాన్ని చూడాలని లాడెన్ ఆకాక్షించాడనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



అమెరికా బలగాలు ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత యూఎస్ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో లాడెన్ తన సహచరుడైన అతియా అబ్ద్ అల్ రహమాన్ అనే వ్యక్తికి 2010లో రాసిన 48 పేజీల లేఖ కూడా ఉంది. ఈ లేఖలోనే జో బైడెన్ గురించి బిన్ లాడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి చర్చనీయాంశం అయ్యాయి. ఆ లేఖలోని సమాచారం ప్రకారం.. అల్ ఖైదా ముఖ్యనేత ఒసామా బిన్‌లాడెన్ బతికుండగా.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఒబామాతోపాటు అప్పటి యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ డేవిడ్ పెట్రస్‌‌ను కూడా అంతం చేసేందుకు బిన్ లాడెన్ తన అనుచరులతో పలుమార్లు చర్చలు జరిపాడు. 


ఒబామా, డేవిడ్ పెట్రస్ చావును చూడాలనుకున్న బిన్ లాడెన్.. అప్పట్లో అమెరికా ఉపాధ్యక్షుడి పదవిలో ఉన్న బైడెన్‌ను అంతం చేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. పైగా బైడెన్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో టార్గెట్ చేయొద్దని బిన్‌ లాడెన్ తన అనుచరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. ఒబామాను మట్టుబెట్టడం ద్వారా అక్కడి చట్టాల ప్రకారం.. జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేపడతాడని బిన్ లాడెన్ తన అనుచరులకు తెలిపాడు. అదే జరిగితే బైడెన్ తన అసమర్థ పాలనతో అమెరికాను సంక్షోభం వైపు నడిపిస్తాడని.. దాంతో అగ్రరాజ్యం పతనం ప్రారంభమవుతుందని బిన్ లాడెన్ లేఖలో అభిప్రాయపడ్డాడు. 



కాగా.. అఫ్ఘానిస్థాన్ నుంచి దళాలను వెనక్కి పిలుస్తూ అమెరికా ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా జులై 8న అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ.. ఆఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం లేదని, కాబూల్‌లో గందరగోళం నెలకొనే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమెరికా దళాలు వెనక్కి వెళ్లడంతో.. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకుని, కల్లోలం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బైడెన్‌పై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో జో బైడెన్‌ను అసమర్థుడిగా అభివర్ణిస్తూ ఒసామా బిన్‌లాడెన్ లేఖలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. 


Updated Date - 2021-08-23T17:11:36+05:30 IST