కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-09-13T20:56:08+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ సోమవారంనాడు..

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

మంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ సోమవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గత జూలైలో ప్రమాదవశాత్తూ కిందపడంతో తీవ్రంగా గాయపడిన ఫెర్నాండెజ్‌ను స్థానిక ఆసుపత్రులోని ఐసీయూలో చేర్చారు. వైద్యులు రొటీన్ డయాలసిస్‌తో పాటు రెగ్యులర్ చెకప్‌లు చేస్తూ వస్తారు. కాగా, ఫెర్నాండెజ్ మృతి వార్తను ఆయన సభ్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఉడిపిలో 1941 మార్చి 27న జన్మించిన ఆస్కార్ ఫెర్నాండెజ్ కాంగ్రెస్ స్థానిక విభాగం సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో రవాణా, రోడ్లు, హైవేల మంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1996లో ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1980 దశకంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా, 1989 నుంచి 1999 వరకూ కేపీసీసీ సభ్యుడిగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి పార్లమెంట్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. 1980లో తొలిసారిగా 7వ లోక్‌సభకు ఉడిపి నియోజకవర్గం నుంచి ఎన్నిక్యయారు. 1984, 1989, 1991, 1996లో తిరిగి ఎన్నికయ్యారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2004 నుంచి 2009 వరకూ కేద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, యువజన క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఉడిపి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా 1972 నుంచి 1976 వరకూ సేవలందిచారు. బహుముఖ  ప్రజ్ఞావంతుడిగా పేరున్న ఆయనకు వాలీబాల్, స్మిమ్మింగ్ అంటే ఎంతో మక్కువ. ఢిల్లీలో కూచిపూడి నృత్యం సైతం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి మౌత్ ఆర్గాన్ వాయించడమంటే ఇష్టం. రాజకీయాల్లో చురుకుగా పనిచేయడానికి ముందు హోర్మోనియం, కీబోర్డ్, తబలా, గీతాల కంపోజింగ్, సింగింగ్ వంటివి చేసేవారు.


Updated Date - 2021-09-13T20:56:08+05:30 IST