తొలుత కాల్పులు జరిపింది మావోలే

ABN , First Publish Date - 2021-06-23T05:21:49+05:30 IST

కొయ్యూరు మండలం మంప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తీగలమెట్ట అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై తొలుత మావోయిస్టులే కాల్పులు జరిపారని ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌ చెప్పారు.

తొలుత కాల్పులు జరిపింది మావోలే
విలేకరులతో మాట్లాడుతున్న ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌

లొంగిపొమ్మని చెప్పినా వినలేదు

అందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది

గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే వైద్య సేవలు అందిస్తాం

ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌ 


నర్సీపట్నం, జూన్‌ 22: కొయ్యూరు మండలం మంప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తీగలమెట్ట అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై తొలుత మావోయిస్టులే కాల్పులు జరిపారని ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సమాచారం రావడంతో ఈ నెల 15వ తేదీన ఆ ప్రాంతంలో కూంబింగ్‌ ప్రారంభించామని తెలిపారు. మరుసటి రోజు ఉదయం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో 15 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు... లొంగిపోవాలని హెచ్చరించినట్టు తెలిపారు. కానీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వాస్తవంగా అక్కడ రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎదురు కాల్పులు జరిగినట్టు ఓఎస్‌డీ చెప్పారు. తొలుత ఒక ప్రదేశంలో ఎదురు కాల్పులు జరగ్గా ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారని, అక్కడికి 400 మీటర్ల దూరంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగి ఒక మావోయిస్టు మృతి చెందారని వెల్లడించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎదురు కాల్పుల్లో మృతిచెందిన డీసీఎంలు రణదేవ్‌, గంగయ్యలపై రూ.5 లక్షల చొప్పున, ఏసీఎం సంతుపై రూ.4 లక్షలు, మిగిలిన ముగ్గురు మావోయిస్టులపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయన్నారు. నలుగురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని చెప్పారు. మిగిలిన మృతదేహాలను తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో జాతీయ మానవహక్కుల కమిషన్‌ నిబంధనల ప్రకారం 72 గంటల అనంతరం మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి, తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే వైద్య సేవలు అందిస్తామని ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌ తెలిపారు.



Updated Date - 2021-06-23T05:21:49+05:30 IST